''ఒక్క పాటకే యింత ఉలికిపాటా?'' అనే వ్యాసానికి స్పందిస్తూ ఒక పాఠకుడు ''లక్ష్మీస్ ఎన్టీయార్''లో వర్మ నిష్పక్షపాతంగా అన్నీ నిజాలే తీస్తారని గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా? అని అడిగారు. స్క్రిప్టు చూడందే నేనే కాదు, ఎవరూ చెప్పలేరు. కానీ అప్పటి సంఘటనల తోరణాలను నిజాయితీగా చూపిస్తేనే డ్రామా పండుతుంది. అధికారాన్ని, భర్తను, సంపదను, పార్టీని వరుసగా పోగొట్టుకున్న లక్ష్మీపార్వతి తన వెర్షన్‌ను పత్రికల్లో సీరియల్‌గా రాశారు, అనేక వేదికలమీద హరికథా కళాకారిణి అనుభవాన్ని రంగరించి ఎమోషన్స్ పండిస్తూ చెప్పారు. అయినా ప్రజలు చలించలేదు. సరేలే అన్నారు. ఆవిడా చేసేదేమీ లేక పార్టీని అటకమీద పడేసి, వైసిపిలో చేరిపోయారు. ఇప్పుడు లక్ష్మీపార్వతి చెప్పినదాన్నే తుచ తప్పకుండా వర్మ తీస్తే ఆ సినిమా రక్తి కట్టే అవకాశాలు తక్కువ.
అందుకని ఆ నాటి చరిత్రను ఒక సాక్షిగా యిరువైపులా బాలన్సు చేస్తూ తీస్తేనే సినిమాకు రంగూ, రుచీ, వాసనా కలుగుతాయి. ఎన్టీయార్‌కు అత్యంత విధేయుడిగా వుంటూ, ఆయన అసెంబ్లీని బహిష్కరించినపుడు ఆయన స్థానంలో ప్రతిపక్ష నాయకుడి బాధ్యత నిర్వహిస్తూ, పార్టీ క్యాడర్ ఎక్కడికీ చెదిరిపోకుండా చూసుకుంటూ వచ్చిన బాబు ఎన్టీయార్‌ని గద్దె దించాలనే నిర్ణయానికి ఎందుకు వచ్చారు అన్నది సరిగ్గా చూపించినపుడే ఆ కారెక్టరు పండుతుంది. లక్ష్మీపార్వతి సీను మీదకు వచ్చేవరకు బాబులో ధైర్యం ఉండింది. ఉపేంద్ర, రేణుకా చౌదరి యిత్యాది అనేకమంది ఎన్టీయార్ సన్నిహితులను తన యుక్తులతో పార్టీకి దూరం చేయగలిగారు. డా. వెంకటేశ్వరరావు ప్రాధాన్యతను తగ్గించగలిగారు. 'బాలకృష్ణ నా వారసుడు' అని ఎన్టీయార్ బహిరంగసభలో ప్రకటిస్తే దాన్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేయగల సాహసాన్ని చూపించారు.
కానీ లక్ష్మీపార్వతి ఎన్టీయార్‌పై తన ప్రభావాన్ని బాహాటంగా చూపించడంతో ఆయనలో అభద్రతాభావం నెలకొంది. ఏదో ఒకటి చేయకపోతే ఆవిడ పెద్దాయనను తన గ్రిప్‌లో తీసుకుని, తమందరినీ శంకరగిరి మాన్యాలు పట్టిస్తుందనే భయంపుట్టింది. ఆవిడను వదుల్చుకోమని, కనీసం రాజకీయాల్లోకి రాకుండా యింటికి కట్టడి చేయమని మావగారికి చెప్పాలంటే సాహసం కావాలి, చెప్పినదాకా ఉండి ఆయన ఎలా రియాక్టవుతాడో, తననే పార్టీలోంచి బహిష్కరిస్తాడేమో అనే శంక ఉంటుంది. అదే జరిగితే తను నిలదొక్కుకోగలడా, కాంగ్రెసులోకి తిరిగి వెళ్లగలడా, కొత్త పార్టీ పెట్టగలడా, ఉన్న పార్టీని పెద్దాయన చేతుల్లోంచి లాక్కోగలడా? ఇలా అనేక సందేహాలతో కొట్టుమిట్టులాడి వుండాలి. ఎమ్మెల్యేలు కలిసి వస్తారా? వచ్చినా ఎంతమంది? తను మరో నాదెండ్ల అయితే చేతులారా తన రాజకీయ సమాధి తాను కట్టుకున్నట్లే! ఎమ్మెల్యేలను ఊరించినా, ప్రజలు ఊరుకుంటారా? 1984 నాటి ప్రజాప్రభంజనం మళ్లీ వీచి, తమను ఎత్తి కుదేస్తే?
అలా జరగకుండా ఉండాలంటే పెద్దాయనను ప్రజల దృష్టిలో చులకన చేయగలగాలి. లక్ష్మీపార్వతి బూచి చూపి ఆయన కుటుంబాన్ని ఆయన నుండి విడదీయాలి. వారికి తాయిలాలు చూపి బుజ్జగించాలి, మీడియాను మేనేజ్ చేయాలి, పెద్దాయన క్యాంప్‌లో తన కోవర్టులను నియమించి, వారిచే నమ్మకద్రోహం చేయించాలి, ఇవన్నీ పెద్దాయన కానీ, ఆయన భార్య కానీ పసిగట్టకూడదు. ఇంత ప్లానింగు తన వలన అవుతుందా? ఏ దశలోనైనా చీదేస్తే? తన మొహం చూసి ప్రజలు ఓటేయలేదని బాగా తెలుసు, పార్టీని సగానికి చీల్చినా, గబుక్కున అసెంబ్లీ రద్దయిపోయి, మళ్లీ ఎన్నికలకు వెళ్లవలసి వస్తే తన చీలిక వర్గం నెగ్గుతుందని నమ్మకమేమిటి? ఇలా అనేక మీమాంసలు పడిన తర్వాత చివరకు భారీ రిస్కు తీసుకున్నట్లు, విజయం సాధించినట్లు చూపితే ఆ పాత్ర గ్రాఫ్‌ను సరిగ్గా ప్రెజంటు చేసినట్లవుతుంది.
అలాగే లక్ష్మీపార్వతి – ఆమె పాత్రను జాలి కలిగేట్లా తీర్చిదిద్దినా నప్పదు. జీవితచరిత్ర రాస్తానంటూ దగ్గరకు వచ్చి, సన్నిహితురాలైంది. తనను వృద్ధిలోకి తెచ్చిన భర్తను విడిచిపెట్టి యీయనను పెళ్లాడింది. సేవలు చేసుకుంటూ ఉండిపోతా అని శపథాలు చేసింది, కానీ భర్తతో బాటు ప్రజలకూ సేవ చేస్తానంటూ బయలుదేరింది. ఏ ముఖ్యమంత్రి భార్యా యిన్ని మంగళహారతులు పట్టించుకోలేదు. పాలనావ్యవహారాల్లో జోక్యం చేసుకుంది. పార్టీలో తన విధేయులతో వర్గాన్ని ఏర్పాటు చేసుకుంది, వారి మెరమెచ్చు మాటలకు మురిసిపోయింది, 'అభిమానుల' నుంచి, కాంట్రాక్టర్ల నుంచి బహుమానాలు స్వీకరించింది, విపరీతంగా సొంత పబ్లిసిటీ చేయించుకుంది.
పదేళ్లగా అంటిపెట్టుకుని ఉన్న బాబు గుండెల్లోనే దడ పుట్టించగలిగింది. కొంతమందిని బాబు నుంచి చీల్చి తనవైపు లాక్కోగలిగింది. తన కారణంగా ఎన్టీయార్ మాట పడుతున్నాడని, అనుచరులను దూరం చేసుకుంటున్నాడనీ తెలిసినా కూడా వెనక్కి తగ్గలేదు. కొండంత ఎన్టీయార్ ముందు బాబు ఏ పాటి అనుకుని మిస్కాలిక్టులేట్ చేసింది. రాజకీయ అపరిపక్వత, అహంకారం, మొండితనం, అత్యాశ అన్నీ కలగలసి తన పతనానికే కాక భర్త పతనానికి కూడా కారణభూతురాలైంది. ఇలా చూపించినపుడు ఆమె కారెక్టరు రక్తి కడుతుంది. ఇక ఎన్టీయార్ – తక్కిన జీవితం ఎలా గడిచినా, యీ దశలో ఆయన ఉత్థానపతనాలను హేతుబద్ధంగా వివరించినప్పుడు కింగ్ లియర్ వంటి ఒక షేక్స్పియరిన్ ట్రాజిక్ హీరో తయారవుతాడు.
ముదిమి వయసులో తోడు కోసం పెళ్లాడడంలో తప్పులేదు, కానీ పాలనను నిర్లక్ష్యం చేసి, పార్టీ వ్యవహారాలు పక్కన పెట్టి, పూలరంగడి వేషాలు వేస్తూ రోజూ ఆవిణ్ని వెంటేసుకుని ఊరేగాడు. ఎందరు హితులు చెప్పినా పెడచెవిన పెట్టి, ఆఫ్టరాల్ నేను నిలబెట్టిన పూచికపుల్లలు వీరు, నన్నేం చేయగలరు అని అహంకరించాడు. జాతీయ రాజకీయాలకు వెళ్లిపోయి చక్రం తిప్పేస్తా అనుకోవడమే కానీ సొంత పార్టీలో కింద మంట పెడుతుంటే కానుకోలేక పోవడం అహంభావానికి పరాకాష్ఠ. 70 ఏళ్ల వయసు వచ్చి, ముఖ్యమంత్రిగా పాలించి, ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో తెలుసుకోలేకపోవడం అమాయకత్వం కాదు, మూర్ఖత్వం. స్వీయతప్పిదాలతో అధికారం, పార్టీ అన్నీ పోగొట్టుకుని, ప్రజాదరణ కరువై, ఆభిజాత్యం దెబ్బ తిని చివరకు గుండెపోటుకు గురై మరణించిన గ్రీక్ ట్రాజిక్ హీరో ఎన్టీయార్.
నిశితంగా చూస్తే దీనిలో ఒక పొయెటిక్ జస్టిస్ కూడా ఉంది. కొందరు సినిమాతారలు వివాహితుడితో ప్రేమలో పడి, అతడి కాపురంలో నిప్పులు పోసి, మొదటి భార్యకు విడాకులు యిప్పించి, చివరకు తాము కూడా సుఖపడలేకపోవడం చూశాం. ఎన్టీయార్ కూడా వృద్ధాప్యంలో తోడు కావాలంటే, ఆరోగ్యం చూసుకోవాలంటే ఏ విధవనో చేసుకోవాల్సింది. కానీ కాపురం చేసుకునే ఒక మహిళపై మరులు కొన్నాడు. ఆమె కాపురాన్ని చెడగొట్టి, ఆమె చేత భర్తకు విడాకులు యిప్పించి, తను కట్టుకున్నాడు. వీరగంధం సుబ్బారావుగారు తప్పకుండా శాపనార్థాలు పెట్టి వుంటాడు. చివరకు ఎన్టీయార్ జీవితం ఏమైంది? ఉజ్జ్వలతారగా వెలిగి, తోకచుక్కలా నేలరాలింది. పరాజితుడిగా, కుటుంబం చేతనే త్యజించబడి, ఒంటరిగా అలమటించి మరణించాడు. ఆయనంటే భయపడి చచ్చే కొడుకులే ఎదురు తిరిగి, 'నువ్వు చేసేది ఏమీ బాగాలేదు' అని వేలెత్తి చూపించుకునేట్లా ప్రవర్తించాడు.
ఇలా చూస్తే – ఎన్టీయార్ జీవితంలోని ఆ ఘట్టంలోని ఏ పాత్రా వైటూ కాదు, బ్లాకూ కాదు, గ్రే! వాటిని సరిగ్గా ప్రెజెంటు చేయగలిగితే అద్భుతమైన హ్యూమన్ డ్రామా పండుతుంది. ఈ పాత్రలెవరో తెలియని విదేశాల్లో కూడా ప్రేక్షకులు స్పందిస్తారు. మరి వర్మ యిలా తీస్తారా లేదా అన్నది చెప్పలేం. అంతా ఆయన దృక్కోణం మీద, శ్రద్ధ మీద ఉంది. కానీ తలచుకుంటే నిజాన్ని చూపించగలడు. ఎందుకంటే ఆయనకు పోయేది ఏమీ లేదు. ఎవరితోనూ మొహమాటాలు ఉన్నట్టు కనబడడు, వివాదాలకు బెదరడు. ఇక ఎన్టీయార్ బయోపిక్ విషయంలో మాత్రం వాస్తవాలు ఎలా చూపిస్తారా అనే బెంగ మాత్రం నాకుంది. ఎందుకంటే అది ఒట్టి సినిమాగా తయారు కావటంలేదు. పార్టీ రాజకీయప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తయారవుతోంది. చీమ చిటుక్కుమన్నా, దాన్ని తమ పార్టీ పబ్లిసిటీకి వాడేసుకునే టిడిపి, ఎన్టీయార్ బయోపిక్‌ను వదిలిపెడుతుందా? తమకు అనుగుణంగా చరిత్రను మార్చమని అడగవచ్చు.
సినిమా ప్లాను చేసినపుడు కాంగ్రెసుతో టిడిపికి పొత్తు లేదు. కానీ రిలీజు కాబోతున్నపుడు ఉంది. ఎన్టీయార్ రాజకీయ ప్రస్థానానికి అడుగడుగునా అడ్డు తగులుతూ, వెక్కిరిస్తూ, కుట్రలు పన్నుతూ వచ్చిన కాంగ్రెసును ఏ కోణంలో చూపిస్తారన్నదే ఆసక్తికరమైన అంశం. నిజానికి నాదెండ్ల వెన్నుపోటు ఉదంతానికి సూత్రధారి రాజీవ్ గాంధి, అరుణ్ నెహ్రూ. కశ్మీర్లో యిదే తరహాలో ఫరూఖ్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని కూలదోసి, యిక్కడా అదే ప్రయోగాన్ని అమలు చేశారు. అయితే యిక్కడ దెబ్బ తింది. ఇది యథాతథంగా చూపించాలంటే రాజీవ్ కొడుకు రాహుల్ ప్రస్తుతం బాబుకు స్నేహితుడిగా ఉన్నారు. తన పార్టీ చేపట్టిన అనేక ప్రాజెక్టులను మొన్న తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బాబు తనే చేసినట్లు చెప్పుకుంటున్నా, మొహమాటానికి పోయి సవరించకుండా ఊరుకున్న రాహుల్ మనసు నొప్పిస్తే బాగుంటుందా? అనుకుని రాజీవ్ గాంధీని కుట్రదారుగా చూపించడం మానేస్తే డ్రామా తగ్గిపోతుంది. ఎందుకంటే అప్పుడు రాజీవ్ ప్రధాని కొడుకు. ఆ స్థాయిలో మన హీరోని దింపే కుట్ర జరిగిందంటే ఆ కిక్కే వేరు. నాదెండ్ల స్థాయిలోనే కుట్ర జరిగిందంటే పేలవమై పోతుంది.
అన్నట్లు, నాదెండ్ల భాస్కరరావుగారి పేరు కూడా చెప్పరని వదంతులు వస్తున్నాయి. మరి ఎవరి పేరు చెప్తారు? ఏదో కల్పితమైన పేరా? అలా అయితే కాంగ్రెసు పార్టీ పేరు కూడా లేకుండా గీంగ్రెసు పార్టీ అని పెడతారా? లేకపోతే ఆ పేరు రాగానే మ్యూట్ చేసేస్తారా? ఎన్టీయార్ పాత్ర 'కుక్కమూతి పిందెలుగా మారిన ఆ దుష్ట డాష్‌డాష్' అని డైలాగులు చెప్తారా? అలా అయితే అది బయోపిక్ ఎలా అవుతుంది? 1984 ప్రజా ఉద్యమం టైములో స్థానిక బిజెపి నేతలే కాక, జాతీయ బిజెపి నేతలు కూడా ఎన్టీయార్‌కు అండగా నిలిచారు. ఇప్పుడు అది చూపిస్తే బిజెపి పట్ల ఆదరణ పెరుగుతుందేమో నన్న భయంతో దాని పేరు కూడా ఏ జెబిపి అనో మార్చేస్తారా? పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీయార్‌కు కుడిభుజంగా వ్యవహరించిన ఉపేంద్ర తర్వాతి రోజుల్లో పార్టీ వీడి బిజెపికి, కాంగ్రెసుకు వెళ్లారు. ఆయన్ని చూపుతారో లేదో!
ఇలా ఆలోచిస్తే యీ బయోపిక్ ఎలా రూపొందుతుందాన్న దిగులు కలుగుతుంది. తెర మీద చూస్తే తప్ప చెప్పలేం. వాస్తవాలకు సుదూరంగా వెళితే మాత్రం విమర్శలు తప్పవు. ముఖ్యపాత్రల పేర్లు కూడా ప్రస్తావించే ధైర్యం లేనపుడు బయోపిక్ అని చెప్పుకోకుండా బయోఫిక్షన్ అని ఒప్పేసుకుంటే మేలు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2018)
[email protected]