స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీలో లుకలుకలు బయటపడ్డాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ టీడీపీలో నాయకులు తామంటే తామని పోటీలు పడి ప్రకటించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి 2014లో ప్రొద్దుటూరు టీడీపీ సీటు దక్కింది. అయితే అప్పట్లో ఆయన ఓడిపోయినప్పటికీ, నియోజకవర్గ ఇన్చార్జ్గా కొనసాగారు.
కానీ అప్పటి టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌నాయుడి జోక్యాన్ని వరదరాజులరెడ్డి ఏ మాత్రం సహించలేదు. ప్రెస్మీట్లు పెట్టి మరీ సీఎం రమేష్‌ను వరదరాజులరెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రమేష్ జోక్యం చేసుకుంటే వాళ్ల సొంతూరు పోట్లదుర్తికి వెళ్లి కొట్టుకుంటూ వస్తామని అప్పట్లో వరదరాజులరెడ్డి చేసిన హెచ్చరికలు తీవ్ర దుమారం రేపాయి. 2019లో వరదరాజులరెడ్డిని కాదని మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ దక్కింది. లింగారెడ్డి కూడా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అలాగే సీఎం రమేష్‌నాయుడు బీజేపీలో చేరిపోయాడు.
ఆ తర్వాత వరదరాజులరెడ్డి టీడీపీకి క్రమంగా దూరమయ్యాడు. తానిప్పుడు ఏ పార్టీలో లేనని వరదరాజులరెడ్డి ప్రకటించాడు. దీంతో ప్రొద్దుటూరు టీడీపీలో లింగారెడ్డి మాత్రమే మిగిలాడు. ప్రస్తుతం స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆకస్మికంగా ప్రొద్దుటూరు టీడీపీ సమన్వయకర్తగా ఉక్కు ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. దీంతో ప్రొద్దుటూరు టీడీపీ కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది.
ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ఓ వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. ప్రొద్దుటూరు స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తగానే ఉక్కు ప్రవీణ్‌ను నియమించారని, నియోజకవర్గ ఇన్చార్జ్గా తానే కొనసాగుతానని ఆయన ప్రకటించుకున్నాడు. ఎన్నికలు ముగిసే ఈ 20 రోజుల కాలానికి మాత్రమే ప్రవీణ్ సమన్వయకర్తగా ఉంటాడని లింగారెడ్డి ఆ వీడియోలో చెప్పాడు. కానీ లింగారెడ్డి తనకు తానుగా ప్రకటించుకున్నారే తప్ప, అందులో వాస్తవం లేదని ఉక్కు ప్రవీణ్ అనుచరులు కొట్టి పడేస్తున్నారు. ప్రొద్దుటూరు టీడీపీ నియోజకవర్గ పూర్తి స్థాయి ఇన్చార్జ్ బాధ్యతలను ప్రవీణ్‌కే అప్పగించినట్టు ఆయన అనుచరులు గట్టిగా చెబుతున్నారు.
ఉక్కు ప్రవీణ్ దారాళంగా డబ్బు ఖర్చు పెడతారని, పది మంది మనుషులను పుట్టించే సత్తా ఉన్నవాడని నియోజక వర్గంలో చర్చ నడుస్తోంది. లింగారెడ్డి విషయానికి వస్తే జేబులో నుంచి పది రూపాయలు కూడా తీసి ఖర్చు చేయడని, అంతే కాకుండా వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని పార్టీని బలహీన పరుస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లును ఎదుర్కోవాలంటే ఉక్కు ప్రవీణ్‌లాంటి యువ నాయకత్వం ఎంతైనా అవసరమని టీడీపీలో ఒక వర్గం వాదిస్తోంది.
లింగారెడ్డి లోపాయికారి ఒప్పందంపై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు పోవడం, నాయకత్వ మార్పిడికి ఇదే సరైన సమయమని భావించిన పార్టీ పెద్దలు ఉక్కు ప్రవీణ్‌కు బాధ్యతలు అప్పగించారనే చర్చ ప్రొద్దుటూరు టీడీపీలో అంతర్గతంగా నడుస్తోంది. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ప్రొద్దుటూరు టీడీపీలో నాయకత్వ మార్పు ఎటు దారి తీస్తుందోననే ఆందోళన మాత్రం టీడీపీలో స్పష్టంగా కనిపిస్తోంది.