ఇటీవల చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం చేస్తున్నారు. దాని కోసం గతంలో 5 కోట్ల రూపాయలతో ఓ ఫండ్ కేటాయించారు. చనిపోయిన కౌలు రైతుల కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తూ ఆ మధ్య కౌలురైతు భరోసా యాత్ర కూడా ప్రారంభించారు.
అయితే ఇప్పుడీ ఫండ్ కోసం మెగా ప్యామిలీ కూడా చందాలిచ్చేసింది. ఏ హీరో ఎంతిచ్చారనేది కూడా లిస్ట్ ఇచ్చారు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక.. ఇలా తలా కొంత సాయం చేశారు. మొత్తానికి కౌలు రైతుల సాయం కోసం మెగా ఫ్యామిలీ కూడా ముందుకు కదిలిందన్న ప్రచారం మొదలైంది.
జనసేనకు మెగా అండ..
ప్రజా రాజ్యం పార్టీ అనేది మెగా ఫ్యామిలీ పార్టీ. కానీ జనసేన విషయానికొచ్చేసరికి మెగా ఫ్యామిలీని పూర్తిగా కలుపుకోలేకపోయారు. అల్లు అరవింద్ మొదటినుంచీ పూర్తిగా దూరంగానే ఉన్నారు. చెప్పను బ్రదర్ అంటూ బన్నీ కూడా జనసేనతో అంటీ ముట్టనట్టే ఉన్నారు. ఇటీవల చిరంజీవి.. సీఎం జగన్ ని పొగిడేసే సరికి ఆయన ఆశీస్సులు జనసేనకు ఉన్నాయో లేవో అన్న అనుమానం ఉంది. రాగా పోగా.. నాగబాబు ఒక్కరే మెగా ఫ్యామిలీ నుంచి జనసేనలో కనపడుతున్నారు.
అయితే ఇటీవల మెగా ఫ్యాన్స్ ని జనసేనకు దగ్గర చేసే ప్రయత్నం జరిగింది. ఆ మీటింగ్ లో అల్లు అరవింద్ పై సెటైర్లు పేలాయి. దీంతో ఆ కాస్త బంధం కూడా పుటుక్కున తెగిపోయింది. ఇక అల్లు ఫ్యామిలీ కాకుండా అచ్చమైన మెగా ఫ్యామిలీ దీవెనలు జనసేనకు అవసరం అని అనుకున్నారేమో.. వారందర్నీ లైన్లోకి తెచ్చారు.
మెగా ఫ్యాన్స్ మీటింగ్ తో అనుకున్నంత క్రేజ్ రాకపోయే సరికి, మెగా ఫ్యామిలీ చందాల కార్యక్రమంతో అయినా కాస్త ప్యాచప్ చేయాలని అనుకుంటున్నారు. సినిమాల్లో చాలామందికి మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిగతంగా సాయం చేశారు, చేస్తున్నారు కూడా. కానీ ఇలా ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదు. పవన్ మాత్రం తన రాజకీయ జీవితానికి ప్రచారమే పరమావధి అనుకున్నారు. తనతోపాటు, మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులను కూడా ప్రచారంలోకి తీసుకొచ్చారు.
ఎన్నికలనాటికి మెల్లగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రచారంలోకి వచ్చే అవకాశముంది. కనీసం పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంలో అయినా ఈసారి మెగా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారని అంటున్నారు. పార్టీ గెలిచినా, గెలవకపోయినా.. పవన్ కల్యాణ్ అసెంబ్లీకి వెళ్లాలనేది వారి ఆలోచన. అందుకే మెగా ఫ్యామిలీ అంతా పవన్ కోసం ఒక్కటవబోతోంది. మరి ఈ ఐక్యతా రాగంలోకి బన్నీ చేరతాడా? కాలమే సమాధానం చెప్పాలి.