మరో రెండేళ్లలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజకీయ సమీకరణలకు సమయం ఆసన్నమైంది. గెలుపోటముల లెక్కలు మొదలయ్యాయి. ముఖ్యంగా పవన్‌కల్యాణ్ విషయానికి వస్తే…ఆయన నిలిచే స్థానాలంటూ రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. గతంలో భీమవరం, గాజువాకలో పవన్ పోటీ చేసి, రెండు చోట్ల ఓడిపోయారు. జనసేనానే ఓడిపోవడం ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఎన్నికల చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, ఈ దఫా సురక్షిత నియోజకవర్గాన్ని ఎంచుకోవాలని జనసేన భావిస్తోంది. ఈ నేపథ్యంలో మెజార్టీ అభిప్రాయం తిరుపతి.
తమ దగ్గర పోటీ చేయాలని, లక్ష మెజార్టీ తెప్పిస్తామని ఇటీవల తిరుపతి జనసేన తీర్మానం కూడా చేసింది. 2009లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు తిరుపతే ఆయన పరువు నిలిపింది. తిరుపతిపైనే పవన్ మక్కువ చూపుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో పవన్‌పై పోటీ చేసే వైసీపీ అభ్యర్థి ఎవరనే చర్చ తెరపైకి వచ్చింది. జనసేనానిపై వైసీపీ యంగ్ లీడర్ భూమన అభినయ్‌రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఎక్కువ. ఇవే చివరి ఎన్నికలని 2019లో భూమన కరుణాకరరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. భూమన తనయుడు, తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి ప్రస్తుతం అక్కడి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 35 ఏళ్ల అభినయ్ ఉరకలెత్తే ఉడుకు రక్తంతో పవన్‌పై తలపడేందుకు సిద్ధంగా ఉన్నారు.
తిరుపతిలో పవన్‌కల్యాణ్ పోటీ …రసవత్తరంగా వుంటుంది. సహజంగానే తన సామాజిక వర్గం బలంగా ఉందనే ఆయన అక్కడికి వెళ్లాలని అనుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. తిరుపతిలో బలిజ ఓట్లపై నమ్మకంతోనే పవన్ వెళ్లాలని అనుకుంటున్నారనేది వాస్తవం. అనేక సమీకరణల రీత్యా తిరుపతిని పవన్ ఎంపిక చేసుకోవడం సరైందే.
తానో గొప్ప సామాజిక దృక్పథం కలిగిన వాడిగా, అనేక పుస్తకాలు చదివిన జ్ఞానసంపన్నుడిగా పవన్ తనకు తాను ఆవిష్కరించుకుంటూ వుంటారు. గుంటూరు శేషేంద్రశర్మ, గద్దర్, కె.శివారెడ్డి, బాలగంగాధర్ తిలక్ కవిత్వాలను తన ప్రసంగాల్లో వినిపిస్తూ ఆవేశంతో ఊగిపోతుంటారు. జనసైనికుల్ని సమరానికి సన్నద్ధం చేసేందుకు భావోద్వేగ కవితలను చదవడం పవన్ ప్రత్యేకత.
పవన్‌కల్యాణ్‌తో తలపడే భూమన అభినయ్‌ని జనసేన తక్కువ అంచనా వేస్తే, మరోసారి తప్పులో కాలేసినట్టే. తిరుపతిలో శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకావిష్కరణ సభలో అభినయ్ గురించి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ ఏమన్నారో తెలుసుకుందాం. “భూమన కరుణాకరరెడ్డి అదృష్టవంతుడు. ప్రస్తుత సమాజంలో రాజకీయ వారసులు మాత్రమే వస్తున్నారు. కానీ సాంస్కృతిక, సాహిత్య వారసుడు అభినయ్ రూపంలో రావడం కరుణాకరరెడ్డి అదృష్టం. రానున్న రోజుల్లో అభినయ్ సంస్కారవంతమైన రాజకీయ నేతగా, వ్యక్తిగా గొప్పగా మన్ననలు పొందుతాడని ఆశిస్తున్నా” అని చెప్పారు. శ్రీశ్రీ కవిత్వాన్ని అలవోకగా అభినయ్ చెప్పడం చూసి, బుద్ధప్రసాద్ పెద్దరికంతో అన్న మాటలివి.
రాజకీయాలే కాదు, సాహిత్యం, సాంస్కృతిక, పర్యావరణ ప్రేమికుడిగా అభినయ్‌కి గుర్తింపు ఉంది. శేషాచలం కొండల్ని అనేకమార్లు చుట్టేశాడు. సమాజం, రాజకీయాలపై స్పష్టమైన దృక్పథం కలిగిన యువ నాయకుడిగా అభినయ్ తనకంటూ తిరుపతిలో ప్రత్యేక ఫాలోయింగ్ కలిగి ఉన్నాడు.
లండన్‌లో ఎంఎస్ పూర్తి చేసి, 2009 నుంచి తిరుపతి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. 2011లో జగన్ వైసీపీ స్థాపించి, ఉప ఎన్నికకు వెళ్లాడు. అప్పుడు కడప జిల్లా తొండూరులో సుమారు 200 మందికి పైగా యువతతో విస్తృత ప్రచారం చేశాడు. కడప ఉప ఎన్నిక రాజకీయాలు అతనికి ఓనమాలు నేర్పాయి. ఆ తర్వాత 2012లో చిరంజీవి రాజీనామాతో తిరుపతి ఉప ఎన్నికలో తండ్రి భూమన కరుణాకరరెడ్డి గెలుపు కోసం పనిచేశాడు. అలాగే 2014లో తండ్రి ఘోర పరాజయం నుంచి గుణపాఠాలు నేర్చుకున్నాడు.
పోగొట్టుకున్న చోటే సంపాదించుకోవాలనే చందాన తిరిగి అక్కడే తండ్రి గెలుపు చూడాలని పరితపించాడు. మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని తిరుపతిలో 2019లో వైసీపీ గెలుపు ద్వారా నిరూపించాడు. ఆ తర్వాత 2020లో తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. కేవలం 700 పైచిలుకు తేడాతో తిరుపతిలో వైసీపీ గెలిచిందని, కార్పొరేషన్‌లో 50 డివిజన్లలో తాము 20 స్థానాలను దక్కించుకుంటామనే నమ్మకం టీడీపీలో ఉండింది. ఈ మేరకు పందేలు కూడా జరిగాయి. కానీ 49 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా 48 స్థానాలు అధికార పార్టీ హస్తగతం కావడం వెనుక అభినయ్ వ్యూహం ఉంది. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో అభినయ్ కీలకపాత్ర పోషించాడు. ఇలా మొత్తం ఆరు ఎన్నికలను ఎదుర్కోగా, నాలుగింటిలో విజయం సాధించాడు. ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భాల్లో అనుభవాలు అతన్ని చిన్న వయసులోనే రాటు తేల్చాయి.
ప్రధానంగా ఎన్నికల్లో కులాలు, ప్రాంతాలు కీలక పాత్ర పోషిస్తాయనేది కఠిన వాస్తవం. ఇందుకు తిరుపతి మినహాయింపు కాదు. ఇటు పవన్‌కు, అటు అభినయ్‌కి తిరుపతిలో గెలుపు నల్లేరుపై నడక కాదు. ఇద్దరి మధ్య పోటీ టీ20 క్రికెట్‌ను తలపిస్తుంది. గత ఎన్నికల్లో తన తండ్రి కేవలం 708 ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలుపొందారని అభినయ్ గమనంలో పెట్టుకోవాలి. తిరుపతి అనేది ఓ ప్రత్యేకమైన నియోజకవర్గం. ఇక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ.
గత ఎన్నికలకు, 2024లో జరిగే ఎన్నికలకు చాలా వ్యత్యాసం వుంటుంది. తిరుపతిలో 61 వేల వైట్ రేషన్‌కార్డుదారులున్నారు. 1.84 లక్షల మంది సంక్షేమ పథకాల లబ్ధి పొందుతున్నారు. ఇది వైసీపీకి అనుకూలించే అంశం. అలాగే వైసీపీ ప్రభుత్వ విధా నాలపై వ్యతిరేకించే వర్గం కూడా తిరుపతిలో ఎక్కువే. ముఖ్యంగా ఉద్యోగులు, నిరుద్యోగులు, మేధావి వర్గాలు. మరీ ముఖ్యంగా ఈవో, అదనపు జేఈవో తిరుమల ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారనే ఆవేదన వారిలో ఉంది. ఇది ఖచ్చితంగా తిరుపతి నియోజకవర్గంపై పడుతుంది. ఆ తర్వాత కొంత మేరకు చంద్రగిరిపై కూడా పడుతుంది.
తిరుమలలో హోటళ్లను ఎత్తేయాలన్న పాలక మండలి నిర్ణయాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అడ్డుకున్నారు. అలాగే తిరుమలలో దశాబ్దల తరబడి పరిష్కారానికి నోచుకోని సమస్యను భూమన ఇటీవల పరిష్కరించారు. ఇలాంటివి వైసీపీకి అనుకూలిస్తాయి. అలాగే నాలుగు దశాబ్దాలుగా టీటీడీ ఉద్యోగుల సొంతింటి కలను భూమన కరుణాకరరెడ్డి సాకారం చేయడం వైసీపీకి కలిసొచ్చే అంశం. సుమారు 7 నుంచి 8 వేల మంది టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలను ప్రభుత్వంతో కొనగోలు చేసి ఇవ్వడం తిరుపతిలో చారిత్రక ఘట్టం.
కొందరు ఉద్యోగులు, నాయకుల వల్ల వైసీపీపై వ్యతిరేకత పెంచే వాతావరణం కనిపిస్తోంది. అయితే నమ్మిన వాళ్ల కోసం లాభనష్టాల లెక్కలు వేసుకోకుండా అలాంటి వారిని ఆదరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా అభినయ్ టీం పనితీరు మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉంది. తిరుపతి చుట్టూ కనెక్ట్‌విటీని పెంచే నిర్ణయాలు వైసీపీకి అనుకూలం. ఇదే సందర్భంలో తిరుపతిలో శ్రీనివాస వారధి నిర్మాణం నత్తనడకన సాగడం తప్పకుండా అధికార పార్టీకి ప్రతికూలాంశమే. అధికార పార్టీ ఉన్న యువనాయకుడిగా కొంత మేరకు అసంతృప్తి బెడదను అభినయ్ ఎదుర్కోవాల్సి వుంటుంది.
పవన్‌కల్యాణ్‌కు ఆయన సామాజిక వర్గం, సినీ అభిమానులు కలిసొచ్చే అంశాలు. అలాగే ప్రభుత్వ వ్యతిరేకత ఆయనకు అనుకూలంగా మారొచ్చు. గతంలో చిరంజీవిని గెలిపిస్తే, స్థానికంగా లేకపోవడం వల్ల ఇబ్బందులు పడ్డామనే ఆవేదన పవన్‌కు ప్రతికూల అంశం. అయితే నాన్‌లోకల్ అయిన పవన్‌కల్యాణ్ తిరుపతిలో పోటీ చేయాలని అనుకోవడమే ఒక సానుకూల అంశం. పవన్‌కల్యాణ్‌కు హీరోగా ఇమేజ్ ఉన్న దృష్ట్యా ఆయన అభ్యర్థిపై ఓటర్లకు కొంత మేరకు ఉండొచ్చు.
పవన్‌కల్యాణ్ అగ్రహీరో కావడంతో ఇలాంటి వాళ్లు మన ఎమ్మెల్యేగా ఉంటే? అనే ఆలోచన ఓటర్లలో ఎక్కువగా కలిగితే మాత్రం జనసేనానికి ప్రయోజ నమే. పైగా తిరుపతికి అతను కొత్త కావడం, అభినయ్ రోజూ చూస్తున్న యువ నాయకుడు కావడాన్ని ఓటర్లు ఎలా తీసుకుంటా రనే దానిపై కూడా ఫలితం ఆధారపడి వుంటుంది. పవన్‌కు ఒక్క చాన్స్ ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. పవన్ ప్రత్యర్థి అభినయ్‌కి తిరుపతిలో అన్ని సామాజిక వర్గాల యువతలో బలమైన ఫాలోయింగ్ ఉందని జనసేన గమనంలో పెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా ప్రత్యర్థికి పోల్ మేనేజ్‌మెంట్‌లో అపార అనుభవం ఉండడం పవన్‌కు నష్టదాయకం.
జనసేనలో అరిచే వాళ్లే తప్ప, క్షేత్రస్థాయిలో ఎన్నికలను ఎదుర్కోవడం తెలియదు. తిరుపతిలో ఓటర్లను పోలింగ్ బూత్ వరకూ తెచ్చుకోవడం కూడా ఎన్నికల్లో జయాపజయాలను నిర్ణయిస్తుంది. తిరుపతిలో ఎవరేమిటో పవన్‌కు తెలియకపోవడం, అలాగే ప్రత్యర్థులకు బాగా తెలిసి వుండడం ఏ మేరకు లాభనష్టమో జనసేన బేరీజు వేసుకోవాల్సి వుంటుంది. ఇల్లలకగానే పండుగ కానట్టుగానే, తిరుపతిలో పవన్ నిలబడితే చాలు గెలిచిపోతారనే భ్రమల నుంచి జనసేన బయటికి రావాలి. ఎందుకంటే ప్రత్యర్థి దిబ్బల మీద కోడి కాదు, బెరస కోడి. విజయం కోసం ఎంత ఎత్తుకైనా ఎగిరి తన్నడానికి సిద్ధంగా ఉండే యువ కిషోరం.