ఇండియాలో పతాక స్థాయికి, ప్రమాదకరమైన స్థాయికి చేరిన సెకెండ్ వేవ్ కరోనా మే నెల ద్వితియార్థం నుంచి తగ్గుముఖం పట్టవచ్చని పలువురు అధ్యయనకర్తలు అంచనా వేస్తూ ఉన్నారు. ఈ విషయంలో సశాస్త్రీయంగా, అందరికీ అర్థమయ్యేలా చెప్పలేకపోయినా.. వైరాలజిస్టులు, వైరస్ ప్రభావం తీరుపై అధ్యయనం జరిపిన వారు ఆ మాట చెబుతున్నారు.
మరోవైపు వివిధ రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటనలు చేశారు. కర్ణాటక, తమిళనాడులు పూర్తి లాక్ డౌన్ లోకి వెళ్లిపోగా.. ఏపీ, తెలంగాణల్లో కూడా పరిమితులున్నాయి. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా లాక్ డౌన్ ప్రకటనలు వస్తున్నాయి. మరి లాక్ డౌన్ తో ఏ మేరకు కేసులు తగ్గుముఖం పడతాయో వేచి చూడాల్సి ఉంది.
ఆ సంగతలా ఉంచితే.. గత వారం డాటాను బట్టి చూస్తే.. కరోనా కేసుల గ్రోత్ రేట్ తగ్గిందని సంఖ్యల ద్వారా తెలుస్తోంది. అంతకు ముందు వారంతో పోలిస్తే గత వారంలో గ్రోత్ రేట్ 20వేల కేసులు అని ప్రభుత్వ అధికారిక గణాంకాలను బట్టి తెలుస్తోంది.
గత వారం రోజుల వ్యవధిలో అంతకు ముందు వారంతో పోలిస్తే అధికంగా పెరిగన కేసుల సంఖ్య 20 వేలట. రోజువారీగా సగటున 3.91 లక్షల కేసులు గత వారం రోజుల్లో పెరిగాయి. ఈ సంఖ్య తగ్గుముఖం పట్టకపోయినా పెరుగదల రేటు తక్కువగా ఉందనేది నంబర్లు చెబుతున్న మాట.
గత వారంలో గ్రోత్ రేట్ 20 వేల కేసులు కాగా, అంతకు ముందు వారం నంబర్లను దానికి ముందు వారం నంబర్లతో పోలిస్తే గ్రోత్ రేట్ 61 వేల కేసులు! ఏప్రిల్ 24 నుంచి మే 1 వరకూ మధ్యన అంతకు ముందు వారంతో పోలిస్తే కేసుల సంఖ్యలో తేడా 61 వేలు. గత వారం విషయానికి వస్తే ఆ గ్రోల్ కేవలం 20 వేలు మాత్రమే.
ఇలా గ్రోత్ రేట్ తగ్గుతోందనేది నంబర్ల ద్వారా తెలుస్తున్న అంశం. ఒక దశలో అంటే ఏప్రిల్ మూడో వారంలో ఇదే గ్రోత్ రేట్ వారానికి లక్ష కేసుల వరకూ ఉండింది. లక్ష, అరవై వేలు, ఇరవై వేలు.. ఇలా వారంలో పెరిగే మొత్తం కేసుల సంఖ్యలో గ్రోత్ రేట్ తగ్గుతుండటం గమనార్హం.
వారం వారం కొత్త కేసుల సంఖ్య మొత్తం పెరుగుతూనే ఉన్నా, ఒక వారంతో పోలిస్తే మరో వారంలో పెరుగుదల రేటు క్రమంగా తగ్గుతూ ఉందనేది ఇక్కడ గమనించాల్సిన అంశం.
ఈ గ్రోత్ మరో వారం రోజుల్లో కూడా తగ్గితే.. సెకెండ్ వేవ్ తగ్గుముఖం పడుతోందని నిర్ధారణకు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.
అంటే గత వారంలో సగటున 3.91 లక్షల కేసులు నమోదు కాగా, వచ్చే వారంలో ఈ సగటు ఇదే స్థాయిలో కొనసాగినా, లేక తగ్గినా సెకెండ్ వేవ్ నెమ్మదించడం ప్రారంభం అయినట్టే అని నంబర్లను బట్టి తెలుసుకోవచ్చు.