సహజీవనంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

సహజీవనం చట్టబద్ధం కాదని, సహజీవనం ద్వారా కలిగిన సంతానానికి ఆస్తిలో హక్కులుండవని గతంలో పలు కోర్టు తీర్పులున్నాయి. అయితే వాటన్నిటినీ పక్కనపెడుతూ.. సుప్రీంకోర్టు సరికొత్త తీర్పునిచ్చింది.  Advertisement సహజీవనం తప్పా, ఒప్పా అనే విషయాన్ని…

సహజీవనం చట్టబద్ధం కాదని, సహజీవనం ద్వారా కలిగిన సంతానానికి ఆస్తిలో హక్కులుండవని గతంలో పలు కోర్టు తీర్పులున్నాయి. అయితే వాటన్నిటినీ పక్కనపెడుతూ.. సుప్రీంకోర్టు సరికొత్త తీర్పునిచ్చింది. 

సహజీవనం తప్పా, ఒప్పా అనే విషయాన్ని పక్కనపెడితే.. సహజీవనం కూడా వివాహం లాంటిదేనని, సహజీవనం ద్వారా కలిగిన సంతానానికి తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ 144 ఇదే విషయాన్ని చెబుతోందని పేర్కొంది సుప్రీంకోర్టు.

అసలెందుకీ చర్చ..

2009లో కేరళ హైకోర్టు ఓ తీర్పునిచ్చింది. సహజీవనం ద్వారా కలిగిన సంతానానికి తండ్రి పూర్వీకుల ఆస్తిలో హక్కు లేదని తేల్చి చెప్పింది. అయితే బాధిత తల్లీకొడుకులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంలో కూడా సుదీర్ఘ కాలం వాదోపవాదాలు జరిగాయి. చివరకు సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలో సంచలన తీర్పునిచ్చింది. 

సహజీవనం ద్వారా కలిగిన సంతానానికి సర్వహక్కులు ఉంటాయని చెప్పింది. గతంలో కూడా అక్రమ సంతానం అనేది ఎక్కడా ఉండదని, తల్లిదండ్రులు చేసిన తప్పులకు పిల్లలు అక్రమ సంతానం ఎలా అవుతారని ప్రశ్నించింది కోర్టు.

జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ విక్రమ్ నాథ్ తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేరళ హైకోర్టు తీర్పుతో విభేదిస్తూ తాజా తీర్పుని ఇచ్చింది. అయితే ఇలాంటి కేసుల్లో సదరు ఆస్తి హక్కు కోసం వేసిన పిటిషన్ ని ఎవరైనా సవాల్ చేసే అవకాశం ఉంటుంది. 

అయితే ఆ సవాల్ చేసినవారే.. ఆ బిడ్డ ఆ తల్లిదండ్రులకు పుట్టలేదని నిరూపించాల్సి ఉంటుంది. వారి మధ్య సహజీవనం కూడా జరగలేదని నిరూపించాల్సి ఉంటుంది. అలా వారిద్దరూ కలసి జీవించలేదని రుజువు చేస్తే తప్ప.. వారికి పుట్టిన బిడ్డలకు ఆస్తి నిరాకరించే అధికారం తల్లిదండ్రులకు ఉండదు.

సుప్రీంకోర్టు తాజా తీర్పుతో, ఇకపై సహజీవనానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా కీలకం కానున్నాయి. మొన్నటివరకు సహజీవనం అనేది ఓ బ్రహ్మపదార్థంగా ఉండేది. ఎవరికి నచ్చిన అర్థాలు, ఎవరికి తోచిన విశ్లేషణలు వాళ్లు ఇచ్చుకున్నారు. కానీ అదే సహజీవనం ద్వారా పిల్లల్ని కంటే మాత్రం ఆస్తిలో హక్కు ఇవ్వాల్సిందే. 

అలా హక్కు పొందాలనుకునే వాళ్లు.. సహజీవనం టైమ్ కు సంబంధించిన సాక్ష్యాలను సమర్పించాల్సి ఉంటుంది.