సీనియర్ నటి జీవితా రాజశేఖర్‌పై జోస్టర్ ఎంటర్‌ప్రైజర్స్ ఎండీ హేమ, గరుడవేగ నిర్మాత కోటేశ్వరరాజు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో గురువారం జీవితా రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా తనపై వస్తున్నన్ని కథనాలు మరెవరిపై రాలేదన్నారు. గరుడవేగ సినిమాకు సంబంధించి తాము భారీ మొత్తంలో డబ్బు ఎగ్గొట్టామని కొందరు ఆరోపిస్తే, అదే నిజమన్నట్టు మీడియా తనతో పాటు కుటుంబ సభ్యులపై ఏవేవో రాసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జీవితా రాజశేఖర్ ఆవేదన నేపథ్యంలో మరోసారి హేమ, ఆమె భర్త కోటేశ్వరరాజు తిరుపతిలో మీడియా ముందుకొచ్చారు. జీవితాపై ఘాటు ఆరోపణలు చేశారు. జీవితారాజశేఖర్ సైలెంట్ కిల్లర్ అని హేమ ఘాటు కామెంట్ చేశారు. అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
తమకు పరువు, ప్రతిష్ట, స్తోమత, అర్హతలున్నాయని చెప్పుకొచ్చారు. తనకు జీవితా రాజశేఖర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జీవితా రాజశేఖర్ మొదట తానెవరో తెలియదన్నట్టు చెప్పారన్నారు.
ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్‌కు ఐదు ప్రశ్నలు సంధించారు. తన వద్ద అప్పు తీసుకున్నావా? లేదా? అని ప్రశ్నించారు. అప్పు కోసం ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టారా? లేదా? అని నిలదీశారు. తనకు క్షమాపణ చెప్పారా? లేదా? అని ప్రశ్నించారు. డబ్బు తీసుకుని జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
న్యాయస్థానంలో తమకు న్యాయం దొరుకుతుందన్నారు. ఇంత జరుగుతున్నా రాజశేఖర్ ఎందుకు బయటికి రాలేదని ప్రశ్నించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని జీవితారాజశేఖర్‌కు హేమ హితవు చెప్పారు.
గరుడవేగ నిర్మాత కోటేశ్వరరాజు మాట్లాడుతూ అన్ని ఆధారాలను దగ్గర పెట్టుకుని తాము మీడియాతో మాట్లాడుతున్నా మన్నారు. సెలబ్రిటీలకే కాదు, సామాన్యులకు కూడా లైఫ్ వుంటుందన్నారు. తప్పు చేస్తే ఎవరైనా ఒకటే అన్నారు. జీవితా రాజశేఖర్ 420 వేషాల గురించి మాట్లాడుతున్నామన్నారు.
ప్రొడ్యూసర్లను అవమానించే రీతిలో వారు మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేవలం సింపతీ కోసమే జీవితా రాజశేఖర్ ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. జీవితా సినిమాల్లో నటిస్తే బాగుంటుందని, నిజ జీవితంలో కాదని కోటేశ్వరరాజు హితవు చెప్పారు.