మొత్తానికి శీనయ్య బండి కదులుతోంది. దర్శకుడు వివి వినాయక్ కీలకపాత్రలో మరో చిన్న హీరోను తీసుకుని, సినిమా చేయాలన్నది నిర్మాత దిల్ రాజు సంకల్పం. రచయిత, దర్శకుడు నరసింహారావు తెచ్చిన పాయింట్ ను తీసుకుని, సరైన స్క్రిప్ట్ తయారుచేయించాలని చాలా కాలంగా కిందా మీదా అవుతున్నారు.
ఈ ప్రాజెక్టు కోసం వినాయక్ బరువు, లావు కూడా తగ్గించుకుని, డిఫరెంట్ గా తయారయ్యారు. కానీ స్క్రిప్ట మాత్రం సెట్ కావడం లేదు. చాలా మంది కలిసి కుస్తీ పట్టారు. ఆఖరికి శీనయ్య ప్రాజెక్ట్ ఆగిపోతుంది అన్న వరకు వచ్చింది వ్యవహారం. కానీ దిల్ రాజు-వినాయక్ ఈ ప్రాజెక్టును వదలడం లేదు. అంత హడావుడిగా లాంచ్ చేసిన ప్రాజెక్టు ఆగకూడదని వారి భావన.
అందుకే స్క్రిప్ట్ లాక్ అయిన మేరకు సెట్ మీదకు వెళ్లిపోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 19 లేదా 20 తేదీల్లో షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఆ వేళకు టోటల్ స్క్రిప్ట్ లాక్ అయిపోతుందని కూడా లెక్క వేసుకుంటున్నారు.