క‌న్నీళ్లు తెప్పించే దృశ్యం

మ‌న వ్య‌వ‌స్థ‌లోని డొల్ల‌త‌నాన్ని కరోనా మ‌హ‌మ్మారి క‌ళ్ల‌కు క‌డుతోంది. ఏడు ద‌శాబ్దాల స్వ‌తంత్ర భార‌తావ‌నిలో పాల‌కుల అస‌మ‌ర్థ‌త‌ను, ప్ర‌జావైద్యం విష‌యంలో నిర్ల‌క్ష్యాన్ని దిగంబ‌రంగా నిల‌బెట్టే ఓ దృశ్యం ప్ర‌తి ఒక్క‌రి హృద‌యాల్ని బ‌రువెక్కిస్తోంది.  Advertisement…

మ‌న వ్య‌వ‌స్థ‌లోని డొల్ల‌త‌నాన్ని కరోనా మ‌హ‌మ్మారి క‌ళ్ల‌కు క‌డుతోంది. ఏడు ద‌శాబ్దాల స్వ‌తంత్ర భార‌తావ‌నిలో పాల‌కుల అస‌మ‌ర్థ‌త‌ను, ప్ర‌జావైద్యం విష‌యంలో నిర్ల‌క్ష్యాన్ని దిగంబ‌రంగా నిల‌బెట్టే ఓ దృశ్యం ప్ర‌తి ఒక్క‌రి హృద‌యాల్ని బ‌రువెక్కిస్తోంది. 

క‌రోనా ఎంత‌గా విల‌య‌తాండ‌వం సృష్టిస్తోందో ఈ ఒక్క ఫొటో చాలు అర్థం చేసుకోడానికి. ఈ ఒక్క ఫొటో చాలు…నిన్న‌టి వ‌ర‌కూ పాల‌న సాగించిన‌, నేడు సాగిస్తున్న రాజ‌కీయ పార్టీలు సిగ్గుప‌డ‌డానికి! అనంత‌పురం ప్ర‌భుత్వ స‌ర్వ‌జ‌న వైద్య‌శాల‌లో ఓ ప‌డ‌క‌పై మృత‌దేహం ప‌క్క‌నే ఓ యువ‌కుడు ఆక్సిజ‌న్ ప‌ట్టుకుంటున్న వైనం క‌న్నీళ్లు తెప్పిస్తోంది. 

అనంత‌పురం ప్ర‌భుత్వ స‌ర్వ‌జ‌న వైద్య‌శాల‌లోని కోవిడ్ విభాగంలో ప‌డ‌క‌ల తీవ్ర‌త రోగుల‌ను తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఒకే ప‌డ‌క‌పై ఇద్ద‌రికి వైద్యం అందించాల్సి వ‌స్తోంది. క‌ణేక‌ల్లు మండ‌లానికి చెందిన సుంక‌న్న అనే వృద్ధుడు క‌రోనాతో గురువారం ఆస్ప‌త్రిలో చేరాడు.

ప‌డ‌క లేద‌నే కార‌ణంతో ఆస్ప‌త్రికి వ‌చ్చిన రోగిని వైద్యులు వెన‌క్కి పంప‌లేక‌పోయారు. దీంతో ఓ యువకుడు ఉన్న పడకపైనే ఆక్సిజన్‌ పెట్టి చికిత్స అందించారు. అత‌న్ని బ‌తికించాల‌న్న వైద్యుల ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. కొద్ది గంటల్లోనే ఆ వృద్ధుడు ఈ లోకాన్ని శాశ్వ‌తంగా వీడాడు.  

అయితే మృతదేహం ప‌క్క‌నే ఆ యువకుడు రెండు గంటల పాటు ఆక్సిజన్‌తో చికిత్స పొందాల్సి వ‌చ్చింది. ఈ ద‌య‌నీయ స్థితిని మీడియా ఆవిష్క‌రించింది. ఇంత‌కూ రోగం వ్య‌క్తుల‌కా? వ్యవస్థకా? అనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫొటో, దాని వెనుక నేప‌థ్యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది.