టైటిల్: శేఖర్
రేటింగ్: 2.5/5
తారాగణం: రాజశేఖర్, ముస్కాన్, శివాని రాజశేఖర్, అత్మీయ రాజన్, కిషోర్, సమీర్, భరణి శంకర్, అభినవ్ గోమఠం, ప్రకాశ్ రాజ్ తదితరులు
కథ: షాహి కబీర్
కెమెరా: మల్లికార్జున్
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాత: వెంకట శ్రీనివాస్, శివాని రాజశేఖర్
దర్శకత్వం: జీవిత రాజశేఖర్
విడుదల తేదీ: 20 మే 2022
మళయాళంలో “జోసెఫ్” పేరుతో వచ్చిన సినిమాకి మక్కీకి మక్కీ రీమేక్ ఈ శేఖర్. మళయాలం సినిమాలంటేనే పకడ్బందీ స్క్రీన్ ప్లేతో ఉత్కంఠభరితంగా సాగుతాయని చాలామంది అభిప్రాయం. అది చాలా వరకు నిజం కూడా. అయితే అప్పుడప్పుడూ వాళ్లు కూడా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుని స్క్రీన్ ప్లే ముడులు గట్టిగా బిగించకుండా తీస్తుంటారు.
“జోసెఫ్” మంచి కథాంశమే కానీ అసలు పాయింట్ కంటే హీరో బ్యాక్ స్టోరీ, అతని కుటుంబం మొదలైనవి కాస్త బరువుగానే అనిపిస్తాయి. ఉత్కంఠభరితమైన క్రైం థ్రిల్లర్ చూసే క్రమంలో ఒక్కోసారి ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్లు, పాటలు అనుభూతికి అడ్డు పడుతుంటాయి.
అలాంటి వాటిని రీమేక్ చేసినప్పుడు స్క్రీన్ ప్లే మీద మరింత శ్రద్ధ పెట్టాలి. కానీ అదేమీ చేయకుండా జీవిత రాజశేఖర్ యథాతథంగా రీమేక్ చేసేసారు. ఎక్కడో ఒకటి రెండు సన్నివేశాలు తప్ప మొత్తనికి మొత్తం ఒరిజినల్ కి నకలే ఈ శేఖర్. అయినా కూడా స్క్రీన్ ప్లే క్రెడిట్ ఆమే వేసుకున్నారు.
మళయాళం లో సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ అనగానే తెలుగువారికి వెంటనే గుర్తొచ్చేది దృశ్యం. ఒక క్రైం ని ట్రేస్ చేసే క్రమంలో పోలీసులు ఎలా ఆలోచిస్తారనే అంశాల్ని ఆ సినిమాలో కవర్ చేసినంత సమర్థవంతంగా అంతకు ముందు ఎప్పుడూ చేసినట్టు కనపడదు. టెక్నాలజీ యుగంలో క్రైం ని ఎలా ట్రాక్ చేస్తారో ఆ సినిమా చూసిన పేక్షకులందరికీ కొంత ఇంఫర్మేషన్ ఉంటుంది.
ఈ “శేఖర్” లో క్రైం ఇన్వెస్టిగేషన్ మొత్తం ఫోన్ కాల్స్ ని ట్రాకింగ్ చేయడం ద్వారానే జరుగుతుంటుంది. దృశ్యం చూసేసిన జనానికి అందులో ఆశ్చర్యపరిచే విషయలేవీ ఉండవు. దానివల్ల హీరో తెలివితేటలకి ప్రేక్షలు ముగ్ధులవడమనేది జరగదు.
తెర మీద కనిపించే ప్రతి ప్రధాన పాత్రది విషాదాంతమే. దాని వల్ల సెంటిమెంట్ ఎక్కువైపోయి థ్రిల్లర్ ఎలిమెంట్ డైల్యూట్ అయ్యింది.
కానీ ఏమాటకామాట చెప్పుకోవాలి…రాజశేఖర్ తన పాత్రతో మెప్పించారు. తన వయసుకు తగిన పాత్రతో కనిపించారు. చాలాకాలం తర్వాత ఆయనకు సాయికుమార్ డబ్బింగ్ చెప్పడం బాగుంది. ఈ తరహా పాత్రల్లో రాజశేఖర్ తరచూ కనిపించొచ్చు.
జార్జ్ రెడ్డి హీరోయిన్ ముస్కాన్ కాస్త లావెక్కినా అందంగానే కనిపించింది ఇందులో. రాజశేఖర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి ఆమె సరిపోయింది.
అలాగే మళయాళ వెర్షన్లో కనిపించిన పాత్రలోనే ఆత్మీయ రాజన్ కనిపించింది. కూతురుగా శివాని రాజశేఖర్ ది అతిథి పాత్ర లాంటిదే.
హీరో ఫ్రెండ్స్ లో ఒకడిగా కనిపించిన సమీర్ చాలా లావుగా అన్ హెల్దీగా కనిపించాడు. మిగిలిన వాళ్ల మమూలే.
ప్రకాశ్ రాజ్ ది క్లైమాక్స్ లో వచ్చే సింగిల్ సీన్ పర్ఫార్మెన్స్ అంతే.
రాజశేఖర్ ఇంట్రో సీన్ కి ఇచ్చిన రెట్రో స్టైల్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు గొప్పగా లేవు. నీరసంగా సాగుతూ కథనానికి అడ్డుపడేలా ఉన్నాయి. డయలాగ్స్ కూడా మళయాళానికి అనువాదమే తప్ప కొత్త మెరుపులేవీ లేవు.
కథలో క్రైం ట్రాక్ లో ఉన్న సస్పెన్స్ పాయింట్ ఏంటనేది క్లైమాక్స్ కి సుమారు అరగంట ముందే తెలిసిపోతుంది. దాంతో ప్రెడిక్టెబుల్ క్లైమాక్స్ ని చూడడం తప్ప ఇంకేముండదు. అయితే క్రిమినల్స్ ని పట్టించడానికి హీరో తీసుకున్న నిర్ణయం ఒక్కటే ఈ సినిమాలో బలమైన పాయింట్.
దర్శకురాలిగా జీవిత తన పని బాగానే నిర్వహించారు. మార్గదర్శకంగా ఒరిజినల్ వెర్షన్ ఉంది కనుక ఆమెకు పని తేలికయ్యిందనేది వేరే చెప్పక్కర్లేదు.
మూలం చూసినవాళ్లకి ఎటువంటి కొత్త అనుభూతీ కలగదు. చూడని వాళ్లు ఒకసారి చూడొచ్చు. కదలకుండా కుర్చీలకి అతుక్కుపోయేలాంటి విషయమైతే లేదు.
బాటం లైన్: మూలానికి యథాతథం