రాజకీయాల్లో తనది 40 ఏళ్ల ఇండస్ట్రీ అని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని, 11 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పని చేశానని గొప్పలు చెప్పుకునే బాబు…తనదంటూ ఒక్క పాజిటివ్ అంశంలో కూడా సొంత ముద్ర వేయలేకపోయాడు. కానీ నెగిటివ్ అంశాలకొస్తే బాబును బోనులో నిలబెట్టేందుకు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు వెన్నుపోటు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే…మొట్ట మొదట చంద్రబాబే గుర్తు కొస్తాడు. అలాగే పదేపదే అబద్ధాలు చెప్పడంలో బాబును మించిన వారు లేరని చెబుతారు.
అసలు ఆయన 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఎందుకు పనికొస్తున్నదో అర్థం కాని ప్రశ్న. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల విషయానికే వద్దాం. బీసీల రిజర్వేషన్లపై జరుగుతున్న గొడవ గురించి అందరికీ తెలిసిందే. హైకోర్టులో జగన్ సర్కార్‌కు వ్యతిరేక తీర్పు రావడంతో బీసీలకు 34% కు బదులు 24% రిజర్వేషన్లు కుదిస్తూ స్థానిక ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. అయితే సీఎం జగన్ తన పార్టీ తరపున 34% రిజర్వేషన్లను బీసీలకు కేటాయిస్తూ సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. జగన్ సర్కార్ ఎత్తులకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ చిత్తు అయ్యింది.
ఎన్నికల ముంగిట చావుదెబ్బ తిన్న టీడీపీ…ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు యత్నించింది. ఒక రోజు ఆలస్యంగా తాము కూడా బీసీలకు 34% పైగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అయితే బాబు వైఖరి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న మాదిరిగా తయారైంది.
ఒకవైపు వైసీపీ బీసీలకు 34% సీట్లు ఇవ్వాలనే నిర్ణయం జనంలోకి శరవేగంగా వెళ్లిపోయింది. ఇంకా బీసీ సాధికారత అణచివేసేందుకు వైసీపీ ప్రభుత్వం రిజర్వేషన్లను 34%నుంచి 24%కు తగ్గించిందని బాబు విమర్శించడం వల్ల ప్రయోజనం ఉండదు. బాబువి BC కాలం నాటి విమర్శలు. అంటే క్రీస్తుకు పూర్వం (Before Christ) విమర్శలన్న మాట. ఇప్పుడు కాలం మారింది. మారంది బాబు మాత్రమే.
ఎందుకంటే వైసీపీ ప్రాక్టికల్‌గా బీసీలకు 34% సీట్లను ఇస్తున్నప్పుడు, బాబు పసలేని ఆరోపణలు చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? ఎన్నికలంటేనే ఎత్తులు పైఎత్తులైనప్పుడు…అందులో జగన్ ఒక పది అడుగుల ముందు వరుసలో ఉంటే…బాబు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాడు. ఆ ప్రస్టేషన్‌లో జగన్ సర్కార్‌పై పొంతనలేని, పసలేని, వాస్తవ విరుద్ధ ఆరోపణలు చేస్తూ…మరోసారి అభాసుపాలు అవుతున్నాడు. ఇందుకు బీసీ రిజర్వేషన్ల వ్యవహారమే నిదర్శనం.