ఈ నెలంతా ఇదే రచ్చ రచ్చ

పార్లమెంటు మూడోరోజు కూడా శుభ్రంగా జరగలేదు. దిల్లీ అలర్లపై చర్చించి తీరాలనే ప్రతిపక్షాల పట్టుదలల మధ్య రెండో రోజు సభా కార్యక్రమాలు మొత్తం స్తంభించిపోయాయి. సభలో కనీసం ప్లకార్డులు కూడా ప్రదర్శించరాదన్న స్పీకరు నిర్ణయాలు,…

పార్లమెంటు మూడోరోజు కూడా శుభ్రంగా జరగలేదు. దిల్లీ అలర్లపై చర్చించి తీరాలనే ప్రతిపక్షాల పట్టుదలల మధ్య రెండో రోజు సభా కార్యక్రమాలు మొత్తం స్తంభించిపోయాయి. సభలో కనీసం ప్లకార్డులు కూడా ప్రదర్శించరాదన్న స్పీకరు నిర్ణయాలు, సభ్యుల రాద్ధాంతం.. శృతిమించిన ఆందోళనలు, అధికార విపక్ష సభ్యుల తోపులాటల మధ్య పార్లమెంటు సమావేశాలు గందరగోళంగా జరిగాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ గందరగోళం రెండోరోజుతో ఆగిపోయేది కాదు. ఈ విడత బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు, ఈ నెలమొత్తం ఇదే గందరగోళం కొనసాగే ప్రమాదం కనిపిస్తోంది.

మూడోరోజున సభాకార్యక్రమాల్లో ఒక కొత్త పరిణామం కూడా కనిపించింది. సభను సభ్యులు సరిగా జరగనివ్వడం లేదనే విరక్తితో  స్పీకరు సభకు గైర్హాజరయ్యారు. సభను పూర్తిగా ప్యానెల్ స్పీకర్లే నడిపించారు. అయినా సరే సభ జరిగింది మాత్రం శూన్యం. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆదాయపు పన్నుకు సంబంధించిన వివాద్ సే విశ్వాస్ బిల్లు మాత్రం ఎలాంటి చర్చ లేకుండానే సభ ఆమోదం పొందింది.

విపక్ష పార్టీలకు ఎప్పుడైనా సరే.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఒక్క నిర్దిష్టమైన పాయింట్ దొరికితే చాలు. దాన్ని పట్టుకుని.. ఇక సభను ముందుకు నడవనివ్వకుండా అల్లరి చేయడం అనేది ఇవాళ కొత్తకాదు. ప్రతిసారీ ఇదే తంతు జరుగుతూనే ఉంది. అలాంటిది ఈసారి కేంద్రప్రభుత్వ వైఫల్యం పుష్కలంగా ఉన్నదని చెప్పదగిన  డిల్లీ అల్లర్ల గొడవ ప్రతిపక్షాలకు దొరికింది. ఇక వారు పార్లమెంటులో ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు.

ఏప్రిల్ 2 వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. అప్పటిదాకా ఇదే రచ్చ కంటిన్యూ అవుతుంది. ఢిల్లీ అల్లర్ల వ్యవహారంపై ఈనెల 11న లోక్ సభలోను, 12న రాజ్యసభలోను చర్చించడానికి సభాపతులు అనుమతించారు. అయితే అప్పటిదాకా ఆగడానికి కూడా ప్రతిపక్షాలకు ఓపిక లేనట్లుగా ఉంది. డిల్లీ అల్లర్లపై చర్చ జరిగే దాకా సభాకార్యక్రమాలు జరగనివ్వమంటూ గోల చేస్తున్నారు. పరిస్థితులు ప్రతిసారీ ఇలాగే కొనసాగితే.. అసలు అత్యున్నత చట్టసభ అంటేనే ప్రజలకు గౌరవం పలచనైపోతుంది.

సూపర్ స్టార్ అనేది బిరుదు మాత్రమే కాదు  భాధ్య‌త!

కరోనా సోకకుండా ఉండటానికి సులభమైన పద్ధతులు