Advertisement

Advertisement


Home > Movies - Movie News

జనం మారుతున్నారు..టాలీవుడ్ కూడా..

జనం మారుతున్నారు..టాలీవుడ్ కూడా..

కరోనా తరువాత అని కావచ్చు. లేదా సినిమా చూసే అభిరుచిలో మార్పులు అని కావచ్చు. మొత్తం మీద జనం మారుతున్నారు. సినిమా కూడా మారాలి అనే ఒపీనియన్ బలపడుతోంది టాలీవుడ్ జనాల్లో. జనాలు అద్భుతమైన సినిమాను కోరుకోవడం లేదు. అలా అని బోర్ కొట్టిస్తామంటే ఒప్పుకోవడం లేదు. 

చిన్న సినిమా అంటే దూరం అంటున్నారు. కానీ బజ్ తెచ్చుకోగలిగితే చిన్న సినిమా అయినా ఓకె అంటున్నారు. పబ్ ల్లో లౌడ్ మ్యూజిక్ అలవాటైపోయింది. బ్యాక్ గ్రవుండ్ స్కోర్ కూడా లౌడ్ గా వుంటే మెచ్చుకుంటున్నారు. లౌడ్ కామెడీ అయితే సూపర్ అంటున్నారు. సెన్సిబుల్ కామెడీని అంత లైక్ చేయడం లేదు.

సినిమాకు వీకెండ్ మాత్రమే టైమ్ వుంటోంది. మళ్లీ వీకెండ్ దాకా వుండాల్సిన బాధ్యత, బరువు సినిమాదే. పెద్దోళ్లు ఊదరగొట్టినా సినిమా నచ్చితేనే వస్తున్నారు. మీడయాలో హడావుడి చేసినా, నచ్చకపోతే సినిమాకు వెళ్లకూడదని ముందే ఫిక్స్ అయిపోతున్నారు. టికెట్ రేటు తక్కువ వుండాలి. మళ్లీ థియేటర్ కూడా బాగుండాలి. ఇలా ఈక్వేషన్లు అన్నీ చిత్రాతి చిత్రంగా మారిపోతున్నాయి.

ఓటిటి వెబ్ సిరీస్ లను చూస్తున్నారు. కానీ తెలుగు వెబ్ సిరీస్ లు అనే సరికి పక్కన పెడుతున్నారు. కాంబినేషన్ లను కోరుకుంటున్నారు. పెద్ద హీరోలు అయినంత మాత్రాన ఎగబడి డబ్బులు ఇచ్చేయడం లేదు. కలెక్షన్లను కంట్రోల్ లో పెడుతున్నారు. దేన్ని వదలుతున్నారో, దేన్ని కంట్రోల్ చేస్తున్నారో, జరిగిపోయిన తరువాత కానీ అంచనాకు అందడం లేదు.

సినిమా తీసే విధానం మారాలి ముందు. కోవిడ్ తరువాత హీరోలు అత్యాశకు పోయి కోట్లకు కోట్లు రెమ్యూనిరేషన్ పెంచేసారు. అవన్నీ మళ్లీ కిందకు రావాల్సి వుంది. లేదూ అంటే చాలా మంది హీరోలు దుకాణాలు కట్టేయాల్సి వుంటుంది. దర్శకులు కూడా తగ్గాలి. మహా మహా దర్శకులు తీసిన వెబ్ సిరీస్ లు నాసిగా వుండడానికి కారణం, వారి లాభార్జన ధ్యేయాలే.

డిస్ట్రిబ్యషన్ వ్యవస్థ పెరిగేలా వుంది. బయర్లు తగ్గేలా వున్నారు. కేజిఎఫ్ 2, ఎఫ్ 3 మాదిరిగా తక్కువ కమిషన్ మీద డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడం అన్న పద్దతి పెరిగేలా వుంది. ఆర్ఆర్ఆర్, పుష్ప మాదిరిగా భారీగా అమ్మినా, డబ్బులు వెనక్కు ఇచ్చుకోవాల్సి వస్తోంది. లేదా బయ్యర్లు నష్టపోవాల్సి వస్తుంది. పుష్ప సినిమా ఉత్తరాంధ్రకు 3 కోట్లు వెనక్కు ఇచ్చారు. బయ్యర్ కోటి రూపాయలు నష్టపోయారు. హిట్ అనిపించుకున్నా ఏం లాభం? భీమ్లా నాయక్ సినిమాకు నైజాం కు అమ్మిన రేటుకు, వచ్చిన కలెక్షన్లకు మధ్య అయిదారుకోట్ల వత్యాసం. 

సర్కారు వారి పాటకు అదే సమస్య. ఇంక అలాంటపుడు హిట్ లుగా చెప్పుకుని 50 కోట్ల రెమ్యూనిరేషన్ ఎలా తీసుకుంటారు. సగానికి సగం నష్టపోయిన అంటే సుందరానికి హీరో రెమ్యూనిరేషన్ 15 కోట్లు. హిట్ ల కోసం ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న శర్వానంద్ రెమ్యూనిరేషన్ గురించి నిర్మాతలు కథలు, కథలుగా చెప్పుకుంటున్నారు. కేవలం వీరు మాత్రమే కాదు..చాలా మంది వ్యవహారం ఇలాగే వుంది.

ఓ మిడ్ రేంజ్ హీరోకి ఓ మిడ్ రేంజ్ నిర్మాత రెండు కోట్లు అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నారు. సినిమా సెట్ కాదు. డబ్బులు బ్లాక్ అయిపోయాయి. వీళ్లు చెప్పించిన కథలకు హీరో. అలా అని హీరో ప్రాజెక్టు సెట్ చేయడు. వడ్డీ లేని అప్పు ఎంజాయ్ చేస్తున్నాడు. టాలీవుడ్ లో హీరోలు, దర్శకుల మీద వున్న మొత్తం అడ్వాన్స్ లు లెక్క కట్టగలిగితే ఓ ఆర్ఆర్ఆర్ తీసేయచ్చు అంటే అతిశయోక్తి కాదు.

ఎగ్జిబిటర్, బయ్యర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత ఇలా అందరూ లాభాలు తింటేనే హిట్ కింద లెక్క. హీరో..డైరక్టర్లు మాత్రం తింటే అది హిట్ కాదు. కోవిడ్ అనంతరం సినిమా నిర్మాతలు పక్కాగా ఓ తాటిపైకి రావాల్సి వుంది. అప్పుడు కానీ హీరోలు, డైరక్టర్ల ఆశలకు కళ్లెం పడదు. ఆపైన కానీ సినిమా బాగుపడదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?