మరోసారి జగన్ ను ఫాలో అవుతున్న కేసీఆర్

జగన్ ప్రవేశపెడుతున్న విధానాలు ఇతర రాష్ట్రాల్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. జగన్ అమలు చేయబోతున్న మూడు రాజధానుల అంశాన్ని ఉత్తరాఖండ్ లో కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది ఆ రాష్ట్ర ప్రభుత్వం.…

జగన్ ప్రవేశపెడుతున్న విధానాలు ఇతర రాష్ట్రాల్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. జగన్ అమలు చేయబోతున్న మూడు రాజధానుల అంశాన్ని ఉత్తరాఖండ్ లో కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఇక జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాల కాన్సెప్ట్, పొరుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బాగా నచ్చింది.

త్వరలోనే తెలంగాణలో చేపట్టనున్న రెవెన్యూ సంస్కరణల కోసం ఏపీలో అమలవుతున్న విలేజ్ సెక్రటేరియట్ కాన్సెప్ట్ ను వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నారు కేసీఆర్. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి, జగన్ ప్రవేశపెట్టిన మరో పథకాన్ని కూడా ఫాలో అవ్వాలని నిర్ణయించారు. అదే ఇంగ్లిష్ మీడియం.

అవును.. జగన్ ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ మీడియం విధానంపై కేసీఆర్ కూడా దృష్టిపెట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెడుతూ జగన్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిదంటూ స్వయంగా మండలిలో కేసీఆర్ ప్రకటించారు.

అంతేకాదు… తన అబ్జర్వేషన్ ప్రకారం, ఏపీ ప్రజల నుంచి జగన్ నిర్ణయానికి సానుకూల స్పందన వచ్చిందని కూడా ఉన్నారు. దీనికి కొనసాగింపుగా మాట్లాడుతూ.. తాము కూడా తెలంగాణలో ఇంగ్లిష్ మీడియం అమలుపై దృష్టి సారిస్తామని కేసీఆర్ ప్రకటించారు.

మారిన పరిస్థితుల్లో విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి. ఇంగ్లిష్ మాట్లాడ్డంతో పాటు సిలబస్ ను ఇంగ్లిష్ లో నేర్చుకోవడం వల్ల వాళ్లు ప్రపంచంతో పోటీపడతారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఉద్యోగాలు పొందడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, కెరీర్ లో మరింత ఎత్తుకు వెళ్లడానికి ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి అనే విషయాన్ని కేసీఆర్ కూడా గ్రహించారు. అందుకే బడ్జెట్ సమావేశాల తర్వాత నిపుణులతో చర్చించి దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లిష్ మీడియం పెట్టాలని కేసీఆర్ నిర్ణయిస్తే.. ఏపీలో జగన్ విమర్శలు ఎదుర్కొన్నట్టే తెలంగాణలో కూడా కేసీఆర్ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే జగన్ అన్నింటినీ తట్టుకొని నిలబడ్డారు. స్వయంగా ఉపరాష్ట్రపతి విమర్శించినా తగ్గలేదు. కేసీఆర్ కూడా అంత ఓర్పు, నేర్పరితనం ప్రదర్శిస్తే.. తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా మరింతగా రాణించడం ఖాయం.

ఇక కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా జగన్ కు కలిసొచ్చే అంశం. ఎందుకంటే, ప్రస్తుతం పెద్దగా చర్చకు రానప్పటికీ.. వచ్చే విద్యాసంవత్సరం నాటికి మరోసారి ప్రతిపక్షాలు ఇంగ్లిష్ మీడియం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇంగ్లిష్ మీడియంకు మద్దతు తెలపడం.. ఏపీ సర్కార్ కు అప్పుడు కలిసొచ్చే అంశంగా మారుతుంది.

పరిశ్రమ పరువు తీసేది కాదు, పరువు పెంచేది ఈ సినిమా