నాగబాబు చేయాల్సిన సినిమా గ్యాంగ్ లీడర్ అయింది

గ్యాంగ్ లీడర్.. ఇండస్ట్రీ హిట్ సినిమా. చిరంజీవి నంబర్ వన్ సింహాసనాన్ని అధిష్టించడానికి పునాది వేసిన సినిమా. ఈ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ విజయాలందుకున్నారు చిరంజీవి. నంబర్ వన్ హీరోగా స్థిరపడిపోయారు. …

గ్యాంగ్ లీడర్.. ఇండస్ట్రీ హిట్ సినిమా. చిరంజీవి నంబర్ వన్ సింహాసనాన్ని అధిష్టించడానికి పునాది వేసిన సినిమా. ఈ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ విజయాలందుకున్నారు చిరంజీవి. నంబర్ వన్ హీరోగా స్థిరపడిపోయారు. 

అలా చిరంజీవి కెరీర్ లో ప్రత్యేక స్థానం దక్కించుకున్న సినిమాగా నిలిచింది గ్యాంగ్ లీడర్. ఈ సినిమా కార్యరూపం దాల్చడం వెనక నిజంగానే ఓ పెద్ద సినిమా నడిచింది.

జగదేకవీరుడు-అతిలోక సుందరి తర్వాత వరుసగా 2 ఫ్లాపులు రావడంతో చిరంజీవి ఆలోచనలో పడ్డారు. ఈసారి విజయ బాపినీడుతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే విజయ బాపినీడు ఆలోచన మరోలా ఉంది. నాగబాబుతో ఆయన ఓ సినిమా ప్లాన్ చేశారు. దానికి ''అరె ఓ సాంబ'' అనే టైటిల్ కూడా అనుకున్నారు.

అంతలోనే చిరంజీవి నుంచి పిలుపురావడంతో విజయ బాపినీడు ప్లాన్ మార్చారు. నాగబాబుతో చేయాలనుకున్న ఫ్యామిలీ డ్రామాకే యాక్షన్ జోడించారు. ఎంవీవీఎస్ బాబూరావు, పరుచూరి బ్రదర్స్ సహకారంతో గ్యాంగ్ లీడర్ స్టోరీని సిద్ధం చేశారు. అలా నాగబాబు కోసం రాసుకున్న కథ, వివిధ మార్పులకు లోనై చిరంజీవి కోసం గ్యాంగ్ లీడర్ గా మారింది.

ఈ సినిమా టైటిల్ వెనక కూడా చిన్న కథ ఉంది. కథకు మంచి మాస్ టైటిల్ కోసం వెదుకుతున్నారు. అప్పటికే పరుచూరి బ్రదర్స్ 3 టైటిల్స్ వినిపించారు. మూడూ మాస్ టైటిల్సే. కానీ ఎందుకో బాపినీడుకు నచ్చలేదు. అదే టైమ్ లో సినీ రచయిత సత్యమూర్తి (దేవిశ్రీప్రసాద్ తండ్రి) గ్యాంగ్ లీడర్ అనే సీరియల్ రాస్తున్నారు. 

ఆ టైటిల్ బాపినీడుకు నచ్చి, సత్యమూర్తి అనుమతితో టైటిల్ తీసుకున్నారు. అయితే అది నెగెటివ్ టైటిల్ అవుతుందేమోనని చిరంజీవి భయపడ్డారు. అయినప్పటికీ చిరంజీవిని ఒప్పించి అదే టైటిల్ తో సినిమాను రిలీజ్ చేశారు.

రిలీజైన తర్వాత గ్యాంగ్ లీడర్ సృష్టించిన ప్రభంజనం గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా రిలీజై ఇవాళ్టికి 30 ఏళ్లు అవుతోంది.