అమరావతికి ఆ రకంగానూ దెబ్బే!

ఆంధ్రప్రదేశ్ లో అధికార వికేంద్రీకరణ జరిగి.. మూడు ప్రాంతాల్లోనూ మూడు వ్యవస్థల రాజధానులు ఏర్పాటు చేయాలనేది జగన్ ప్రభుత్వ సంకల్పం. రాజధాని అనేది అన్ని రకాలుగానూ అమరావతిలో మాత్రమే ఉండాలంటూ.. ఆ ప్రాంతానికి చెందిన…

ఆంధ్రప్రదేశ్ లో అధికార వికేంద్రీకరణ జరిగి.. మూడు ప్రాంతాల్లోనూ మూడు వ్యవస్థల రాజధానులు ఏర్పాటు చేయాలనేది జగన్ ప్రభుత్వ సంకల్పం. రాజధాని అనేది అన్ని రకాలుగానూ అమరావతిలో మాత్రమే ఉండాలంటూ.. ఆ ప్రాంతానికి చెందిన రైతులు ఆందోళనలు చేస్తున్నారు. 80రోజులకు పైగా వారి దీక్షలు సాగుతూనే ఉన్నాయి.

అమరావతి అనే రాజధాని విస్తరించిన 29 గ్రామాల్లోని మెజారిటీ ప్రజల్లో గనుక.. జగన్ నిర్ణయం పట్ల వ్యతిరేకత ఉన్నట్లయితే అది కూడా బయటపడే అవకాశం తగ్గిపోయింది. స్థానిక సంస్థల, పంచాయతీల ఎన్నికలు అక్కడ జరిగితే.. వారి ఆందోళన కాస్త బయటపడేది.

కానీ.. ఆ గ్రామాల్లో ఎన్నికలు ఉండవంటూ ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. రాజధాని గ్రామాలను సమీప మునిసిపాలిటీల్లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వచ్చింది.

పంచాయతీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఉండే ప్రజల మనోగతం బయటపడుతుంది. సాధారణంగా ప్రభుత్వం గ్రామీణ స్థాయి వరకు చేపట్టే సంక్షేమ పథకాల ప్రభావం ఎంతో కూడా ఈ ఎన్నికల్లో కనిపిస్తుంది. ఆ రకంగా చూసినప్పుడు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపాకే ఆధిక్యం కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అయితే అమరావతి ప్రాంతంలో మాత్రం ఫలితాలు భిన్నంగా ఉండవచ్చుననేది ఒక విశ్లేషణ.  ఆ ప్రాంతంలో ప్రభుత్వ నిర్ణయం పట్ల వ్యతిరేకత ఉండేదినిజమే అయితే గనుక… అది ఈ ఎన్నికల్లో బయటపడొచ్చు.

తమ నిరసనలను జనం దృష్టికి తీసుకువెళ్లడానికి అమరావతి ప్రాంతం రైతులు అనేక రకాలుగా పాట్లు పడుతున్నారు. చిత్రవిచిత్రమైన పద్ధతుల్లో తమ నిరసనలను వ్యక్తంచేస్తూ గడుపుతున్నారు. ఇప్పుడు అక్కడ ఎన్నికలు జరగకపోతే.. ఆ ప్రాంతం వారి అభిప్రాయాలు వ్యక్తం కావడానికి దెబ్బే. సమీప మునిసిపాలిటీల్లో చేరడం అనేది అభివృద్ధిపరంగా వారికి మంచిదే అయినప్పటికీ.. ఎన్నికలు లేకపోవడాన్ని వారు ఎలా స్వీకరిస్తారో చూడాలి.

పరిశ్రమ పరువు తీసేది కాదు, పరువు పెంచేది ఈ సినిమా