ఇకపై మీడియా ముందుకు నయనతార?

ఎంత పెద్ద సినిమా చేసినా మీడియా ముందుకు రావడానికి ఇష్టపడదు నయనతార. సినిమాకు సైన్ చేసినప్పుడే తను ప్రచారం చేయననే కండిషన్ ను అందులో పొందుపరుస్తుంది ఈ బ్యూటీ. కొన్నేళ్లుగా ఇదే పద్ధతి ఫాలో…

ఎంత పెద్ద సినిమా చేసినా మీడియా ముందుకు రావడానికి ఇష్టపడదు నయనతార. సినిమాకు సైన్ చేసినప్పుడే తను ప్రచారం చేయననే కండిషన్ ను అందులో పొందుపరుస్తుంది ఈ బ్యూటీ. కొన్నేళ్లుగా ఇదే పద్ధతి ఫాలో అవుతున్న నయనతార, ఇప్పుడా పద్ధతి నుంచి పక్కకొచ్చే అవకాశం ఉందంటున్నారు కోలీవుడ్ జనాలు.

గతంలో ప్రభుదేవాతో ఆమె డేటింగ్ చేసింది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ పీటల వరకు వచ్చి ఆ పెళ్లి ఆగిపోయింది. అంతకంటే ముందు శింబుతో నయన్ సాగించిన ప్రేమాయణం సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో..  మీడియా ముందుకొస్తే ఈ అంశాలపై స్పందించాల్సి వస్తుందనే కారణంతో, దాదాపు 15 ఏళ్లుగా మీడియాకు దూరమైంది నయనతార.

అయితే ఇప్పుడామె లైఫ్ లో సెటిలైంది. లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్, దర్శకుడు విఘ్నేష్ ను పెళ్లాడింది. సో.. ఇప్పుడిక  ఆమె మీడియా ముందుకు రావొచ్చు. ఆమె గతానికి సంబంధించిన ప్రశ్నల్ని మీడియా అడిగే అవకాశం లేదు. కాబట్టి ఇకపై సినిమా ప్రమోషన్లకు నయనతార వచ్చే అవకాశం ఉందని ఆమె ప్రొడ్యూసర్లు సంబర పడుతున్నారు.

మరోవైపు తన కండిషన్ల లిస్ట్ లో మరో కొత్త అంశాన్ని చేర్చిందట నయనతార. ఇకపై సినిమాల్లో రొమాంటిక్ సీన్లు చేయకూడదని నిర్ణయించుకుందట. ఈ మేరకు తన నిర్మాతలకు నయనతార సమాచారం అందించిందని కోలీవుడ్ నుంచి కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో 3 సినిమాలున్నాయి.