జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లోని మంత్రులకు స్థానిక ఎన్నికల గుబులు పట్టుకుంది. ఈ ఎన్నికల్లో తమ తమ నియోజకవర్గాలు, తాము ఇన్చార్జిలుగా ఉన్న జిల్లాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గరిష్టమైన విజయాలను నమోదు చేయకపోతే… మంత్రి పదవి ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి. ప్రభుత్వం తమదే అయినప్పటికీ… డబ్బు మద్యం పంపిణీ విషయంలో, ఆర్డినెన్స్ రూపేణా వచ్చిన కొత్త చట్టం అష్టదిగ్బంధనం చేస్తుండగా… ఎన్నికల్లో విజయాలు సాధించడం పై వారు మల్లగుల్లాలు పడుతున్నారు.
స్థానిక ఎన్నికల విజయాలను మంత్రి పదవులకు లంకె పెట్టడం వారికి కష్టంగా ఉంది. అసలే ముక్కిడి… ఆపై పడిశం… అన్న సామెత చందంగా వారి పరిస్థితి ఉంది. వారి మంత్రి పదవులు అన్నీ కేవలం రెండున్నర సంవత్సరాలు డెడ్ లైన్ ఉన్న పదవులే. క్యాబినెట్ ను ఏర్పాటు చేసినప్పుడే… 30 నెలల తర్వాత అందరి పని తీరును పరిశీలించి క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ప్రకటించారు.
ఇప్పుడు ఏకంగా ఐదు నిమిషాలు డెడ్ లైన్ పెట్టారు. స్థానిక ఎన్నికలలో సరైన పనితీరు కనపరచకపోతే గనుక ఐదు నిమిషాలు కూడా ఆలోచించనని జగన్ ప్రకటించారు. ఎమ్మెల్యేలకు ఇంతకంటే ఎక్కువ టెన్షన్ గా ఉంది. స్థానిక ఎన్నికల్లో ఫలితాలు తేడా కొడితే వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా ఉండదని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. జగన్ విషయంలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత.. సంప్రదింపులతో లాభం ఉండదనే సంగతి వారందరికీ తెలుసు. అందుకే ఇటు మంత్రులు, అటు ఎమ్మెల్యేలు తమ సర్వశక్తులూ ఒడ్డి… స్థానిక ఎన్నికలలో విజయం కోసం కష్ట పడుతున్నారు.