ఆదిపురుష్.. ఇకపై అన్నీ ఇక్కడే

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా కరోనా వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ముంబయిలో భారీ సెట్ వేశారు. ఓ షెడ్యూల్ కూడా పూర్తిచేశారు.…

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా కరోనా వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ముంబయిలో భారీ సెట్ వేశారు. ఓ షెడ్యూల్ కూడా పూర్తిచేశారు. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మరో షెడ్యూల్ కోసం రెడీ అవుతున్న టైమ్ లో మహారాష్ట్రలో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఆదిపురుష్ షూటింగ్ ఆగిపోయింది.

అలా ఆగిపోయిన ఆదిపురుష్ షూటింగ్ ను ఇప్పుడు మరోసారి మొదలుపెట్టాలని భావిస్తోంది యూనిట్. మహారాష్ట్రలో పరిస్థితులు బాగాలేవు కాబట్టి, కుదిరితే హైదరాబాద్ లో ఆదిపురుష్ కొత్త షెడ్యూల్ మొదలుపెట్టాలని అనుకుంటున్నారు.

అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే వారం హైదరాబాద్ లో ఆదిపురుష్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఈ మేరకు ప్రభాస్ తో పాటు కృతిసనన్, సైఫ్ అలీఖాన్ అంగీకరించినట్టు తెలుస్తోంది.

ఆదిపురుష్ సినిమాలో గ్రాఫిక్ వర్క్ ఎక్కువ. దాదాపు షూటింగ్ మొత్తం ఇండోర్ లోనే జరుగుతుంది. కాబట్టి ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటే, ఈ కరోనా టైమ్ లో షూటింగ్ చేయడం పెద్ద సమస్య కాదని యూనిట్ భావిస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా అన్నాత్తై షూటింగ్ ఇలానే పూర్తి భద్రతాచర్యల మధ్య నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఆదిపురుష్ సినిమాకు సంబంధించి ఇంకా 90 రోజుల షూటింగ్ పెండింగ్ ఉన్నట్టు యూనిట్ తెలిపింది. వచ్చే వారం నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తే.. అనుకున్న టైమ్ కు కాస్త అటుఇటుగా సినిమాను సిద్ధం చేయొచ్చని దర్శకుడు భావిస్తున్నాడు. 

కరోనాతో షూటింగ్స్ అన్నీ వాయిదా పడుతుంటే.. ఆదిపురుష్ యూనిట్ మాత్రం ఇలా కొత్త షెడ్యూల్ కు ప్లాన్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.