‘దిశ’ ఎన్‌కౌంట‌ర్ దోషులెవ‌రో తేలిపోయింది

దేశ వ్యాప్తంగా తీవ్ర సంచ‌ల‌నం సృష్టించిన ‘దిశ’ హ‌త్యాచార కేసులో నిందితుల ఎన్‌కౌంట‌ర్‌పై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్‌కౌంటర్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. విచార‌ణ‌లో…

దేశ వ్యాప్తంగా తీవ్ర సంచ‌ల‌నం సృష్టించిన ‘దిశ’ హ‌త్యాచార కేసులో నిందితుల ఎన్‌కౌంట‌ర్‌పై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్‌కౌంటర్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. విచార‌ణ‌లో భాగంగా సిర్పూర్క‌ర్ క‌మిష‌న్ నివేదిక‌ను గోప్యంగా ఉంచాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది శ్యామ్ దివాన్ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్వీ ర‌మ‌ణ‌ను కోరారు. నివేదిక‌ను బ‌య‌ట పెడితే న్యాయ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ప్ర‌ధాన న్యాయ‌మూర్తి స్పందిస్తూ ఈ కేసులో దోషులెవరు అనేది కమిషన్ గుర్తించింద‌న్నారు. ఇందులో దాచాల్సింది ఏమీ లేద‌న్నారు. దేశంలో దారుణ ప‌రిస్థితులున్నాయ‌ని చీఫ్ జ‌స్టిస్ అన్నారు. ఇదే సంద‌ర్భంలో సిర్పూర్క‌ర్ క‌మిష‌న్ నివేదిక‌ను ఎందుకు బ‌హిరంగ‌ప‌ర‌చ‌కూడ‌ద‌ని ధ‌ర్మాస‌నంలోని జ‌డ్జి హిమాంశు శుక్లా ప్ర‌శ్నించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. కేసును హైకోర్టుకు బదిలీ చేస్తున్నామని చెప్పారు. నివేదికను హైకోర్టుకు అందించాలని ఆదేశించారు. చట్ట ప్రకారం ఏం చేయాలో హైకోర్టు నిర్ణయిస్తుందని సీజేఐ వ్యాఖ్యానించారు.

సీనియర్లతో కూడిన కమిటీకి నివేదిక అందజేయాలని ఆయన తెలిపారు. నివేదికను బహిర్గతం చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నివేదిక బయటకు వస్తే అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయని సుప్రీంకోర్టు అభిప్రాయ‌ప‌డింది. కేసుకు సంబంధించి త‌దుప‌రి చ‌ర్య‌లు ఏం తీసుకోవాలో తెలంగాణ హైకోర్టు చూసుకుంటుంద‌ని ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. కేసును ప్ర‌త్యేకంగా తాము ప‌ర్య‌వేక్షించ‌లేద‌ని పేర్కొంది. 

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన కేసుకు సంబంధించి సిర్పూర్క‌ర్ నివేదిక‌ను పూర్తిగా చూడ‌కుండా వాద‌న‌లు విన‌లేమ‌ని, అలాగే కేసును నేరుగా ప‌రిశీలించ‌డం సాధ్యం కాద‌ని సుప్రీంకోర్టు తెలిపింది.

హైకోర్టు, కిందిస్థాయి కోర్టుల్లో ఏం జ‌రుగుతుందో తెలియ‌ద‌ని ధ‌ర్మాస‌నం పేర్కొంది. నివేదిక పంపుతామ‌ని, హైకోర్టే నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. ఇదిలా వుండ‌గా ఇవాళ సుప్రీంకోర్టుకు ఎన్‌కౌంట‌ర్ స‌మ‌యంలో సైబ‌రాబాద్ సీపీగా వ్య‌వ‌హ‌రించిన‌ స‌జ్జ‌నార్ హాజ‌ర‌య్యారు.