టీడీపీలో ఉన్నంతవరకూ తమ్ముడే, బయటకు వస్తే ఇక కుమ్ముడే అంటున్నాడు మాజీ పసుపు నేత. ఆయన చంద్రబాబును గట్టిగానే టార్గెట్ చేస్తున్నాడు. పాతికేళ్ళకు పైగా టీడీపీలో ఉన్న అనుభవంతో పచ్చ పార్టీ ఆనుపానులన్నీ తెలుసు. గుట్లుమట్లు కూడా తెలుసు. అందుకే జగన్ జోలికివస్తే మీ జాతకాలు మొత్తం బయటపెడతానంటూ ఏకంగా చంద్రబాబునే హెచ్చరిస్తున్నాడు.
మాజీ ఎమ్మెల్యే, ఉత్తరాంధ్రా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ ఎ రహమాన్ బాబును గట్టిగానే తగులుకున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా మంచి పాలన అందిస్తూంటే సహించలేక కుళ్ళుతో తప్పుడు ఆరోపణలు బాబు ఆయన గ్యాంగ్ చేస్తున్నారని మండిపడ్డారు.
జే టాక్స్ అంటూ ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్న టీడీపీ పెద్దలు వాటిని నిరూపించగలరా అంటూ నిలదీశారు. ఏపీలో మధ్యపాన నిషేధాన్ని దశలవారీగా జగన్ అమలుచేస్తున్నారని కొనియాడారు. ఎన్టీయార్ కి అచ్చమైన వారసుడు అంటూ జగన్ అని కితాబు ఇచ్చారు.
ఆనాడు ఎన్టీయార్ సంపూర్ణ మద్యనిషేధం అమలుచేస్తే ఆయన్ని గద్దె దించేసి మధ్య నిషేధానికి తూట్లు పొడిచిన పెద్ద మనిషి బాబు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. నాడు లిక్కర్ సిండికేట్ నుంచి ఆరు వందల కోట్లు ముడుపులు తీసుకున్నారని అప్పటి కాంగ్రెస్ నేత మైసూరారెడ్డి ఆరోపించిన సంగతి నిజం కాదా అని ప్రశించారు.
ఇక ఏపీలో మద్యాన్ని ప్రవహింపచేయడమే కాకుండా బాబు అయిదేళ్ళ పాలనలో పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్న సంగతి తనకు తెలుసు అని ఆ జాతకాలు విప్పి చెప్పమంటారా అంటూ బాబుకు డిమాండ్ చేసారు. బాబు సీఎంగా కొన్ని బ్రేవరేజిలకే అనుమతులు ఇచ్చింది నిజం కాదా అని రహమన్ సవాల్ చేశారు.
జగన్ని జే టాక్స్ అంటూ విమర్శలు చేస్తే గత సర్కార్ లో మద్యం పేరిట బాబు సహా ఎవరెవరు ఎంతెంత ముడుపులు తీసుకున్నారో బయటపెట్టి అందరి భాగోతాలు జనం ముందు పెడతానని రహమాన్ గట్టి వార్నింగే ఇచ్చారు. ఎంతైనా మాజీ తమ్ముడు కదా. పక్కా ఆధారాలతోనే ఈ ప్రకటన చేశారనుకోవాలి.