ఇకపై ఒక్క డోస్ లోనే కరోనా టీకా

ప్రస్తుతం కరోనా టీకాను 2 డోసుల్లో అందిస్తున్నారు. ఒక డోసు పూర్తయిన తర్వాత రెండో డోస్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఆచరణలోకి వచ్చేసరికి ఇక్కడ చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇండియా లాంటి…

ప్రస్తుతం కరోనా టీకాను 2 డోసుల్లో అందిస్తున్నారు. ఒక డోసు పూర్తయిన తర్వాత రెండో డోస్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఆచరణలోకి వచ్చేసరికి ఇక్కడ చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇండియా లాంటి జనాభా ఎక్కువ ఉన్న దేశాల్లో రెండో డోస్ టైమ్ వచ్చేసరికి, వ్యాక్సిన్ల కొరత పట్టి పీడిస్తోంది. ఇప్పుడీ సమస్యలకు విరుగుడుగా కరోనా సింగిల్ డోస్ తయారీని ప్రారంభించింది రష్యా.

ఇప్పటికే రష్యాకు చెందిన సంస్థ రెండు డోసుల్లో ఇచ్చే స్పుత్నిక్-వి టీకాను ఉత్పత్తి చేసింది. ఇప్పుడీ సంస్థ సింగిల్ డోస్ లో ఇచ్చే స్పుత్నిక్ లైట్ వెర్షన్ ను కూడా తయారుచేసింది. దీనికి రష్యాలో అత్యవసర అనుమతి కూడా లభించింది. 

ఈ సింగిల్ డోస్ టీకా 79.4శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు నిర్థారణ అయింది. స్పుత్నిక్ లైట్ లో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్న అంశం ఏంటంటే.. కరోనా కొత్త రకం వేరియంట్లు, మ్యూటెంట్లపై కూడా ఇది ప్రభావవంతంగా పనిచేస్తోంది.

ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ కు సంబంధించి మూడో దశ క్లినికల్ ట్రయిల్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నెలాఖరుకు అవి పూర్తయ్యే అవకాశం ఉంది. స్పుత్నిక్-వి టీకా తయారీకి సంబంధించి ఇప్పటికే ఇండియాకు చెందిన 6 ఫార్మా కంపెనీలు రష్యాతో ఒప్పందం చేసుకున్నాయి.

నిబంధనల ప్రకారం ఈ టీకాను మన దేశంలో ఉత్పత్తి చేయాలంటే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తవ్వాలి. డ్రగ్ కంట్రోల్ బోర్డుకు వాటిని సమర్పించి, తగిన అనుమతి పొందిన తర్వాతే టీకాను ఉత్పత్తి చేయాలి. 

స్పుత్నిక్-వి టీకా కోసం ఒప్పందం చేసుకున్న సంస్థలే, స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ ఉత్పత్తి అనుమతిని కూడా పొందే అవకాశం ఉంది. ఇండియాలో ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి మరో 2-3 నెలలు టైమ్ పట్టొచ్చు.