వారసత్వ రాజకీయాలకు, కుటుంబ పార్టీలకు తాము వ్యతిరేకమని బీజేపీ నేతలు మాట్లాడ్డం వింటున్నాం. అయితే బీజేపీ మిత్రుడు, జనసేనాని పవన్‌కల్యాణ్ నోట అదే మాట రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన జనసేన నేత సైదులు కుటుంబ సభ్యులను శుక్రవారం పవన్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల భీమా చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ తెలంగాణలో పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనాని, తెలంగాణకు వచ్చే సరికి ఆ పార్టీతో లేనట్టు పరోక్షంగా చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో మూడోవంతు స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 5 వేల ఓట్లు జనసేనకు ఉన్నాయన్నారు. తెలంగాణలో గెలుపోటములను తమ పార్టీ ప్రభావితం చేస్తుందన్నారు.
ఆంధ్రలోనే అధికారం ఆశించలేదని, తెలంగాణలో ఎలా ఆశిస్తానని ఆయన ప్రశ్నించడం గమనార్హం. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాజకీయాల్లో కొత్త తరం రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్ను దృష్టిలో పెట్టుకుని పవన్ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారా? అనే ప్రశ్నలొస్తున్నాయి.
అలాంటప్పుడు ఏపీలో మాత్రం టీడీపీతో కలిసి ప్రయాణించాలని పవన్ ఎలా అనుకుంటున్నారనే నిలదీతలు వెంటనే వస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లో కొత్త తరం రావాలని పవన్ కోరుకోవడం లేదా? అని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని పవన్ చేసిన వ్యాఖ్యలు, ఏపీలో ఆయనకు రివర్స్ అయ్యేలా కనిపిస్తున్నాయి.