స్పాట్ లో రూ.1600 కోట్లు.. బాబుకు కొడాలి ఛాలెంజ్

కరోనా కష్టకాలంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న చంద్రబాబుకు ఓపెన్ ఛాలెంజ్ చేశారు మంత్రి కొడాలి నాని. ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్న చంద్రబాబు మాటల్ని తిప్పికొడుతూ, బహిరంగంగా సవాల్ చేశారు. 1600 కోట్ల…

కరోనా కష్టకాలంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న చంద్రబాబుకు ఓపెన్ ఛాలెంజ్ చేశారు మంత్రి కొడాలి నాని. ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్న చంద్రబాబు మాటల్ని తిప్పికొడుతూ, బహిరంగంగా సవాల్ చేశారు. 1600 కోట్ల రూపాయలు ఆన్ ది స్పాట్ ఇస్తామని, వ్యాక్సిన్ ఇప్పించాలని బాబుతో సవాల్ చేశారు.

“చంద్రబాబుకు, దొంగరాతలు రాసే దొంగ పత్రికలకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు చెప్పిన ఎకౌంట్ నంబర్ కు 1600 కోట్ల రూపాయలు పంపించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 1600 కోట్ల రూపాయలు ఎక్కడికి పంపాలో చంద్రబాబు చెప్పాలి. రోజుకు 10 లక్షల టీకాలు ఇస్తే, 40 రోజుల్లో టీకా ప్రక్రియ పూర్తిచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.”

భారత్ బయోటెక్, సీరమ్ సంస్థలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామని.. వ్యాక్సిన్ ఉన్నఫలంగా సప్లయ్ చేయలేమని ఆ సంస్థలు ప్రత్యుత్తరం ఇచ్చారని కొడాలి నాని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే, చంద్రబాబు మాత్రం జూమ్ యాప్ లో ఇష్టమొచ్చినట్టు అరుస్తున్నారని, జగన్ ను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు నాని.

“వ్యాక్సిన్ కంపెనీలు రెండింటితో సంప్రదింపులు జరిపాం. స్వయంగా ముఖ్యమంత్రి లేఖ రాస్తే టైమ్ పడుతుందని సమాధానం వచ్చింది. ఇలాంటి టైమ్ లో కరోనా కంటే ప్రమాదకరంగా తయారయ్యారు చంద్రబాబు. ఆయన హెరిటేజ్ పాలల్లో నీళ్లు కలిపినంత ఈజీగా టీకా తయారుచేయొచ్చని బాబు భ్రమలో ఉన్నాడు. జూమ్ యాప్ పెట్టుకొని చంద్రబాబు మొరుగుతుంటే, ఆయన మీడియా ఇష్టమొచ్చినట్టు రాస్తోంది.”

ఏపీకి టీకాలు రాకుండా అడ్డం పడాలి, హాస్పిటల్ కు ఆక్సిజన్ సరఫరా ఆగిపోవాలనే లక్ష్యంతో చంద్రబాబు పనిచేస్తున్నారని ఆరోపించారు నాని. కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవ చేయకపోయినా ఫర్వాలేదు కానీ.. పక్క రాష్ట్రంలో కూర్చొని ఇలాంటి ఆరోపణలు చేయడం మాత్రం మంచిది కాదని బాబుకు హితవు పలికారు నాని.