తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కేసీఆర్ పెట్టబోయే కొత్త జాతీయ పార్టీ గురించి చర్చ జరుగుతోంది. తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆలోచన చేసిన కాంగ్రెసేతర, బీజేయేతర మూడో కూటమి అంటే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు అసలు ముందుకే సాగలేదు. కేసీఆర్ రెండు విడతలుగా దేశమంతా తిరిగి బీజీపీయేతర, కాంగ్రెసేతర ముఖ్యమంత్రులను, కొందరు పార్టీ అధినేతలను కలిసి మాట్లాడి వచ్చారు. కానీ వారి నుంచి సానుకూల స్పందన రాలేదు. కేసీఆర్ కలుసుకున్నవారిలో ఎవరికివారే జాతీయ నాయకులుగా ఎదగాలనుకుంటున్నారు కాబట్టి కేసీఆర్ ప్రయత్నాలకు పెద్దగా స్పందించలేదు.
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే కేసీఆర్ తలపెట్టిన మూడో కూటమికే సహకరించని దేశంలోని ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలు ఆయన రూపు దిద్దుతున్న జాతీయ పార్టీకి సహకరిస్తారా? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. కేసీఆర్ కొన్నాళ్ల కిందట సంచలన వార్త వింటారని చెప్పారు. అది జాతీయ పార్టీ స్థాపనే ఇప్పుడు స్పష్టమైంది. ఇప్పుడున్న దేశ రాజకీయ పరిస్థితుల్లో వివిధ ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పంచన చేరుతున్నాయి తప్ప విడిగా పోటీ చేసి మనుగడ సాగించే పరిస్థితి లేదు. అలాంటప్పుడు కేసీఆర్ పార్టీకి అండగా ఏ పార్టీలు ఉంటాయి ?
కేసీఆర్ కు జాతీయ రాజకీయాల్లో తానే లీడర్ కావాలనే కోరిక బాగా ఉంది. కానీ ఇలాంటి కోరిక చాలామంది నాయకుల్లో ఉంది. అలాంటప్పుడు కేసీఆర్ తమకు పోటీ వస్తున్నాడని అనుకుంటారు కదా. కాబట్టి కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే దాన్ని స్వాగతించేవారు తక్కువనే చెప్పొచ్చు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే ప్రాతీయ పార్టీ అధినేతగా ఉంటూనే ఆ పని చేయొచ్చు. గతంలో చంద్రబాబు నాయుడు ,జయలలిత, కరుణా నిధి, లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ మొదలైన వారంతా ప్రాంతీయ పార్టీల అధినేతలుగానో , ముఖ్యమంత్రులుగానో ఉంటూనే జాతీయ రాజకీయాలను ప్రభావితం చేశారు. జాతీయ పార్టీగా భారత్ రాష్ట్రీయ సమితిని ఏర్పాటు చేయాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ ప్రస్తుతం జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించడం కోసం కసరత్తులు చేస్తున్నారు.
కనీసం దేశంలోని సగం రాష్ట్రాలకైనా ఇంచార్జ్ లను ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే వివిధ రాష్ట్రాలలో కేసీఆర్ జాతీయ పార్టీని నమ్ముకుని ఆయన పార్టీలోకి వచ్చే వారు ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కేసీఆర్ అనేకమార్లు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీల కీలక నేతలతో సమాలోచనలు జరిపారు. ఇక కేసీఆర్ తన పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించి వివిధ రాష్ట్రాల్లో విస్తరించడానికి ప్రయత్నిస్తే ఆయా ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇస్తాయా అన్నది తెలియాల్సి ఉంది. అంతేకాదు దేశ్ కి నేత కేసీఆర్ అని అన్ని రాష్ట్రాలలోనూ కేసీఆర్ పై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న క్రమంలో కేసీఆర్ ప్రభావం వివిధ రాష్ట్రాలలో ప్రజలపై ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా ఆసక్తికర అంశంగా మారింది.
ఆయా రాష్ట్రాలలో ప్రజలపై ప్రభావం చూపగలిగిన వారిని, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న వారిని గుర్తించి, బిజెపికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించగలిగినవారిని కేసీఆర్ తన పార్టీలో చేర్చుకుని కీలక బాధ్యతలు అప్ప చెప్తారని భావిస్తున్నారు. ఈ విషయంలో కేసీఆర్ స్పష్టత లోనే ఉన్నారని టిఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వివిధ రాష్ట్రాలలో పార్టీకి ఇంచార్జ్ లను ప్రకటిస్తారని భావిస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండవల్లి అరుణ్ కుమార్, కర్ణాటక రాష్ట్రానికి ప్రకాష్ రాజ్, తమిళనాడుకు విజయ్ లను ఎంపిక చేశారని ప్రచారం సాగుతుంది. నిజానికి వీరెవరూ ప్రజలను ప్రభావితం చేయలేరు.
అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ తాను రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాను అని ప్రకటించారు. ఇక ప్రకాష్ రాజ్ పార్టీ బాధ్యతలు తీసుకుంటారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ అమెరికాలో ఉన్నట్లు సమాచారం. ఇక విజయ్ రాజకీయాల్లోకి ఇంకా అడుగు పెట్టలేదు. ఒకవేళ ఆయన అడుగుపెట్టినా కేసీఆర్ పార్టీలో చేరతారన్న నమ్మకం లేదు. విజయ్ కు ఉన్న ఫాలోయింగ్ నేపథ్యంలో ఆయనే సొంతంగా పార్టీ పెట్టే అవకాశం ఉంది.
ఇక ఈ సమయంలో వివిధ రాష్ట్రాలలో కేసీఆర్ తో కలిసి ముందుకు నడిచే కీలక నేతలు ఎవరు అన్నది ఆసక్తికర అంశంగా మారింది. జాతీయ స్థాయి రాజకీయాల్లో కేసీఆర్ సక్సెస్ కావాలంటే ముందు రాష్ట్రాలను నియమించే ఇన్చార్జులు ప్రభావం చూపగలిగే వారుగా ఉండాలి. బలమైన వ్యక్తులుగా ఉండాలి. ఇక అలాంటి వారు కేసీఆర్ పార్టీలోకి ఎవరు వస్తున్నారు అన్నది రాజకీయవర్గాలలో ఆసక్తికరంగా మారింది. వివిధ రాష్ట్రాల్లో కేసీఆర్ తో సమాలోచనలు జరిపిన ప్రాంతీయ పార్టీల నాయకులు కూడా ఆయా రాష్ట్రాలలో కేసీఆర్ పార్టీ విస్తరణను ఎలా తీసుకుంటారు అన్నది ఆసక్తికర అంశం.
టీఆర్ఎస్ పార్టీ తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో విజయవంతమైంది. అధికారంలోకి వచ్చింది. అది కూడా టీఆర్ఎస్ ఒంటరిగా తెలంగాణా కోసం పోరాడలేదు.యావత్ తెలంగాణా ప్రజలు, అన్ని పార్టీలు కలిసి పోరాడాయి. కానీ ఇప్పుడు అంతటి ఐకమత్యం జాతీయ స్థాయిలో మోడీకి, బీజేపీకి వ్యతిరేంగా ఉందా?