లాక్ డౌన్ కారణంగా నిఖిల్ సినిమాల ఆర్డర్ మొత్తం మారిపోయింది. 6 నెలలకు ఒక సినిమా చొప్పున మినిమం గ్యాప్స్ లో సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు ఈ హీరో. కానీ ఇప్పుడు అన్ని సినిమాలు ఒకే టైమ్ కు రెడీ అయ్యాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య తన సినిమాలన్నింటినీ నెల, 2 నెలల గ్యాప్ లో విడుదల చేయబోతున్నాడు ఈ హీరో. నిఖిల్ కొత్త సినిమాల రిలీజ్ డేట్స్ అన్నీ లాక్ అయ్యాయి.
నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ-2 సినిమా జులై 22న విడుదలవుతుంది. ఇక గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై చేసిన 18-పేజెస్ సినిమా సెప్టెంబర్ 10న రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత స్పై అనే సినిమా అక్టోబర్ లో దసరా కానుకగా థియేటర్లలోకి వస్తోంది. ఇలా 3-4 నెలల గ్యాప్ లో నిఖిల్ నుంచి వరుసపెట్టి 3 సినిమాలు రాబోతున్నాయి.
ఈ రిలీజ్ డేట్స్ అన్నీ అధికారికంగా ప్రకటించినవే. అయితే ఇప్పుడీ తేదీల మధ్య గ్యాప్స్ ను కాస్త పొడిగించే పనిలో పడ్డాడు ఈ హీరో. ఇందులో భాగంగా తన సినిమాల నిర్మాతలతో చర్చలు జరుపుతున్నాడు. తన సినిమాల మధ్య కనీసం 2 నెలల గ్యాప్ వచ్చేలా చూస్తున్నాడు.
ఈ క్రమంలో నిఖిల్ సినిమాల విడుదల తేదీలు మరోసారి మారే అవకాశం ఉంది. అయితే రిలీజ్ డేట్స్ ఎట్నుంచి ఎటు మారినా, ఈ 3 సినిమాలు ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి రావడం పక్కా అంటున్నాడు ఈ హీరో. మరోవైపు సుధీర్ వర్మ డైరక్షన్ లో అతడు చేసిన ఓ సినిమాపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ లేదు.