చేతిలో రిపోర్ట్ లేకపోయినా వైద్యం చేయాల్సిందే

కరోనా విజృంభణతో దేశం అల్లకల్లోలం అవుతున్న వేళ.. కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఇన్-పేషెంట్ విధివిధానాల్లో కీలక మార్పు చేసింది. అదేంటంటే.. ఇకపై కరోనా పాజిటివ్ రిపోర్ట్ లేకపోయినా సదరు పేషెంట్…

కరోనా విజృంభణతో దేశం అల్లకల్లోలం అవుతున్న వేళ.. కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఇన్-పేషెంట్ విధివిధానాల్లో కీలక మార్పు చేసింది. అదేంటంటే.. ఇకపై కరోనా పాజిటివ్ రిపోర్ట్ లేకపోయినా సదరు పేషెంట్ ను హాస్పిటల్ లో జాయిన్ చేసుకోవాలి. లక్షణాలకు అనుగుణంగా చికిత్స అందించాలి.

ప్రస్తుతం టెస్ట్ చేయించుకొని, పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే రోగుల్ని హాస్పిటల్స్ లో జాయిన్ చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఇదే విధానం అమల్లో ఉంది. అయితే రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసుల వల్ల టెస్టుల రిజల్ట్ రావడం ఆలస్యమౌతోంది. 

మరోవైపు కరోనా టెస్టులు చేయించుకోకపోతే తీవ్ర లక్షణాలతో బాధపడుతూ హాస్పిటల్స్ కు వచ్చే వారి సంఖ్య కూడా పెరిగింది. ఇలాంటి వాళ్లందర్నీ డాక్టర్లు వెనక్కి పంపిచేస్తున్నారు. టెస్టు చేయించుకొని రమ్మని చెబుతున్నారు.

ఇకపై ఇలా చెప్పడానికి వీల్లేదు. అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిథిలో ఉన్న హాస్పిటల్స్ లో కరోనా లక్షణాలతో వచ్చిన రోగుల్ని చేర్చుకోవాలని కేంద్రం సూచించింది. కరోనా పరీక్షలు చేయించుకున్నా, చేయించుకోకపోయినా.. లక్షణాలకు తగ్గట్టు తక్షణం చికిత్స ప్రారంభించాలని సూచించింది.

ఈ సందర్భంగా మరో కీలక సూచన కూడా చేసింది కేంద్రం. తమ ప్రాంతం కాదనే సాకుతో రోగులకు ట్రీట్ మెంట్ నిరాకరించరాదని.. ఏ ప్రాంతానికి చెందిన వారినైనా చేర్చుకొని చికిత్స అందించాలని సూచించింది. ఇతర ప్రాంతాలకు చెందిన రోగులకు కూడా ఆక్సిజన్, ఔషధాలు అందించాలని ఆదేశించింది.

అంతేకాదు.. ఏ ఒక్క కారణంతో పేషెంట్ ను వెనక్కి పంపించకూడదు. చివరికి సరైన గుర్తింపు కార్డు లేదా ధృవీకరణ పత్రం లేకపోయినా హాస్పిటల్ లో చేర్పించుకొని చికిత్స అందించాలని సూచించింది. అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు 3 రోజుల్లోగా సవరించిన నిబంధనలతో కొత్త ఉత్తర్వులు జారీచేయాలని కేంద్రం ఆదేశించింది.