కాంగ్రెస్‌కి రిట‌ర్న్ గిప్ట్‌

మ‌నం చేసిందే మ‌న‌కి తిరిగి వ‌స్తుంది. ఇది వేదాంతం కాదు. నిజం కూడా. త‌న హ‌యాంలో ఈడీని (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌) వాడుకుని ఎంద‌రినో కాంగ్రెస్ హింసించింది. జైళ్ల‌కి పంపింది. ఇపుడు కాంగ్రెస్ వంతు వ‌చ్చింది.…

మ‌నం చేసిందే మ‌న‌కి తిరిగి వ‌స్తుంది. ఇది వేదాంతం కాదు. నిజం కూడా. త‌న హ‌యాంలో ఈడీని (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌) వాడుకుని ఎంద‌రినో కాంగ్రెస్ హింసించింది. జైళ్ల‌కి పంపింది. ఇపుడు కాంగ్రెస్ వంతు వ‌చ్చింది. రాహుల్‌గాంధీని విచారించే స‌రికి కాంగ్రెస్ శ్రేణుల‌కి స‌త్య‌మేవ జ‌య‌తే గుర్తుకొచ్చింది. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో అస‌లు స‌త్య‌మే లేదు. ఆ కేసుని అర్థంకానంత సంక్లిష్టంగా ప‌త్రిక‌లు రాస్తాయి కానీ, ఒక పిట్ట క‌థ‌లా చెప్పాలంటే ఇది

బ్రిటిష్ వాళ్ల కాలంలో పాల‌కులు చేసిందే న్యాయం. ప్ర‌శ్నించిన వాళ్లు తీవ్ర‌వాదులు. అక్ష‌రాస‌త్య త‌క్కువ కాబ‌ట్టి ప‌త్రిక‌లు కూడా త‌క్కువ‌. అందుక‌ని 1938లో నెహ్రూ నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రిక ప్రారంభించారు. ఇది కాకుండా హిందీ, ఉర్దూలో కూడా ప‌త్రిక‌లుండేవి. 5 వేల మంది స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులు షేర్ హోల్డ‌ర్ల‌గా “ఎజెఎల్” సంస్థ కింద ఇవి న‌డిచేవి.

2008లో ప‌త్రిక మూత‌ప‌డే నాటికి 90.25 కోట్లు అప్పు వుంది. అది కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వ‌డ్డీలేని అప్పు. 2010లో యంగ్ ఇండియ‌న్ లిమిటెడ్ రాహుల్‌, సోనియాగాంధీలు డైరెక్ట‌ర్లుగా ఏర్ప‌డింది. మనం డ‌బ్బులు కొట్టేయాల‌నుకున్న‌ప్పుడు సూట్‌కేస్ కంపెనీలు పెడ‌తాం. నీతులు చెప్పే ప‌త్రికా సంస్థ‌ల నుంచి ప‌గ‌లే జ‌నాన్ని దోచేసే కార్పొరేట్ సంస్థ‌ల వ‌ర‌కూ అంద‌రిదీ ఇదే దారి. దొరికిన వాళ్ల‌ని దొంగ అంటూ వుంటారు. ఒకే ఆఫీస్‌లో ఐదారు ర‌కాల బినామీ సంస్థ‌లుంటాయి. అక్క‌డ ప‌ని చేసే ఉద్యోగులు ర‌క‌ర‌కాల కంపెనీల పేర్ల‌తో వుంటారు. దోపిడీదార్ల‌కి పెద్ద దిక్కు కాంగ్రెస్ కూడా ఇదే ప‌ని చేసింది.

యంగ్ ఇండియ‌న్ ఏం చేసిందంటే 50 ల‌క్ష‌లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి  “ఎజెఎల్‌” ని తీసేసుకుని నేష‌న‌ల్ హెరాల్డ్‌ని సొంతం చేసుకుంది. పుష్ప‌లో “ఆ కాలు నాదే, ఈ కాలు నాదే” అన్న‌ట్టు రెండూ రాహుల్ సోనియాల‌కే. ఇప్పుడు విష‌యం ఏమంటే ఐదు ల‌క్ష‌ల మూల‌ధ‌నంతో, కోటి అప్పు తీసుకుని రూ.50 ల‌క్ష‌లు కాంగ్రెస్‌కి ఇచ్చి హెరాల్డ్ ఆస్తులు 2 వేల కోట్లు యంగ్ ఇండియ‌న్ తినేసింది.

ఆ యంగ్ ఇండియ‌న్ రాహులే, గ్రేట్ మ‌ద‌ర్ సోనియా అని బీజేపీ ఆరోప‌ణ‌. కేసు కూడా అదే. కాంగ్రెస్ ఏమంటుందంటే అన్ని సంస్థ‌లూ మావే. అన్ని డ‌బ్బులూ మావే . దీంట్లో మోసం ఏముంది? మ‌రి వాటాదారులు ఏమ‌య్యారు? స‌త్యం జ‌యిస్తే రాహుల్‌, సోనియాల‌కి ఏం జ‌రుగుతుందో వేరే చెప్ప‌క్క‌ర్లేదు.