మారుతీరావు మృతి: గుర్తుచేసుకుందాం!

అమృత వాళ్ల నాన్న కూడా చచ్చిపోయాడు… Advertisement చంపేంత ద్వేషమే కాదు.. చచ్చిపోయేంత వేదన కూడా అతనిలో ఉంది.. వేదనా భయమా చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో ప్రణయ్ హత్యోదంతం జరిగిన సందర్భంలో గ్రేటాంధ్ర…

అమృత వాళ్ల నాన్న కూడా చచ్చిపోయాడు…

చంపేంత ద్వేషమే కాదు..

చచ్చిపోయేంత వేదన కూడా అతనిలో ఉంది..

వేదనా భయమా చర్చలు జరుగుతున్నాయి.

ఈ సందర్భంలో ప్రణయ్ హత్యోదంతం జరిగిన సందర్భంలో గ్రేటాంధ్ర వారపత్రిక ఓ కవర్ స్టోరీ అందించింది. ఆ స్టోరీ  పాఠకుల కోసం మరోసారి…

అమ్మలూ.. బాబులూ… కళ్లు తెరవాలి!

జీవితం అంటే ఏమిటి?
భార్య-భర్త కలిసి బతకడం. మహా అయితే పిల్లలు. తమ బాధానందాలన్నింటినీ కలసి పంచుకోవడం మాత్రమేనా జీవితం అంటే! జీవితం అనే వ్యవహారంలోకి మరెవ్వరి ప్రమేయమూ ఉండదా? కేవలం దంపతులు మాత్రమే అనుభవించేది జీవితం కాబోదని, తమ పిల్లలతో కలిసి పంచుకోవాల్సిందేనని చెప్పే స్పృహ అందరికీ ఉంటోంది. కానీ, తాము పిల్లలతో పంచుకునేదే జీవితం అనుకుంటూ… తాము పిల్లలుగా తమతో జీవితాన్ని పంచుకున్న పెద్దలను… తమ జీవితానికి బయటి వ్యక్తులుగా చూడడం అనేది ఎలాంటి దృక్పథం!
‘మంచి-చెడు రాశులు పోసినట్లుగా వేర్వేరుగా ఉండవు’. ఇది సార్వజనీనమైన, సార్వకాలీనమైన సిద్ధాంతం. అవసరాన్ని బట్టి మంచితనం- అవకాశాన్ని బట్టి చెడ్డతనం ప్రతి మనిషిలోనూ బయటకు వస్తుంటాయనేది అనుభవం నేర్పే పాఠం. పరిస్థితులను బట్టి, ప్రేరేపణలను బట్టి కూడా చెడ్డతనం పురుడుపోసుకుంటుందని ఈ పాఠాన్ని సవరించుకోవాలి.

ఈ సిద్ధాంతం లాగానే…
ప్రేమ-ద్వేషం అనేవి వేర్వేరుగా ఉండవు. అవసరాన్ని బట్టి ప్రేమ… అవసరం తీరగానే (అవసరం లేదనిపించాక) ద్వేషం అసంకల్పితంగానే రేగుతుంటాయా? ఇది మానవ సంబంధాల్లో నవీన సిద్ధాంతంగా రూపుదిద్దుకోనుందా? ఏమో… ప్రణయ్- అమృత, మాధవి-సందీప్ తదితర ఘటనలను చూస్తోంటే… అలాంటి భయం కలుగుతోంది.
మానవసంబంధాల్లో పొడసూపుతున్న విపరిణామాలపై గ్రేటాంధ్ర విశ్లేషణాత్మక కథనం.

==

కొందరు ప్రేమ ముసుగు వేసుకుంటారు…
తతిమ్మా ప్రపంచం ఏమైపోతున్నదో వారికి అనవసరం. తమ ప్రేమ అచంచలమైనది… తమ ప్రేమ అనిర్వచనీయమైనది.. దానిని గుర్తించని, గౌరవించని, ఆదరించని ప్రతి ఒక్కరూ వారికి విద్రోహులే. తమ ప్రేమతో జోక్యం చేసుకోవద్దంటూ… వారికి దూరం ఉండిపోతారు!

కొందరు పరువు ముసుగు వేసుకుంటారు…

తతిమ్మా ప్రపంచం ఏమనుకుంటున్నదో వారికి అనవసరం. తమ పరువు తాము నిర్వచించినట్లే ఉంటుందని, అందులో పట్టు విడుపులు ఉండవని, ఏ మానవ సంబంధాలూ తమ పరువు ముందు బలాదూర్ అని.. అలాంటి ‘పరువు’ అనే పదార్థాన్ని కాపాడుకోవడానికి తాము ఎంతకైనా తెగించగలమని వారు తరచూ నిరూపించుకుంటూ ఉంటారు.

ఇంతేనా ప్రపచంలో ప్రేమ, పరువు లాంటివి మాత్రమే ఉన్నాయా? మానవ సంబంధాలు అనేవి అసలు వీరి ఊసుకైనా కనిపించవా? ప్రేమ, పరువు మాత్రమే కదా.. ఇలాంటి అనేక రకాల ముసుగుల్లో మనుషులు తమను తాము దాచేసుకుని, తమను తాము సంకుచితత్వపు గోతుల్లోకి పాతేసుకుని.. తాము ఎరిగిన ప్రపంచాని కంటె.. ఆవలి ఒడ్డు ఒకటి ఉంటుందని.. తాము ఎరిగిన సత్యం కంటె మించిన పరమ సత్యం మరొకటి ఉండగలదని తెలుసుకోకుండా జీవితాలను వెళ్లదీసేస్తుంటారు. అన్ని రకాల అభిజాత్యాలూ, భావోద్వేగాలు, ఈర్ష్యాసూయలు, దురహంకారాలూ అన్నింటినీ మించినవి కూడా ఉంటాయని వారు ఎందుకు తెలుసుకోరు. మానవ సంబంధాల ముందు ఇవన్నీ, ఇలాంటివి మరెన్నో కూడా దిగదుడుపే అని వారెందుకు తెలుసుకోరు?

ఎవరి మీదా నిందలు వద్దు…

అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్నకూతురు తన మాట కాదని, ఆమె యావత్ జీవితాన్ని మరో వ్యక్తితో పంచుకోవడానికి సిద్ధమైపోయిందని అర్థమైనప్పుడు తల్లిదండ్రుల్లో ఎవరికైనా కించిత్ బాధ కలుగడం సహజం. వారు దానిని జీర్ణించుకోవడం కష్టం. తమ జీవితంలో ఇష్టాయిష్టాలను తాము స్వయంగా తెలుసుకోలుగుతున్నాం అనుకున్న తర్వాత, తమ జీవితం గురించి తమకు స్పృహ ఏర్పడిందనే అభిప్రాయం కలిగిన తర్వాత… తమ జీవితాన్ని పంచుకోవడానికి ఒక వ్యక్తి సరైన జోడీగా నిర్ణయానికి వచ్చిన తర్వాత.. దానిని పెద్దలు వ్యతిరేకించడం అనేది తమ స్వేచ్ఛను హరించే పెద్దల దురహంకారంగా ప్రతి ప్రేమికులకూ అనిపించడం కూడా అంతే సహజం. అందుకే వారు ధిక్కరిస్తారు.. కన్న తల్లిదండ్రులను కాదనుకుంటారు.

తల్లిదండ్రులతో విభేదించి.. పిల్లలు స్వతంత్రించి పెళ్లి చేసుకున్న సందర్భాలు మాత్రం మిగిలిన ప్రపంచం దృష్టికి వస్తుంటాయి. వారు పోలీసు స్టేషన్లలోనో, ఆర్యసమాజాల్లోనో పెళ్లి చేసుకుంటారు గనుక.. అవి వార్తలుగా పత్రికలకెక్కి.. నలుగురికీ కనిపిస్తాయి. కానీ సమాజం మొత్తం కులమతాలు- కట్టుబాట్లు- పరువు అనే చట్రంలోనే ఇరుక్కుపోయి ఉన్నదా? దురహంకారపు సంకెళ్లలో బందీ అయిపోయి ఉన్నదా? అంటే తటాల్న సమాధానం చెప్పలేం. ఎందుకంటే.. ఈ సమాజంలో పెద్దలను ధిక్కరించి తమంతగా చేసుకునే పెళ్లిళ్లు వార్తల ద్వారా మనకెన్ని తెలుస్తున్నాయో.. అంతకు అనేక రెట్లు ఎక్కువగా పెద్దలు ఆమోదించిన ప్రేమ పెళ్లిళ్లు.. కులమతాలతో నిమిత్తం లేకుండానే జరుగుతూనే ఉన్నాయి.

అలాంటి పరిస్థితుల్లో.. పెద్దలందరూ దుర్మార్గులు… పిల్లల ప్రేమను ఒప్పుకోరు అనిగానీ.. పిల్లలందరూ ఆలోచనారహితులు… పెద్దల సూచనను పట్టించుకోరు అనిగానీ ఏకపక్షంగా నిందలు వేయడం అనవసరం. లోపాలు కొందరిలో ఉంటున్నాయి.. దానికి సమాజం నిందార్హం కాదు.

పసితనం ప్రేమ విషబీజం కాదా…

ఆలోచనల్లో పరిపక్వత వచ్చినప్పుడు జీవితాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని సమర్థించవచ్చు. కానీ ఆలోచనల్లో పరిపక్వత అని ఎప్పుడు వస్తుంది. పరిపక్వత అంటే ఒక పంట లేదా పండు పక్వానికి రావడం కాదు.  ఖచ్చితంగా ఇన్ని రోజుల తర్వాత.. పంట చేతికి అంది వస్తుందని అన్నట్లుగా.. ఇంత కాలం తర్వాత.. పరిపక్వత వచ్చేస్తుందని చెప్పడానికి! కౌమారం దాటకుండానే.. కుటుంబం బరువు బాధ్యతలు మొత్తం మోయడం ప్రారంభించే వారిని, అరవయ్యేళ్ల వార్ధక్యానికి చేరువ అయినా.. బాధ్యతలు పట్టకుండా తిరిగే వారిని చూసినప్పుడు పరిపక్వతకు నిర్దిష్ట కాలావధి లేదని అనిపిస్తుంది.

అయితే హైస్కూల్లో ప్రేమ చిగురించడం అనేది… జీర్ణం చేసుకోవడానికి కొంత ఓర్పు అవసరం అనిపిస్తుంది. అంతకంటె దురదృష్టం ఏమిటంటే.. హైస్కూల్లోనే గర్భవతులు అయిపోతున్న బిడ్డలు కూడా అనేకులు మనకు తారసపడుతుంటారు.

పసితనంలో ప్రేమ – అనేది వ్యక్తి జీవితాల్లో విషబీజం అవుతుంది కదా అనే భయం కలుగుతుంటుంది. ఏ పాఠం ఎంత శ్రద్ధతో చదివితే పరీక్షల్లో ఎలా గట్టెక్కవచ్చో, ఎన్ని మార్కులు సాధించవచ్చో కూడా అర్థంకాని నవయసులో… ఏకంగా జీవిత భాగస్వామిని ఎంచుకోవడం అనేది ఖచ్చితంగా తప్పే. కానీ… ప్రేమలో ఉన్నప్పుడు ఇలాంటి తప్పొప్పులు తెలియవు. కానీ వాటి విపరిణామాలకు మాత్రం ఒక అమృత, ఒక మాధవి బాధితులు అవుతుంటారు.

ఒక అమృత, ఒక మాధవి…

కేవలం కొన్ని రోజుల వ్యవధిలో చోటుచేసుకున్న రెండు దుర్ఘటనలు ఇప్పుడు సభ్యసమాజాన్ని కుదిపేస్తున్నాయి. మిర్యాలగూడకు చెందిన అమృత- ప్రణయ్ ను తొమ్మిదో తరగతినుంచి ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలాగే హైదరాబాదు నగరంలోని మాధవి, సందీప్ ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. ఈ రెండు జంటలూ ‘చట్టబద్ధంగా’ తాము స్వతంత్రించి.. పెళ్లికి సంబంధించిన నిర్ణయం తాము తీసుకునే వయసు వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకున్నారు.

ఆ తర్వాతి పరిణామాలు… అనూహ్యంగానే జరిగిపోయాయి. అమృత తండ్రి మారుతీరావు.. సాధారణ కూలీగా జీవితం ప్రారంభించి, రియల్ ఎస్టేట్ లో గౌరవ ప్రదమైన స్థాయికి ఎదిగానంటూ చెప్పుకున్నాడు. ఆయన ఇప్పుడు కటకటాల్లో ఉన్నాడు. ఆయన చేసిన పనికి సభ్యసమాజం మొత్తం ఆయనను ఛీత్కరించుకుంటోంది. ఎందుకంటే.. ఆయన చేయించిన హత్య, కూతురు మరొక వ్యక్తి పట్ల చూపించిన  ప్రేమను ద్వేషించిన ఆయన తీరు హేయమైనవి. అందుకు ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు.

మాధవి ఉదంతం కూడా పెద్దగా భిన్నమైనది కాదు. ఆమె తండ్రి మనోహరాచారి.. మారుతీరావు స్థాయిలో అపర కుబేరుడు కూడా కాదు. అందుకే బహుశా కిరాయికి మాట్లాడుకుని హత్య చేయించలేక.. తానే స్వయంగా దొంగిలించిన కత్తితో ఆ పనిచేయడానికి పూనుకున్నాడు. ఈ రెండు ఘటనలు సమాజం నిర్ఘాంత పోయేలా చేశాయి.

ఈ దుర్ఘటనల మాటన మసకబారిపోయిన ఘటనలు అనేకం ఉండే ఉంటాయి. ఒకచోట ఒక ప్రేమికుల జంట ఆత్మహత్య చేసుకుంది… బహుశా తాము పెళ్లి చేసుకున్నా కూడా ఇలాంటి పర్యవసానాలు తప్పవని ఆ పసి మనసులు భయపడిపోయి ఉండవచ్చు. అలాగే రెండో పార్శ్వంలో బిడ్డలు స్వతంత్ర నిర్ణయాలు, ప్రేమ పెళ్లిళ్లు నచ్చని ఎందరు తండ్రులు కొత్త కత్తులు నూరుతున్నారో ఇప్పుడే అంచనా వేయడం కష్టం.

ఇలాంటి పరిణామాలు కనిపించినప్పుడెల్లా… మానవ సంబంధాలు లుప్తమైపోతున్నాయనే బాధే ప్రధానంగా కలుగుతుంది. ఎవ్వరికీ ఆ ధ్యాస పట్టకపోవడం కూడా బాధ అనిపిస్తుంది. అసలు అనుబంధాలు అనే దానికి అర్థం లేకుండా పోతున్నది. ఎలాంటి ఈగోలు పిల్లలను, యువతీయువకులను పెద్దలను నడిపిస్తున్నాయో… ఎలాంటి పంతాలు పట్టుదలలు వారి జీవితాల్లో ఉండదగిన అసలైన మధురిమను నాశనం చేసేస్తున్నాయో అర్థం కావడం లేదు.

విస్మృత వాస్తవాలు పరిశీలించాల్సిందే…

ఈ రెండు ఘటనలూ మనందరి దృష్టిని అటువైపు మళ్లించడంలో కీలకం. ఇప్పుడు పెద్దలు- పిల్లలు అందరూ ఈ రెండు ఘటనల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే ఈ రెండు ఉదంతాల గురించి పుంఖానుపుంఖాలుగా కథనాలు మీడియాలో వచ్చాయి. కొన్ని విస్మృత అంశాలను కూడా గమనించాల్సి ఉంది. రెండు వ్యవహారాల్లోనూ కులం అంశం ఉంది. పెద్దకులాలకు చెందిన అమ్మాయిలు, తక్కువ కులాలకు చెందిన అబ్బాయిలను ప్రేమించారు. వారి ప్రేమను, తండ్రులు ద్వేషించడానికి కారణం.. పూర్తిగా వారి కులం మాత్రమే అనే ప్రచారం ఇప్పుడు బాగా జరుగుతోంది. కులం ఒక కారణం కావడంలో సందేహం లేదు. కానీ, కేవలం కులం ఒక్కటే కారణం అంటే సబబుగా తోచదు.

అమృత- ప్రణయ్ ల విషయానికి వస్తే..  వారి పెళ్లి తర్వాత.. అమృత నిత్యం తన తల్లిదండ్రులతో టచ్ లోనే ఉన్నట్లుగా ఆమె మాటలను బట్టే తెలుస్తోంది. వారు, ఆమె ప్రేమ పెళ్లిని వ్యతిరేకించారు. అంతే తప్ప ఆమెను వెలివేయలేదు. ఇంతకాలమూ ఆమెతో సంభాషిస్తూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో.. అమృత- ప్రణయ్ లు ఒక వీడియో సాంగ్ ను రూపొందించుకున్నారు. ఇవాళ్టి రోజుల్లో ప్రతి నవదంపతులూ తమ అన్యోన్యతను సృజనాత్మక రూపాల్లో నలుగురికీ చాటాలని అనుకోవడం వింత కాదు. ప్రతి పెళ్లికీ అలాంటి వీడియోలు తయారవుతున్నాయి. ‘ఇంకా ఇంకా ఇంకేం కావాలే..’ అనే సినిమా పాటకు వీరిద్దరి అభినయాలను జోడించి ఆ పాటను రూపొందించుకున్నారు. అంత వరకు బాగుంది. ఆ తర్వాత.. వారి స్వస్థలం అయిన మిర్యాల గూడలోనే.. ఇటీవల ఓ భారీ రిసెప్షన్ ను ఏర్పాటుచేశారు. ప్రణయ్ తరఫు నుంచి ఒక ఫ్లాట్ అమ్మి మరీ .. ఈ వివాహ రిసెప్షన్ ను ఏర్పాటుచేసినట్లుగా వార్తలు వచ్చాయి. చాలా భారీస్థాయిలో చేసుకున్నారు. అయితే ఆ కార్యక్రమానికి తమ హితులు కాకపోయినప్పటికీ, కాదని తెలిసినప్పటికీ.. పట్టణంలోని మారుతీరావు (అమృత తండ్రి) సామాజిక వర్గానికి చెందిన వారందరికీ తమ వీడియో సాంగ్ తో సహా ఆహ్వానాలు పంపారు.

మిర్యాల గూడ అనేది చిన్న ఊరు. తండ్రి పరిచయస్తులు, బంధుగణాలలో వేల మందికి ఇలా వాట్సప్ ఆహ్వానాలు పంపడం అనేది.. అచ్చంగా తన చేతగాని తనాన్ని గేలిచేయడమే అని మారుతీరావు భావించాడు. ఆయనలోని చెడ్డతనం మేల్కొంది. అది ప్రణయ్ హత్యకు దారితీసింది. ఆ రిసెప్షన్, బంధువర్గానికి ఆహ్వానాలు వంటి పరిణామాలు లేకపోయినా.. బహుశా భవిష్యత్తు ఇంకో రకంగా ఉండేదేమో. కొన్ని వందల వేల కుటుంబాల్లో జరిగినట్లుగా  కొన్నాళ్లకు తల్లిదండ్రులు వారిని ఆమోదించి ఉండేవారేమో తెలియదు.

మాధవి-సందీప్ విషయంలో మరో కోణం చూడాలి. అమ్మాయి తండ్రి మనోహరాచారి దాడిచేశాడు. తక్షణం మాధవిని వదిలేసి పారిపోయిన కుర్రాడిలోని ప్రేమలోతు గురించి ఏం అనుకోవాలి? ఎలాంటి ప్రేమను నమ్ముకుని ఆ అమ్మాయి తన జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపడిందనుకోవాలి? ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన విషయాలు.

ఇలా చేసి ఉండాల్సిందా?

అమృత- ప్రణయ్ ల ప్రేమ వ్యవహారంలో మరికొన్ని కోణాలు ఉన్నాయి. ఇవాళ తన జీవితంగా ఎంచుకున్న ప్రణయ్ కడతేరిపోయిన తరువాత.. అమృత ప్రజాసంఘాలు, కులసంఘాలు, హక్కుల సంఘాలతో కలిసి పోరాటం సాగిస్తోంది. ఇదే పోరాటం తన ప్రేమ కోసమే చేసి ఉంటే ఎలా ఉండేది? ఎంత బాగుండేది? ఇలా తన దృక్పథానికి, ప్రేమకు దన్నుగా నిలిచే వారందరి సహకారంతో.. తన ప్రేమను నెగ్గించుకోవడానికి తన తండ్రితోనే పోరాటం చేసి ఉంటే.. ఇవాళ ఆమె జీవితం ఇలాంటి పరిస్థితిలో చిక్కుకునేది కాదు.

ఈ వ్యవహారానికి సంబంధించినా కాకపోయినా… జీవితంలో ఒక స్థిరత్వం చేరుకున్న తరువాత.. యువతీ యువకులు తమ ప్రేమ కలలను నెరవేర్చుకోవడంలో వారికి ఎదురవతున్న అభ్యంతరాలు లేవనే చెప్పాలి. సరైన వయసు కూడా లేకుండా, జీవితంలో ఏ రకంగానూ తన సంసారాన్ని తాము నడుపుకోగల ఆర్జన, వెసులుబాటు లేకుండానే.. పెళ్లికి సిద్ధం అవడం కొంత ఆలోచింపజేసే విషయమే.

ప్రణయ్ అమృతలే కాదు.. సమాజంలో ఏ పిల్లలైనా సరే.. ముందుగా తమ జీవితాన్ని తాము తీర్చిదిద్దుకున్న తర్వాత.. ఆ జీవితాన్ని మరొకరితో పంచుకోవడానికి సిద్ధపడితేనే శోభస్కరంగా ఉంటుంది. అంతే తప్ప.. ప్రేమపేరుతో తొందరపడడం, భవిష్యత్ జీవితం గురించి.. సరైన స్పృహ ఆలోచన లేకుండానే గడపడం అనేది విపరిణామాలకు దారితీస్తుంది.

ప్రేమ అంటే ఏంటో తెలియాలి…

హత్యలు, పరువు హత్యలు, కులం హత్యలు.. ఇలా వీటికి రకరకాల పేర్లు పెడుతున్నారు. కానీ ఒక రకంగా ఇవన్నీ ప్రేమ హత్యలే. ఒకరి మీద ప్రేమ ఎక్కువై, మరొక ప్రేమను అర్థం చేసుకోలేక జరుగుతున్న హత్యలు. ఒకరితో ప్రేమ ఎక్కువై… ఒకరి ప్రేమను నిరాదరించడం, తోసిరాజనడం కారణంగా జరుగుతున్న హత్యలు.

‘ప్రేమ’ అంటే అసలేమిటో అటు పిల్లలు- ఇటు పెద్దలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రేమ అంటే యువతీ యువకుల మధ్య ఉండేది మాత్రమే కాదు. అది ఏ ఇద్దరి మధ్యనైనా ఉండగలదు. ఎంత ఎక్కువ మందిలోనైనా, ఎక్కువ మందితో అయినా.. అంతే సమానంగా పరిపూర్ణంగా ఉండగలదు. తల్లిదండ్రులు-పిల్లలు, దంపతులు, సోదరులు, స్నేహితులు అందరి మధ్య ప్రేమే ఉంటుంది. మనలో ప్రేమ ఉంటే.. దానిని ఎంతమందికైనా పంచిపెట్టవచ్చు. ఇంకా బోలెడంత ప్రేమ మన వద్ద పుష్కలంగా ఉంటుంది.

ఒక వేదోక్తి ఉంది…

‘పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే’ అని!

పూర్ణం లోంచి పూర్ణం తీసేస్తే.. ఇంకా పూర్ణం మిగిలి ఉంటుంది.. అని భగవత్ తత్వం గురించి ఈ సూక్తి చెబుతుంది. నిజానికి ఇది చెప్పేది ప్రేమతత్వం గురించే అని తెలుసుకోవాలి. మనలో ఉండే ప్రేమను ఒకరికి నూరుశాతం పంచి పెట్టినతర్వాత కూడా.. మనలో మరో నూరుశాతం ప్రేమ ఉంటుంది.

అదే ప్రేమ అంటే.

ఆ సంగతి అర్థం చేసుకుంటే ఇక ప్రపంచంలో ఇలాంటి హత్యలు ఉండవు.

అనుబంధాలు వాటి అసలైన సౌందర్యంతో పరిఢవిల్లుతాయి.

… కె.ఎ. మునిసురేష్ పిళ్లె