పంచాయతీ ఎన్నికల్లో పల్లెల్లో పోటీ మామూలుగా ఉండదని వేరే చెప్పనక్కర్లేదు. పచ్చని పల్లెల్లో కూడా అనేక రాద్ధాంతాలకు కారణం అవుతుంటాయి పంచాయతీ ఎన్నికలు. పంచాయతీ ప్రెసిడెంట్ కు ఉన్న పవర్స్ సంగతెలా ఉన్నా, పల్లెల్లో దాన్నొక ప్రతిష్టాత్మక అంశంగా తీసుకుంటారు. దీంతోనే పంచాయతీ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉంటుంది.
మరి అలాంటి పోటీలకు భిన్నంగా, ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ ను ఎన్నుకునే గ్రామ పంచాయతీలకు ప్రత్యేకమైన గ్రాంట్లు అందనున్నాయి. ఈ మేరకు జీవో విడుదల కాబోతూ ఉంది. పంచాయతీ ప్రెసిడెంట్ ఎన్నికను ఏకగ్రీవం చేసి, ప్రభుత్వానికి అనవసరమైన ఖర్చును, పల్లెల్లో అనవసరమైన టెన్షన్ ను లేకుండా చేస్తే.. ఆయా పంచాయతీలకు మంచి స్థాయిలో నిధులు అందనున్నాయి.
రెండు వేల జనాభాలోపు ఉన్న పంచాయతీల్లో ఎన్నిక ఏకగ్రీవం అయితే. దానికి ఐదు లక్షల రూపాయల మొత్తం అందనుందని తెలుస్తోంది. అదే రెండు నుంచి ఐదువేల జనాభా ఉన్న పంచాయతీలో ఎన్నిక ఏకగ్రీవం అయితే పది లక్షల రూపాయలు, పది వేల జనాభా వరకూ ఉన్న పంచాయతీలో ఓటింగ్ జరగకపోతే 15 లక్షల రూపాయలు, అంతకు మించి జనాభా ఉన్న మేజర్ పంచాయతీల్లో ఎన్నిక ఏకగ్రీవం అయితే 20 లక్షల రూపాయల వరకూ నిధులు అందనున్నాయి. ఈ మేరకు జీవో జారీ కాబోతోందని సమాచారం.
ఆయా గ్రామాల అభివృద్ధికి ఇలాంటి నిధులు ఉపకరించే అవకాశం ఉంది. కాబట్టి ఏకగ్రీవం అయితే ఆయా పంచాయతీలకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది. మరి అందుకు విలేజ్ పొలిటీషియన్లు ఒప్పుకుంటారా? తక్కువ గ్రామ పంచాయతీల్లో మాత్రమే ఏకగ్రీవ ఎన్నిక జరిగే అవకాశం ఉంది.