ప్చ్…థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ బాధ పగవారికి కూడా వద్దనిపించేలా ఉన్నాయి. అతన్ని కదిపితే చాలు ఎస్‌వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి అత్యంత అవమానకర రీతిలో నిష్క్రమించడంపై తన ఆవేదనను, ఆక్రోశాన్ని కథలుకథలుగా వినిపిస్తాడు. ఓ మహిళా ఉద్యోగితో మాట్లాడినట్టు వచ్చిన ఫోన్‌కాల్స్ రికార్డ్సింగ్స్ ఉత్త ఫేక్ అని కొట్టిపారేస్తున్నాడు. అంతేకాదు తనను తాగుబోతుగా చిత్రీకరించారని వాపోతున్నాడు. అందులో ఎంత మాత్రం నిజం లేదని, తాను మందు తాగి సంవత్సరమైందని చెప్పుకొచ్చాడు. అలాగే తానేమీ దేశ ద్రోహానికి పాల్పడలేదని తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నాడు.
తన జాతక ప్రకారం తనను ఇబ్బంది పెట్టిన వారు ఏమయ్యారో ఆయన చెప్పాడు. ఇలా అనేక అంశాలపై ఆయన తన అంతరంగాన్ని ఆవిష్కరించే యత్నం చేశాడు. ఇంతకూ ఆయన మనసులో మాటలేంటో తెలుసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం…ఈ కింది ఆర్టికల్‌ను చదవండి…మీకే తెలుస్తుంది.
‘వైసీపీ ప్రతిష్టను దృష్టిలో పెట్టుకొని ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశాను. కానీ నేను ఏరోజూ కూడా పదవి కోసం వెంపర్లాడలేదు. నేను ఆరోపణలు ఎదుర్కోడానికి రెండు రోజుల ముందు ఓ ఛానెల్ సీఈవో నా అంతు చూస్తానని బెదిరించాడు. రైతు ఉద్యమం గురించి నేను మాట్లాడిన అంశాలను వక్రీకరించారు. పోసాని కృష్ణమురళితో నన్ను తిట్టించారు. మరో నటి దివ్యవాణి నన్ను కుక్క అన్నారు. నా జాతకం ప్రకారం నన్ను ఇబ్బంది పెట్టినవారు ఎవరూ బతికిలేరు. ప్రస్తుతం నాది కేరాఫ్ ప్లాట్‌ఫామ్. అంటే నడిబజారులో ఉన్నానన్నమాట. ఇంకా చెప్పాలంటే విదేశాల్లో పాస్ పోర్ట్ పోయినవాడిలా ఉన్నాను’ …అని పృథ్వీ మానసిక స్థితిని వివరించాడు.
ఆయన సినీ ఇండస్ట్రీ గురించి కూడా చెప్పుకొచ్చాడు. తనకు సినీ అవకాశాలు ఇచ్చిన దేవుడెవరో కూడా ఆయన వివరించాడు.
‘నా దృష్టిలో సినిమా రంగంలో గొప్పవాళ్ల గురించి చెప్పాల్సి వస్తే… ఆయన చిరంజీవిగారే. అలాగని ఇతర నటుల పట్ల చులకన భావం లేదు. నా మానసిక స్థితి తెలిసి, నాకు సినిమాల్లో అవకాశాలు కల్పించి ప్రోత్సహించాలని చెప్పిన వ్యక్తి చిరంజీవి. ఆయన లేకపోతే నేను సూసైడ్ కూడా చేసుకునేవాడిని’ అని పృథ్వీ తన అంతరంగాన్ని ఆవిష్కరించే యత్నం చేశాడు.
ఇటీవల ఆయన ప్రతి ఇంటర్వ్యూలో ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి తప్పించడానికి కుట్ర చేశారని ఆరోపిస్తున్నాడు. అంతే తప్ప, తన వైపు నుంచి ఎలాంటి తప్పు జరగలేదని ఆయన చెబుతుండటం గమనార్హం. విదేశాల్లో పాస్ పోర్ట్ పోయినవాడిలా ఉన్నానని పృథ్వీ వాపోతున్నాడంటే ఆయన ఎలాంటి దుస్థితిలో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.