2024 ఎన్నికల్లో గన్నవరం నుంచి …అది కూడా వైసీపీ టికెట్‌పై పోటీ చేస్తానని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తేల్చి చెప్పారు. గన్నవరంలో వల్లభనేని, వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు నెలకున్న నేపథ్యంలో పార్టీ పెద్దలు నష్ట నివారణ చర్యలు చేపట్టారు.
గురువారం రాత్రి దుట్టా, ఆయన అల్లుడైన వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శివభారత్ రెడ్డిలను సీఎంఓకు పిలిపించుకుని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యదర్శి కె.ధనుంజయ్‌రెడ్డి చర్చించారు.
గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడుతున్నారని వారి దృష్టికి తీసుకెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో అక్రమ క్వారీల నిర్వహణ, మట్టి అమ్మకాలకు ఎమ్మెల్యే, ఆయన అనుచరులను పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
సజ్జల, ధనుంజయ్‌రెడ్డిలతో చర్చల అనంతరం దుట్టా మీడియాతో మాట్లాడుతూ వంశీతో కలిసి ఎట్టి పరిస్థితుల్లో పని చేయమని స్పష్టం చేశారు. వైఎస్సార్ కుటుంబానికి శక్తి మేరకు సాయం చేయడం మాత్రమే తెలుసన్నారు. అవమానాలు భరిస్తూ ఇంకొకరి వెంట నడవాల్సిన అవసరం తమకు లేదని దుట్టా తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
సీఎంవో అధికారులు పిలిస్తే వెళ్లి మాట్లాడ్తానన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చని చెప్పారు. గన్నవరం వైసీపీ టికెట్‌పై వల్లభనేని క్లారిటీ ఇచ్చారు. తనకే టికెట్ అని చెప్పి అనుమానాలకు తెరదించారు.
చంద్రబాబుతో విభేదించి వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వంశీ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో కూడా ప్రత్యేకంగా సీటు కేటాయించారు. వల్లభనేని రాకపై వైసీపీ నియోజకవర్గ నేత అసంతృప్తిగా ఉన్నారు. వల్లభనేని నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితి లేదు. చివరికి వల్లభనేని మిగిలి, ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకించే వాళ్లు వెళ్లిపోయే వాతావరణం కనిపిస్తోంది.