పొరుగు రాష్ట్రంలో మొదలైన సంపూర్ణ లాక్ డౌన్

పొరుగు రాష్ట్రం తమిళనాట కొద్దిసేపటి కిందట సంపూర్ణ లాక్ డౌన్ మొదలైంది. ఈ మేరకు నిన్నట్నుంచే ఏర్పాట్లలో తలమునకలై ఉన్న అధికార యంత్రాంగం, ఈరోజు పొద్దున్నుంచి సంపూర్ణ లాక్ డౌన్ ను అమల్లోకి తీసుకొచ్చింది. …

పొరుగు రాష్ట్రం తమిళనాట కొద్దిసేపటి కిందట సంపూర్ణ లాక్ డౌన్ మొదలైంది. ఈ మేరకు నిన్నట్నుంచే ఏర్పాట్లలో తలమునకలై ఉన్న అధికార యంత్రాంగం, ఈరోజు పొద్దున్నుంచి సంపూర్ణ లాక్ డౌన్ ను అమల్లోకి తీసుకొచ్చింది. 

ఈరోజు నుంచి 2 వారాల పాటు తమిళనాడు అంతగా పూర్తిస్థాయిలో ఈ లాక్ డౌన్ కొనసాగుతుంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత స్టాలిన్ తీసుకున్న కీలక నిర్ణయం ఇది.

లాక్ డౌన్ విషయాన్ని 2 రోజుల ముందుగానే ప్రకటించడంతో ప్రజలంతా తమ ఏర్పాట్లు తాము చేసుకున్నారు. నిత్యావసరాలు, మందుల్ని ముందుగానే కొనుగోలు చేసుకున్నారు. 2 వారాలకు సరిపడ సరకుల్ని సమకూర్చుకున్నారు. మరోవైపు రోజువారీ కూలీల కోసం ప్రభుత్వం గతేడాదిలోనే ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని, ఈ ఏడాది మరోసారి అమలు చేయబోతున్నారు. ప్రభుత్వం తరఫున కొంతమందికి నిత్యావసరాలు అందించడంతో పాటు.. మరికొంతమందికి నేరుగా భోజనాన్నే సమకూర్చబోతున్నారు.

లాక్ డౌన్ విధిస్తున్న నేపథ్యంలో వలస కార్మికులెవ్వరూ తమ ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే తగిన ఏర్పాట్లు చేస్తుందని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. ఏపీకి వలస కార్మికుల తాకిడి తప్పలేదు. నిన్న, మొన్న వేల సంఖ్యలో కార్మికులు తమ సొంత ఊళ్లకు చేరుకున్నారు. ఏపీలో కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ చాలామంది, తమ ఇళ్లకు చేరుకున్నారు.

గతేడాది తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చిన వలసకార్మికుల వల్లనే ఏపీలో కరోనా కేసులు బాగా పెరిగిపోయాయి. చిత్తూరు, ప్రకాశం, నెల్లురు జిల్లాల్లో గతేడాది కేసులు పెరగడానికి ఇదే ప్రధాన కారణమని అధికారులు అప్పట్లో ప్రకటించారు. ఈసారి కూడా ఆ ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

తమిళనాడుతో పాటు రాజస్థాన్, పాండిచ్చేరి, మిజోరంలో కూడా ఇవాళ్టి నుంచి పూర్తిస్థాయి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. అటు ఢిల్లీలో కొనసాగుతున్న లాక్ డౌన్ ను మరో వారం రోజుల పాటు పొడిగించారు. కేరళ, ఒరిస్సాలో కూడా లాక్ డౌన్ కొనసాగుతోంది. దాదాపు అన్ని ఇతర రాష్ట్రాల్లో కర్ఫ్యూ (పాక్షిక లాక్ డౌన్) కొనసాగుతోంది.