జగన్-పవన్-భాజపాలకు మజ్లిస్ తోడయిందని అంటున్నారు ఆంధ్ర మంత్రి యనమల రామకృష్ణుడు. తెలంగాణ ఫలితం తేడా వచ్చింది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే, ఈపాటి ఆంధ్రలో కూడా మహాకూటమి అని ప్రకటనలు వచ్చి వుండేవి. కమ్యూనిస్టులు, లోక్ సత్తా, కాంగ్రెస్, తేదేపా, కుదిరితే జనసేన, జెడి లక్ష్మీనారాయణ లను కూడా కలిపేసుకుని, కేసిఆర్ మీదకు దండెత్తినట్లు జగన్ పైకి దండెత్తి వుండేవారు. కాదని అనగలరా? యనమల?
2014లో ఒంటరిగా పోరాడింది ఎవరు? భాజపాను తోడు తీసుకున్నది ఎవరు? కేంధ్రంలో భాజపాకు వ్యతిరేకంగా కూటమి తయారుచేస్తున్నది ఎవరు? యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్ కు ఇవన్నీ తెలియవని అనుకోవాలా? లేదా ఇలా కూటమిలు కట్టేందుకు వరల్డ్ వైడ్ పేటెంట్ హక్కు బాబుగారే తీసుకున్నారని అనుకోవాలా?
రాజకీయం, ఎన్నికలు, యుద్ధం అన్నాక ఎవరి బలాలు వారు సమీకరించుకుంటారు. కురుక్షేత్ర కాలంలోనే దుర్యోధనుడి కూటమి, ధర్మరాజు కూటమి అంటూ యావత్ భారతదేశ రాజులు విడిపోయారు. కానీ బాబుగారు అండ్ కో వైఖరి ఎలా వుందంటే, తాము కడితే కూటమి, ఎదుటివాళ్లు కడితే కుమ్మక్కు అన్నట్లు వుంది.
పైగా యనమల మరో గమ్మత్తు అయిన మాట అన్నారు. భాజపాతో జగన్ వుంటే, మజ్లిస్ ఎలా మద్దతు ఇస్తుందని? అసలు భాజపాతో జగన్ వున్నారని, ఆ ఇరు వర్గాల్లో ఎవరు కన్ ఫర్మ్ చేసారు? మరి ఇప్పుడు కాంగ్రెస్ తో బాబు గారు వున్నారన్నది కన్ ఫర్మ్. మరి భాజపాను మెచ్చే హిందూత్వ వాదులు అంతా బాబుగారికి దూరం అయిపోవాలని యనమల గారు పరోక్షంగా సెలవిస్తున్నారని అనుకోవాలా?
అలాగే పవన్ కు జగన్ కు లింక్ పెట్టారు కాబట్టి, దాన్ని నమ్మి కాపులు అంతా తేదేపాను వదిలేయాలా? ఆ విషయం కూడా యనమల క్లారిటీ ఇస్తే బెటరేమో? ఏమైనా తెలుగుదేశం జనాల బతుకులు నిత్యం జగన్ కు సంబంధాలు అంటగట్టడానికే వున్నట్లు కనిపిస్తోంది.
జగన్, పవన్ కలిసి పనిచేసినా మాకు ఓకే
త్వరలో ఎన్నికలు.. కాంగ్రెస్ తో పొత్తూ వికటించింది.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్