అధికార పార్టీకి ఉన్న సమస్యలు చాలవన్నట్టు కొత్త సమస్య వచ్చి పడింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు కారులో డ్రైవర్ మృతదేహం ప్రత్యక్షమైంది. ఎమ్మెల్సీ వద్ద ఐదేళ్లుగా సుబ్రమణ్యం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. డ్రైవర్‌ను హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండడంతో రాజకీయ వివాదానికి తెరలేచింది.
రంపచోడవరం నేత అనంత సత్య ఉదయభాస్కర్(అనంత బాబు)ను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం గత ఏడాది ఎంపిక చేసింది. స్థానిక సంస్థల్లో వైసీపీకి తిరుగులేని ఆధిక్యత వుండడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. దివంగత జక్కంపూడి రామ్మోహనరావు ముఖ్య అనుచరుడు అనంతబాబు. ఓదార్పు యాత్ర నుంచి వైఎస్ జగన్ వెన్నంటే నడుస్తూ అభిమానం సంపాదించుకున్నాడు. టీడీపీ హయాంలో అతనిపై పలు అక్రమ కేసులు పెట్టారు.
తొమ్మిది రోజులు విశాఖ సెంట్రల్ జైలులో ఉన్నాడు. మేనమామలైన జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు సైతం వైసీపీ నుంచి ఫిరాయించినా అనంతబాబు మాత్రమే పార్టీని వీడలేదు. ఆ విశ్వాసమే అతనికి ఎమ్మెల్సీ పదవి వచ్చేలా చేసింది. ఇప్పుడు అతను చిక్కుల్లో పడ్డాడు. తద్వారా అధికార పార్టీ ఆత్మరక్షణలో పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గురువారం ఉదయం సుబ్రమణ్యాన్ని అనంతబాబు వెంట తీసుకెళ్లినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదానికి గురైనట్టు సుబ్రమణ్యం తమ్ముడుకి ఎమ్మెల్సీ ఉదయ్‌బాబు సమాచారం ఇచ్చాడు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు తన కారులోనే సుబ్రమణ్యం మృతదేహాన్నికాకినాడకు తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించాడు. అనంతరం వేరే కారులో ఎమ్మెల్సీ వెళ్లిపోయాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది ముమ్మాటికీ హత్యే అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నాయి.