ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉంది. అదేమీ ఏపీలో జగన్ సృష్టి కాదు. ఇక కరోనా విషయంలో ఎవరెంత చేసినా జనాల సహకారం ఉంటేనే కానీ అదుపులోకి రాదు. అప్పటికీ ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.
ఇక్కడే విపక్షాలు తమ బుద్ధిని చూపించుకుటున్నాయని అనాల్సి వస్తోంది. నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తూ అటు పాలకులకు ఇటు జనాలకు సహకారంగా ఉండాల్సిన చోట పచ్చి రాజకీయ విమర్శలకు తెర తీయడమే బాధాకరంగా ఉందంటున్నారు .
మాట్లాడితే జగన్ కి పాలన ఏమీ తెలియదు, చేతకాదు ఆయన దిగిపోవాల్సిందే అంటున్నారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. ఒక్క వారం రోజులు చంద్రబాబుకు అప్పగిస్తే మొత్తం కరోనాను కంట్రోల్ లో పెట్టేస్తారు అని కూడా చెప్పేసుకుంటున్నారు.
జగన్ రాజీనామా చేయాలని, కుర్చీ దిగిపోవాలని అచ్చెన్నాయుడు గట్టిగా గర్జిస్తున్నారు. కరోనా చావులకు బాధ్యుడిగా చేసి కేసులు పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరో మాజీ మంత్రి కళా వెంకటరావు అయితే ప్రభుత్వమే లేదు అనేలా మాట్లాడుతున్నారు.
వీరంతా సీనియర్ నేతలు. అయిదేళ్ల పాటు ప్రభుత్వంలో పనిచేశారు. అతి పెద్ద విపత్తులు సంభవించినపుడు పరిస్థితి ఎలా ఉంటుందో వారికి తెలియనిది కాదు. కానీ చిత్రమేంటంటే టీడీపీ దగ్గర మంత్రదండమేదో ఉన్నట్లుగా వారు చెబుతున్నారు.
మా బాబు ఇపుడు ఉంటేనే అంటూ దీర్ఘాలూ తీస్తున్నారు. అయితే ఇది కరోనా కాలం. జనాల ప్రాణాలు పోతున్న పరిస్థితి. కుర్చీలాట కానే కాదు. అది తెలుసుకుని విపక్షాలు సర్కార్ కి సూచనలు ఇస్తే బాగుంటుంది అన్నదే మేధావుల సూచన.