ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ప్రేమించే వాళ్లు ఎంత మంది ఉంటారో, అదే సంఖ్యలో వ్యతిరేకించే వాళ్లు కూడా ఉంటారు. జనాదరణ నేతకెవరికైనా ఇలాంటివి తప్పవు. బహుశా జగన్‌పై దుష్ప్రచారం జరిగినట్టుగా, దేశంలో మరే నేతపై సాగి వుండదనడంలో అతిశయోక్తి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మీడియా, జగన్ ప్రత్యర్థులు వేర్వేరు కాదు. జగన్ ప్రత్యర్థుల కంటే ఒకింత తామే ఎక్కువని ఎల్లో మీడియా ఊహించుకుంటూ వుంటుంది. ప్రత్యర్థులు, ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి, ప్రజల ఆదరణ పొంది చివరికి సీఎం పదవిని జగన్ దక్కించుకున్నారు.
ఇది అసాధరణమే అని చెప్పాలి. ఎందుకంటే జగన్ ఓడించింది నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును మాత్రమే కాదు. మీడియా రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న రామోజీరావు, వేమూరి రాధాకృష్ణ తదితరులను అని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో అనేక సందర్భాల్లో జగన్ ప్రతిపక్షాలతో పాటు ఎల్లో మీడియాపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇవాళ కూడా మరోసారి వారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తనకు వ్యతిరేకంగా ఎన్నో శక్తులు ఏకమైనప్పటికీ, జగన్ మాత్రం భయపడరు. అంతేకాదు, అలాంటి దుష్టచతుష్టయాన్ని ఎదుర్కోడానికి అతను కోరుకునేవి రెండే రెండు. అవేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో జరిగిన కార్యక్రమంలో రైతన్నలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని మంగళవారం వారి ఖాతాల్లో సీఎం జగన్ నేరుగా జమ చేశారు. సీఎం మాట్లాడుతూ రైతులను ఆదుకోవడంలో గత ప్రభుత్వానికి, ప్రస్తుత తన ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని గుర్తించాలని కోరారు.
గతంలో మాదిరిగా మోసాలు చేసే పరిస్థితి ఇప్పుడ లేదన్నారు. మాట ఇచ్చి తప్పితే.. రైతు ఏమవుతాడన్న బాధ కూడా గత పాలకులకు లేకపోవడాన్ని మనం చూశామన్నారు. అలాంటి వాళ్లు రాజకీయాలకు తగునా? అని ప్రశ్నించారు. చంద్రబాబు మోసాన్ని అందరూ చూశారన్నారు. చంద్రబాబుకు ఏం చేస్తే మంచి జరుగుతుందో, అది చేయడానికి ఉరుకులు పరుగులు తీసే మరో వ్యక్తి దత్తపుత్రుడని పవన్‌కల్యాణ్‌పై సెటైర్స్ విసిరారు. ప్రజలను మోసం చేసి, తోడుదొంగలైన వీరిద్దరు రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా? అని నిలదీశారు.
అలాగే మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నామంటే … దాన్ని పక్కదారి పట్టించడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఒక టీవీ–5, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు.. వీళ్లంతా ఏకం అవుతారని జగన్ చెప్పుకొచ్చారు. ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా .. అబద్ధానికి రంగులు పూస్తారని, అప్రమత్తంగా ఉండాలని జనాన్ని హెచ్చరించారు. మూడేళ్ల తర్వాత మీ బిడ్డ వచ్చి, మేనిఫెస్టో చూపి, అమలు చేశామని చూపి, మీరే టిక్ పెట్టి ఆశీర్వదించండి అని అడుగుతున్నాడని జగన్ అన్నారు.
ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా.. మీ బిడ్డ ఎదుర్కోగలడని జగన్ అన్నారు. దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులతో మీ బిడ్డ ఎవ్వరినైనా ఎదుర్కోగలడని జగన్ స్పష్టం చేశారు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు… ఈ రెండూ ఉంటే చాలు ఎవరినైనా ఎదిరించి పోరాడుతానని జగన్ మరోసారి తేల్చి చెప్పినట్టైంది.