స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ ఒక సరికొత్త కరపత్రం విడుదల చేసింది. కానీ ఈ కరపత్రాన్ని పరిశీలిస్తే మాత్రం, లోతుగా అర్థం చేసుకుంటే మాత్రం.. అందులో ఉన్న విషయాలనే కాకుండా.. స్వబుద్ధితో ఆలోచిస్తే మాత్రం.. జగన్ వ్యతిరేకులకు కూడా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని అనిపించడం తథ్యం. ‘‘కోరుకున్నదేమిటి?- దక్కిందేమిటి?’’ పేరుతో తెదేపా విడుదల చేసిన కరపత్రాన్ని ఎవరు గమనించినాసరే.. దక్కిందేమిటో తమకు తెలిసిన మేర ఆలోచించినా సరే.. వైకాపాకే ఓటు వేయాలని అనిపిస్తుంది.
అసలే మేథావుల కూటమి అయిన తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికల సందర్భంగా.. ఒక అత్యద్భుతమైన కరపత్రం విడుదల చేసింది. గత అయిదేళ్లలో స్థానిక సంస్థల బలోపేతానికి తాము ఏం చేశామో.. ఈసారి స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ వారికి పట్టం కడితే.. ఎలా మంచి పనులు చేస్తామో అందులో మచ్చుకైనా లేదు. కేవలం జగన్ మీద బురద చల్లడం ఒక్కటే లక్ష్యంగా ఆ కరపత్రం రూపొందింది.
‘‘ఒక్క అవకాశం అడిగారు.. ఇచ్చారు.. కోరుకున్నదేంటి.. దక్కిందేంటి..’’ అనే టైటిల్ తో ఆ కరపత్రం రూపొందింది. ఆ కరపత్రంలో కూడా అమరావతినే నెత్తిన పెట్టుకున్న తెలుగుదేశం.. తద్వారా.. తతిమ్మా రాష్ట్రంలో తమ ఓటర్లను తామే దూరం చేసుకుంది. మద్య నిషేధం కోరుకునే వారు ప్రభుత్వ చర్యల పట్ల హేపీగా ఉండగా.. కరపత్రం విషం కక్కింది. సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల నియామకాల్ని అపహాస్యం చేసింది. ఇలా అనేక రకాలుగా తమ వేలితో తమ కన్నే పొడుచుకునే ప్రయత్నం చేసింది. నిజానికి కోరుకున్నదేంటి.. దక్కిందేంటి.. అనే విశ్లేషణ ఒక్క పాయింట్ లో కూడా జరగనేలేదు.
కానీ.. నిజానికి ఆ కోణంలో ఆలోచిస్తే.. జగన్ సర్కారు వచ్చిన తర్వాత.. కోరుకున్నదాని కంటె ప్రజలకు ఎక్కువగానే దక్కింది. కొత్త ఉద్యోగాలు.. వాలంటీర్లు, గ్రామ సచివాలయాల రూపేణా ఎక్కువే వచ్చాయి. రైతన్నలకు ఏడా అందించే సాయం.. హామీ ఇచ్చిన దానికంటె.. కోరుకున్నదానికంటె ఎక్కువే దక్కింది. అమ్మఒడి పదివేలు హమీ ఇచ్చిన జగన్, పదిహేను వేలు అందజేస్తున్నారు. ఇలా అనేక రకాలుగా.. ప్రజలు కోరుకున్నదానికంటె వారికి ఎక్కువే దక్కుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజలకు వాస్తవాలు తెలుసు.. ఇలాంటి విషప్రచారాలకు వారు లొంగరు.. అని అంతా అనుకుంటున్నారు.