చిత్రమైన డైలాగ్ తో ఎన్టీఆర్ 30 అనౌన్స్ మెంట్ వచ్చింది. కొరటాల శివ డైరక్షన్ లో సుధాకర్ నిర్మించే సినిమా అనౌన్స్ మెంట్ ఓ చిన్న విడియో రూపంలో వచ్చింది. ఒక డైలాగు మాత్రం వుంది వీడియోలో కానీ హీరో పిక్చర్ మాత్రం షేడ్ రూపంలోనే చూపించేసారు.
‘‘ఒక్కోసారి ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మించి తాను వుండకూడదని, అప్పుడు భయానికి కూడా తెలియాలి తాను రావాల్సిన సమయం వచ్చిందని…’’ అంటూ డైలాగు వదిలారు.
సముద్రం..ఉరుములు మెరుపులు…చేతిలో ఆయుధాలు…ఇవీ సెట్ ప్రాపర్టీలుగా కనిపించాయి. ఇంకా సెట్ మీదకు వెళ్లలేదు కాబట్టి సినిమా గురించి అంతకన్నా చెప్పే అవకాశం లేదు కనుక ఇంత వరకే వదిలారు.
డైలాగ్ లో నిగూఢార్థం బలంగా వుంది కనుక అంత సులువుగా అర్థం కాదు. ధైర్యం వెనక్కు తగ్గి భయం రావడం అన్నది హీరో రాకను విలన్ కు చెప్పడం లాంటి దేమో అనుకోవాలి.
అనిరుధ్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ తో ఈ వీడియో వదిలారు. ఆచార్య సినిమా తరువాత కొరటాల చేస్తున్న సినిమా ఇది. గతంలో జనతా గ్యారేజ్ సినిమాను ఎన్టీఆర్ తో చేసారు. ఇది ఈ కాంబినేషన్ లో రెండో సినిమా.