ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్లిష్టం. కానీ సెలబ్రిటీల విషయంలో ఇలా కుదరదు. వాళ్ల వ్యక్తిగత విషయాల్ని కూడా తెలుసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. అందుకే మహేష్, బన్నీ, చరణ్ లాంటి చాలామంది హీరోలు తమ ప్రైవేట్ ఫొటోల్ని కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తుంటారు. తను మాత్రం ఈ గ్యాంగ్ లో చేరనంటున్నాడు గోపీచంద్.
వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ చేయడం తనకు ఇష్టం ఉండదంటున్నాడు గోపీచంద్. మరీ ముఖ్యంగా తన కుటుంబ సభ్యులున్న ఫొటోల్ని సోషల్ మీడియాలో అస్సలు షేర్ చేయనని చెబుతున్నాడు. వ్యక్తిగత జీవితంపై నిర్ణయం తీసుకునే హక్కు పూర్తిగా తనదే అంటున్నాడు.
“నేను సోషల్ మీడియాను నా సినిమా అప్ డేట్స్ కోసమే వాడతాను. అప్ డేట్స్ ఇస్తాను. వ్యక్తిగత విషయాలు పెట్టను. నా ప్రైవేట్ లైఫ్ ను పబ్లిక్ లో పెట్టడం నాకిష్టం ఉండదు. అలా చేస్తే నా ప్రైవసీ పోతుందని ఫీలింగ్. చాలామంది తమ వ్యక్తిగత విషయాలు కూడా చెబుతుంటారు. అది వాళ్లిష్టం. నా దృష్టిలో వ్యక్తిగత విషయాల్ని నేను సోషల్ మీడియాలో పెట్టను. నాతో పాటు, నా కుటుంబసభ్యుల ప్రైవసీ కూడా పోతుంది.”
సోషల్ మీడియా చాలా పవర్ ఫుల్ అంటున్నాడు గోపీచంద్. దాన్ని ఎంత జాగ్రత్తగా వాడితే అంత మంచిదని, మరీ ఎక్కువగా వాడితే, ఏదో ఒక టైమ్ లో తిరిగి మనకే రివర్స్ కొడుతుందని చెబుతున్నాడు.
ఇక ఇంటర్వ్యూల్లో మాట్లాడే విషయంపై స్పందిస్తూ.. ఈమధ్య తన ఫ్రెండ్ ప్రభాస్ కూడా ఇంటర్వ్యూల్లో ఎక్కువగా మాట్లాడుతున్నాడని, తను కూడా ప్రభాస్ లా కొంచెం మారానని, కాస్త ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నానని చెప్పుకొచ్చాడు గోపీచంద్.