ఆ విషయంలో మోదీని మించిపోయిన కేసీఆర్..!

కరోనా కష్టకాలంలో ప్రధాని మోదీ పూర్తిగా చేతులెత్తేశారు. రాష్ట్రాలు వ్యాక్సిన్ కావాలి మహాప్రభో అంటే.. ముందు వ్యాక్సిన్ వృథాని నియంత్రించండి అంటూ.. ముఖ్యమంత్రుల సమావేశం పెట్టి సలహాలిస్తున్నారు.  Advertisement ఆక్సిజన్ కావాలయ్యా అంటే.. బెంగాల్…

కరోనా కష్టకాలంలో ప్రధాని మోదీ పూర్తిగా చేతులెత్తేశారు. రాష్ట్రాలు వ్యాక్సిన్ కావాలి మహాప్రభో అంటే.. ముందు వ్యాక్సిన్ వృథాని నియంత్రించండి అంటూ.. ముఖ్యమంత్రుల సమావేశం పెట్టి సలహాలిస్తున్నారు. 

ఆక్సిజన్ కావాలయ్యా అంటే.. బెంగాల్ లో అల్లర్లు జరుగుతున్నాయంటూ ఆ రాష్ట్ర గవర్నర్ కి లేఖ రాసి ఆవేదన అంతా వెళ్లగక్కుతున్నారు. లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంటే రాష్ట్రాలు ఆర్థిక సాయం అడుగుతాయేమోనని భయపడుతున్నారు. దీంతో మోదీలో ఫోర్స్ లేదని పరోక్షంగా చీవాట్లు పెట్టి మరీ జాతీయ స్థాయిలో ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు.

మోదీకి ఏమాత్రం తీసిపోని కేసీఆర్..

కరోనా కట్టడి విషయంలో మోదీ ఎలాంటి మైండ్ గేమ్ ఆడుతున్నారో.. యాజ్ ఇటీజ్ గేమ్ ను ఫాలో అవుతున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కరోనా విజృంభిస్తున్న దశలో ఆరోగ్య శాఖ మంత్రిని బర్తరఫ్ చేసి, ఆ శాఖ తన దగ్గరే పెట్టుకుని, ఐఏఎస్ లతో పాలన సాగిస్తున్నారు. 

రాష్ట్రంలో లాక్ డౌన్ పెట్టాలంటూ హైకోర్టు సలహా ఇచ్చినా.. పెట్టిన రాష్ట్రాల్లో కేసులు తగ్గాయా అంటూ లాజిక్ తీసి భంగపడ్డారు కేసీఆర్.

పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సొంతగా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటూ ముందు చూపుతో ఉంటే.. కేసీఆర్ మాత్రం ఇంకా తమిళనాడు, కేరళ నుంచి మాకు ట్యాంకర్లు రావట్లేదు… కాస్త ఆ సంగతేంటో చూడండి అంటూ చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు.. ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేస్తున్నారు.

కరోనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి నేరుగా ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ కు వచ్చి వరుస సమీక్షలతో హడావిడి చేస్తున్నారు. ఉచిత రేషన్ బియ్యం అంటూ మరో జిమ్మిక్కు మొదలు పెట్టారు.

ప్రధాని అభినందన మరో డ్రామా..?

అధికారులతో సమీక్ష అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారని, ఆయనకు కొన్ని విలువైన సూచనలు చేశారని, సదరు సూచనలు మోదీకి బాగా నచ్చాయని తెలంగాణ సీఎంఓ ప్రకటన చేయడం ఈ ఎపిసోడ్ కే హైలెట్. 

అంతే కాదు.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ ప్రత్యేకంగా ఫోన్ చేసి కేసీఆర్ ని అభినందించారని, ఆయన చెప్పిన సలహాలు ప్రధానికి బాగా నచ్చాయని, వాటిని అమలులో పెట్టేందుకు ప్రయత్నిస్తామని చెప్పారని అన్నారట. అయితే ఆ సలహాలేంటనేవి మాత్రం బయటపెట్టలేదు. అవేంటో చెబితే, మోదీ అంత కాకపోయినా, ఉన్నంతలో ప్రజలు కూడా కేసీఆర్ ను మెచ్చుకుంటారు కదా.

కరోనా కట్టడిలో కేంద్రం చేతులెత్తేయడంతో ఇటు రాష్ట్రాలు కూడా బేల చూపులు చూస్తున్నాయి. ప్రధాని వ్యవహారం తెలిసినవారు కాస్త ముందు చూపుతో.. రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

లాక్ డౌన్ విషయం అయినా, ఆక్సిజన్ విషయం అయినా.. ఎవరి దారి వారిదే. అయితే కేసీఆర్ మాత్రం ప్రధానికి ఏమాత్రం తీసిపోకుండా అసలు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు మహ బాగా ప్రణాళికలు రచిస్తున్నారు. “కేసీఆర్ సలహాలు-ప్రధాని మెచ్చుకోలు” అనే ఎపిసోడ్ ఇందులో భాగంగానే బయటకొచ్చినట్టు కనిపిస్తోంది.