రాకెట్ కూలింది.. పెద్ద ప్రమాదం తప్పింది

ప్రపంచం మొత్తాన్ని కలవపెట్టి, నాసాను ముప్పుతిప్పలు పెట్టిన చైనా రాకెట్ లాంగ్ మార్చ్-5బీ ఎట్టకేలకు కుప్పకూలింది. భూభాగంపై కూలుతుందని అంతా భయపడగా.. ఈ రాకెట్ మాత్రం హిందూ మహాసముద్రంలో కూలింది. దీంతో అంతా ఊపిరి…

ప్రపంచం మొత్తాన్ని కలవపెట్టి, నాసాను ముప్పుతిప్పలు పెట్టిన చైనా రాకెట్ లాంగ్ మార్చ్-5బీ ఎట్టకేలకు కుప్పకూలింది. భూభాగంపై కూలుతుందని అంతా భయపడగా.. ఈ రాకెట్ మాత్రం హిందూ మహాసముద్రంలో కూలింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేసే క్రమంలో ఈ భారీ రాకెట్ ను ప్రయోగించింది చైనా. ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ రాకెట్ అదుపుతప్పి, భూ కక్ష్య వైపు దూసుకొచ్చింది. 22 టన్నుల బరువు, 100 అడుగుల సైజులో ఉండే ఈ రాకెట్ జనావాసాల మధ్య పడితే భారీ నష్టం సంభవించి ఉండేది.

అందుకే నాసా అధికారులు ఎలర్ట్ అయ్యారు. చైనా శాస్త్రవేత్తలతో కలిసి కూలిపోతున్న రాకెట్ దిశను, గమ్యాన్ని అంచనా వేసే పనిని పెట్టుకున్నారు. దీనికి సంబంధించి లైవ్ ట్రాకింగ్ కూడా మొదలుపెట్టారు. అయితే రాకెట్ ఉన్నఫలంగా భూమిపై కుప్పకూలదు. భూ వాతావరణంలోకి ప్రవేశించగానే, వేడికి అది కాలిపోతుంది. భారీ శకలాలు మాత్రం భూమిపై పడతాయని అంచనా వేశారు.

అలా పడినా కూడా నష్టం ఆపారమే. ఎందుకంటే, గంటకు 18వేల మైళ్ల వేగంతో భూమిపై దూసుకొస్తాయి ఆ శకలాలు. ఈ శకలాలు తుర్కెమినిస్థాన్ భూభాగంపై పడతాయని యూఎస్ మిలటరీ ముందుగా అంచనా వేసింది. యూరోపియన్ స్పేస్ ఎజెన్సీ మాత్రం దక్షిణ జపాన్, ఇటలీ, గ్రీస్ లో శకలాలు పడతాయని అంచనా వేసింది.

అయితే అందరి అంచనాల్ని వమ్ము చేస్తూ హిందూ మహాసముద్రంలో ఈ రాకెట్ శకలాలు పడ్డాయి. వీటిని నాసా ఉపగ్రహాలు ట్రేస్ చేశాయి. శకలాలు పడిన ప్రాంతం మాల్దీవులకు సమీపంలో ఉంది.