చిత్త‌శుద్ధి లేని లేఖ‌లెందుకు బాబు?

బీసీల‌పై టీడీపీ డ్రామాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఒక్క బీసీలే కాదు, అన్ని సామాజిక వ‌ర్గాలు గ‌ట్టిగా బుద్ధి చెప్పినా…ఇంకా గుణ‌పాఠాలు నేర్వ‌డం లేదు. జ‌గ‌న్ స‌ర్కార్ బీసీల‌కు 34 శాతం రిజ‌ర్వేష‌న్‌తో…

బీసీల‌పై టీడీపీ డ్రామాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఒక్క బీసీలే కాదు, అన్ని సామాజిక వ‌ర్గాలు గ‌ట్టిగా బుద్ధి చెప్పినా…ఇంకా గుణ‌పాఠాలు నేర్వ‌డం లేదు. జ‌గ‌న్ స‌ర్కార్ బీసీల‌కు 34 శాతం రిజ‌ర్వేష‌న్‌తో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను మొద‌లు పెట్టి…ముందడుగు వేసిన క్ర‌మంలో…టీడీపీ త‌న పార్టీ నాయ‌కుడితో న్యాయస్థానం ద్వారా అడ్డుక‌ట్ట వేసింది. ఒక వైపు న్యాయ‌స్థానం ద్వారా బీసీల హ‌క్కుల‌ను కాల‌రాసి, మ‌రోవైపు వారిపై త‌మ‌కేదో ప్ర‌త్యేక‌మైన ప్రేమ ఉన్న‌ట్టు మొస‌లి క‌న్నీళ్లు కారుస్తోంది.

హైకోర్టు తీర్పుతో బీసీల‌కు 24 శాతం రిజ‌ర్వేష‌న్‌తో స్థానిక ఎన్నిక‌లకు వెళుతున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు సీఎం జ‌గ‌న్‌కు ఓ లేఖ రాశారు. ఆ లేఖ‌లో  24 శాతం రిజర్వేషన్‌తోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలనుకోవడం గర్హనీయమన్నారు.  ‘33 ఏళ్లుగా 27 శాతం రిజర్వేషన్లు, 25 ఏళ్లుగా 34 శాతం రిజర్వేషన్లు పొందుతున్న లబ్ధిని తీసేయడం బీసీల సాధికారతకు దెబ్బ అన్నారు.  ఇన్ని మాట‌లు మాట్లాడుతున్న చంద్ర‌బాబు త‌న హ‌యాంలో బీసీల‌కు 34 శాతం రిజ‌ర్వేష‌న్‌తో స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించి ఉంటే వ‌ద్ద‌నే వాళ్లు ఎవ‌రు?

అప్పుడు మాత్రం ఎన్నిక‌ల‌ను వాయిదా వేసుకుంటూ వ‌చ్చి, ఇప్పుడు లేఖ‌ రాయడంలో చిత్తశుద్ధి ఏంటి?  నిజంగా బీసీల‌పై టీడీపీ, వైసీసీలకు చిత్తశుద్ధి ఉంటే న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించాల్సిన అవ‌స‌రం ఎంత మాత్రం లేదు. బీసీల‌కు రెండు పార్టీలు 34 శాతం సీట్ల‌ను కేటాయిస్తే స‌రిపోతుంది.

రిజ‌ర్వేష‌న్లు 50 శాతం దాట‌కూడ‌ద‌ని ఇప్ప‌టికే సుప్రీంకోర్టు ప‌లుమార్లు ఆదేశించిన నేప‌థ్యంలో…తాజాగా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును మ‌రోసారి ఆశ్ర‌యించ‌డం వ‌ల్ల ఒన‌గూరే ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌దు. పైగా ఈ నెలాఖ‌రులోపు స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు పూర్తి కాక‌పోతే 14వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోతాయంటున్నారు. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌డం ద్వారా ఎన్నిక‌లు ఆగిపోయి, స్థానిక సంస్థ‌ల‌కు నిధులు నిలిచిపోవ‌డం వ‌ల్ల వ‌చ్చే లాభం ఏంటి?

అందుకే మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబు బీసీల‌పై మాట‌ల్లో కాకుండా చేత‌ల్లో ప్రేమ క‌న‌బరిచి….వారికి 34 శాతం సీట్ల‌ను కేటాయించాలి. అంతే త‌ప్ప చిత్త‌శుద్ధిలేని లేఖ‌లు రాయ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేదు.   రెండు పార్టీలు ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం వ‌ల్ల‌ రాజ‌కీయ కాలుష్యం త‌ప్ప‌…మ‌రే ఫ‌లితం ఉండ‌దు.

కరోనా సోకకుండా ఉండటానికి సులభమైన పద్ధతులు