జనసేనాని పవన్‌కల్యాణ్ ఎట్టకేలకు కరోనా నుంచి విముక్తుడయ్యారు. ఈ సంతోషకర సమాచారాన్ని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదలైంది.
‘జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కోలుకున్నారు. వైద్యసేవలు అందించిన డాక్టర్లు మూడు రోజుల కిందట ఆయనకు మరోసారి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆరోగ్యపరంగా ఆయనకు ఇబ్బందులేమీ లేవని వైద్యులు తెలిపారు’ అని జనసేన పార్టీ పేర్కొంది.
అయితే పవన్‌కల్యాణ్‌ను ఇబ్బంది పెట్టిన ఆ వైరస్ ఎలాంటిదో తెలుసుకునేందుకు తప్పక పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పవన్‌కల్యాణ్ ఇంకా కరోనాతో బాధపడుతున్నారనే విషయాన్ని అందరూ మరిచిపోయారు.
ఆయన కంటే ఆలస్యం గా కరోనా బారిన పడిన మెగాస్టార్ చిన్నల్లుడు కల్యాణ్‌దేవ్ కూడా కోలుకున్నారు. కానీ పవన్‌కల్యాణ్ మాత్రం ఏకంగా 20 రోజులకు పైబడి ట్రీట్మెంట్ తీసుకోవడం గమనార్హం.
గత నెల 15న పవన్‌కు కరోనా పాజిటివ్ విషయమై జనసేన విడుదల చేసిన ప్రకటనను పరిశీలిద్దాం.
‘ జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు కొవిడ్ సోకినట్లు నిర్ధారణ కావడంతో నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతోంది. ఈనెల 3న తిరుపతిలో పాదయాత్ర, బహిరంగ సభలో పాల్గొని పవన్ హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం కరోనా టెస్ట్ చేయించుకోగా, నెగెటివ్ వచ్చింది. అయినా వైద్యుల సూచన మేరకు వ్యవసాయ క్షేత్రంలో క్వారంటైన్లో ఉన్నారు.
తాజాగా కొద్ది పాటి జ్వరం, ఒళ్లు నొప్పులు ఇబ్బంది పెడుతుండటంతో మరోసారి కరోనా పరీక్షలు చేయించుకోవడంతో ఫలితం పాజిటివ్ అని వచ్చింది. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ల సుమన్ ఆధ్వర్యంలో పవన్‌కు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో కాస్త నెమ్ము చేరడంతో యాంటీ వైరల్ మందులతో చికిత్స అందిస్తున్నారు’ అని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటన ఇచ్చింది.
అపోలో నుంచి కూడా ఒక వైద్య బృందం పవన్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని అప్పట్లో తెలిపారు. తన ఆరో గ్యం నిలకడగానే ఉందని, త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానని పవన్ కల్యాణ్ తిరుపతి ఉప ఎన్నికకు సరిగ్గా రెండు రోజుల ముందు తెలపడంపై విమర్శలు వచ్చాయి. ఉప ఎన్నికలో లబ్ధి పొందేందుకే జనసేనాని సరికొత్త డ్రామాకు తెరలేపారని ఆయన ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు చేశారు.
తిరుపతి ఉప ఎన్నికలు ముగిసి, వాటి ఫలితం కూడా వెలువడింది. పవన్‌కల్యాణ్ మద్దతు పలికిన బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మూడు వారాల తర్వాత ఆయన కరోనా నుంచి కోలుకున్నారనే సమాచారం రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పవన్‌కల్యాణ్ ఆరోగ్యం కుదుట పడినందుకు సంతోషిస్తూనే, కొన్ని డిమాండ్స్ తెరపైకి వస్తున్నాయి.
పవన్‌లాంటి హీరోను మూడు వారాల పాటు మంచాన పడేసిన ఆ కరోనాపై తప్పకుండా పరిశోధన చేసి, దాని ప్రత్యేక లక్షణాలు నిగ్గు తేల్చాలనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవు తున్నాయి. ఎందుకంటే ఎవరైనా రెండు వారాలు క్వారంటైన్లో ఉంటే …పూర్తి ఆరోగ్యంగా బయటికి వస్తారని వైద్యులు చెబుతారు. అలాంటిది పవన్ లాంటి హీరోకు ఎందుకని మరో వారం ఎక్కువ పట్టిందో తెలియాల్సిన అవసరం ఉందని అంటున్నారు.