అక్క పెళ్లి ముగిసింది.. చెల్లెలు పెళ్లిపై పుకార్లు

రీసెంట్ గా ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకుంది. అమెరికాకు చెందిన యంగ్ పాప్ సింగర్ నిక్ జోనాస్, ప్రియాంక చోప్రాల వివాహం గ్రాండ్ గా జరిగింది. దాదాపు వారం రోజుల పాటు సోషల్ మీడియాలో…

రీసెంట్ గా ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకుంది. అమెరికాకు చెందిన యంగ్ పాప్ సింగర్ నిక్ జోనాస్, ప్రియాంక చోప్రాల వివాహం గ్రాండ్ గా జరిగింది. దాదాపు వారం రోజుల పాటు సోషల్ మీడియాలో ఈ పెళ్లి హాట్ టాపిక్ గా నిలిచింది. ఇలా ప్రియాంక పెళ్లి తంతు పూర్తయిందో లేదో, ఆమె చెల్లెలు పరిణీతి చోప్రా పెళ్లి వ్యవహారం తెరపైకి వచ్చింది. 

కొంత కాలంగా బాలీవుడ్ కు చెందిన చరిత్ దేశాయ్ తో పరిణీతి చోప్రా క్లోజ్ గా ఉంటోంది. ధర్మ ప్రొడక్షన్స్ లో పనిచేస్తున్న చరిత్ దేశాయ్, పరిణీతి ఎఫైర్ గురించి బాలీవుడ్ లో చాలామందికి తెలుసు. ప్రియాంక చోప్రా పెళ్లికి కూడా పరిణీతి తరఫున ప్రత్యేకంగా హాజరయ్యాడు చరిత్. 

అలా అక్కపెళ్లిలో పరిణీతి-చరిత్ బాగానే సందడి చేశారు. దీంతో పరిణీతి లవ్ లైఫ్ పై మరోసారి పుకార్లు గుప్పుమన్నాయి. అక్క పెళ్లయిపోవడంతో చెల్లెలికి లైన్ క్లియర్ అయిందని.. త్వరలోనే వీళ్లిద్దరు కూడా పెళ్లిపీటలు ఎక్కడం గ్యారెంటీ అంటూ కథనాలు పుట్టుకొచ్చాయి.

పుకార్లను ఎంజాయ్ చేయడం బాలీవుడ్ హీరోహీరోయిన్లకు చాలా ఇష్టం. వాటిని అలానే వదిలేస్తుంటారు. లేదంటే ఇంకాస్త ఆజ్యం పోస్తుంటారు. కానీ పరిణీతి మాత్రం ఈ పుకారుపై వెంటనే రియాక్ట్ అయింది. తన పెళ్లిపై వస్తున్న పుకార్లలో నిజం లేదని, అవి పూర్తిగా నిరాధారమైనవంటూ కొట్టిపారేసింది ఈ బ్యూటీ. ఒకవేళ తను పెళ్లి చేసుకుంటే ఆ విషయాన్ని హ్యాపీగా అందరితో షేర్ చేసుకుంటానంటూ ట్వీట్ చేసింది.