బాలీవుడ్ లో మరో హీరోయిన్ కరోనా బారిన పడింది. ఇప్పటికే కత్రినాకైఫ్, అలియాభట్, దీపిక పదుకోన్ లాంటి హీరోయిన్లు కరోనా బారిన పడగా.. తాజాగా ఈ జాబితాలోకి కంగనా రనౌత్ కూడా చేరిపోయింది. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్న ఈ బ్యూటీ.. తనకు కరోనా సోకినట్టు కొద్దిసేపటి కిందట వెల్లడించింది.
“కొన్ని రోజులుగా నీరసంగా ఉంది. కళ్లు కూడా మంట పెడుతున్నాయి. హిమాచల్ వెళ్లాలనుకున్నాను. అందుకే నిన్న పరీక్ష చేయించుకున్నాను. ఈరోజు రిజల్ట్ వచ్చింది. నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో నేను హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయాను. ఈ వైరస్ నా శరీరంలో పార్టీ పెట్టుకుందని నేను అనుకోలేదు. నేను దీన్ని నాశనం చేయబోతున్నాను.”
కరోనా సోకిందని భయపడొద్దని, మనం ఎంత ఎక్కువ భయపడితే కరోనా అంతలా మనల్ని భయపెడుతుందని అంటోంది కంగన. ఇది చాలా తక్కువ కాలం నిలిచి ఉండే ఫ్లూ అని, అందరం కలిసి కరోనాను తరిమేద్దాం అంటూ పిలుపునిస్తోంది.
గతేడాది లాక్ డౌన్ టైమ్ లో నటుడు సుశాంత్ సింగ్ మరణించినప్పట్నుంచి మరింత రెబల్ గా మారింది కంగన. అప్పట్నుంచి ఇప్పటివరకు ఏదో ఒక అంశంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, వార్తల్లో నలుగుతోంది. ఇప్పుడిలా కరోనా సోకి మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచింది కంగన.