కరోనాపై సెలిబ్రిటీలు అవగాహన కల్పించేందుకు ఒకొక్కరుగా ముందుకొస్తున్నారు. నిన్నటికి నిన్న మెగాస్టార్ కోడలు, రామ్‌చరణ్ భార్య ఉపాసన కూడా కరోనాపై ట్విటర్‌పై వేదికగా అవగాహన కల్పించే యత్నం చేశారు. తాజాగా టెన్నిస్ స్టార్, హైదరాబాదీ సానియామీర్జా కూడా తనవంతుగా కరోనాపై అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చారు.
కరోనా బారిన పడిన తర్వా అప్రమత్తం కావడం కంటే….ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడమే మంచిదని ఆమె సూచిస్తున్నారు. చైనా దేశంలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న తరుణంలో మన దేశ ప్రజలు దీనిపై అవగాహన పెంచుకొని అందరూ అప్రమత్తంగా ఉండాలని సానియామీర్జా సూచించారు.
సానియా మీర్జా ఒక అడుగు ముందుకేసి ఓ వీడియోను కూడా విడుదల చేశారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించే ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కరోనా వైరస్ లక్షణాలైన జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాలని సానియా మీర్జా ఆ వీడియోలో కోరారు.
అంతేకాదు కరోనా వైరస్‌పై సమాచారం కోసం హెల్ప్ లైన్ నంబరు 104 కు కాల్ చేయాలని సూచించారు. ఈ వైరస్ సోకకుండా నిత్యం చేతులు శుభ్రంగా కడుక్కోవాలని కోరారు. కరోనా వైరస్ లక్షణాలుంటే 14 రోజుల పాటు ఐసోలేషన్ వార్డులో చేరి చికిత్స పొందాలని సానియా సలహా ఇచ్చారు. సానియా మీర్జా లాంటి వాళ్లు కరోనాపై అవగాహన కల్పించేందుకు ముందుకు రావడం ప్రశంసనీయం.