ఎక్సైజ్‌శాఖ ఉద్యోగుల బదిలీలను ఒకరిద్దరు అత్యున్నత అధికారులు ఆర్థికంగా సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూల్స్‌కి విరుద్ధంగా బదిలీల ప్రక్రియను చేపట్టినట్టు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఒక్కోశాఖకు ఒక్కో నిబంధన ఉంది. ఐదేళ్లు ఒకే చోట పని చేస్తూ వుంటే తప్పక బదిలీ జరగాలనే నిబంధన ఉంది. ప్రస్తుతం ఎక్సైజ్‌శాఖలో బదిలీలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ శాఖలో బదిలీలను సొమ్ము చేసుకునే పనిలో ఒక ఉన్నతాధికారి ఉన్నట్టు విమర్శలున్నాయి. ఇంత వరకూ బదిలీలకు మూడేళ్ల కాలపరిమితి ఉండగా, తాజాగా దాన్ని రెండేళ్లకు కుదించడం ఆరోపణలకు బలం కలిగిస్తోంది.
ఎక్సైజ్‌శాఖను జగన్ ప్రభుత్వం రెండు రకాలుగా విభజించింది. అక్రమ రవాణా, అధిక ధరల వసూలు, పొరుగు రాష్ట్రాల మద్యం విక్రయాలు తదితరాలపై నిఘా ఉంచేందుకు జగన్ ప్రభుత్వం స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్)ను ఏర్పాటు చేసింది. ఎక్సైజ్‌లోని 70 శాతం మంది ఈ విభాగంలో పని చేస్తారు. వీళ్లకు పోలీసులను కూడా లింక్ చేశారు. ప్రభుత్వ మద్యం దుకాణాల నిర్వహణను మాత్రం ఎక్సైజ్‌కు అప్పగించింది. డిపోల నుంచి మద్యం దిగుమతి, విక్రయాలు, నగదు లావాదేవీలు, దుకాణాల్లో పనిచేసే వాళ్ల నిర్వహణ బాధ్యత వీరిదే.
సెబ్ నుంచి ఎక్సైజ్‌కు వస్తామని అక్కడి ఉద్యోగులు ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. పోలీసుల దగ్గర ఎక్సైజ్ సిబ్బంది ఇమడలేకపోతున్నారని తెలిసింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లుగా తాము సెబ్‌లో పని చేస్తున్నామని, కావున తమను ఎక్సైజ్‌కు పంపాలనే డిమాండ్లు వస్తున్నాయి. అయితే ఇదే సమయంలో బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నిజానికి మూడేళ్ల వరకూ ఎవర్నీ కదిలించకూడదు.
ఈ నేపథ్యంలో మూడేళ్ల నుంచి రెండేళ్లకు నిబంధన సడలించడం వెనుక భారీ మొత్తంలో డబ్బు చేతులు మారినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు రూ.75 లక్షలు హోదాను బట్టి అధికారులకు ముట్టజెప్పినట్టు ఆ శాఖ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. బదిలీ కోసం ఎవరెవరు ఎంతెంత మొత్తం ఇచ్చారనే చర్చ ఎక్సైజ్‌శాఖలో విస్తృతంగా జరగడం గమనార్హం.
ప్రభుత్వ పెద్దలకు తెలియకుండానే నిబంధనలు మార్చారనే చర్చకు తెరలేచింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌శాఖకు పట్టిన అవినీతి మత్తును వదిలించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగుల బదిలీలను పారదర్శకంగా చేపట్టాలనేది ప్రభుత్వ ఆశయం. ఎక్సైజ్‌శాఖలో బదిలీలపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.