ఆరోగ్యశ్రీని ప్రభుత్వం ఆరోగ్యసిరిగా చూస్తోందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఈ పథకం కింద సాయం అందిస్తున్న విషయం రోగి, వారి కుటుంబ సభ్యులు గుర్తించుకోవాలనే కోణంలో జగన్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. మరో రెండేళ్లలో జరగనున్న ఎన్నికల్లో ప్రతిదీ తనకూ రాజకీయంగా ఉపయోగపడాలనే సీఎం జగన్ ఆలోచిస్తున్నారనే, తాజా ప్రభుత్వ చర్యలే నిదర్శనం.
ఇక మీద ఆరోగ్యశ్రీ పథకం డబ్బు నేరుగా రోగి ఖాతాలో పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. గతంలో కాలేజీ ఫీజును నేరుగా విద్యార్థి ఖాతాలో వేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆరోగ్యశ్రీ వంతు వచ్చింది. ఈ మేరకు జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు ఈ మార్పు చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. రోగికి చికిత్స అందిన తర్వాత దానికి సంబంధించిన బిల్లు మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తామని సంబంధిత శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
రోగి ఖాతా నుంచి ఆస్పత్రికి ఆటో డెబిట్ చెల్లింపులు జరిగేలా ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై రోగులు హ్యాపీగా ఫీల్ అవుతుండగా, ఆస్పత్రుల యజమానులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల రోగులు పేచీ పెట్టే అవకాశాలున్నాయనే భయం ఆస్పత్రి వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.
అయితే ఎవరూ భయపడాల్సిన పనిలేదని ప్రభుత్వం వాదిస్తోంది. రోగులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలో వారి నుంచి కన్సెంట్ ఫారం స్వీకరిస్తారని పేర్కొన్నారు. రోగి, బ్యాంక్, ఆస్పత్రి మధ్య కన్సెంట్‌తో కూడిన వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.
అవకతవకలు అరికట్టడంలో భాగంగా కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విధానానికి ఆస్పత్రులు ఏ మాత్రం సహకరిస్తాయనేవి ఇప్పుడు చర్చనీయాంశమైంది. వాటి ఆమోదం లేకపోతో, నూతన విధానం అమలు ప్రశ్నార్థకమవుతుంది.