ఊహూ అన్న బాబు… అలిగిన అఖిల‌!

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అలిగారు. త‌న ప్ర‌తిపాద‌న‌కు చంద్ర‌బాబు జై కొట్ట‌కుండా, ఊహూ అన‌డంతో ఆమె ఆగ్ర‌హంగా ఉన్న‌ట్టు స‌మాచారం. దీంతో క‌ర్నూలులో కమ్మ సంఘం కల్యాణ మండపంలో…

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అలిగారు. త‌న ప్ర‌తిపాద‌న‌కు చంద్ర‌బాబు జై కొట్ట‌కుండా, ఊహూ అన‌డంతో ఆమె ఆగ్ర‌హంగా ఉన్న‌ట్టు స‌మాచారం. దీంతో క‌ర్నూలులో కమ్మ సంఘం కల్యాణ మండపంలో ఉమ్మడి జిల్లా కార్యకర్తల సమావేశానికి, అలాగే ఆ రెండు జిల్లాల చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌కు అఖిల‌ప్రియ డుమ్మా కొట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌రోవైపు అఖిల‌ప్రియ వైఖ‌రిపై చంద్ర‌బాబు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్న‌ట్టు స‌మాచారం.

త‌న ప‌ర్య‌ట‌న‌కే డుమ్మా కొట్టేంత పెద్ద నాయ‌కురాలైందా అని నంద్యాల జిల్లా టీడీపీ నాయ‌కుల్ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం. నంద్యాల‌ జిల్లాలో చంద్ర‌బాబు ప్ర‌వేశించే స‌మ‌యంలో మాత్రం చాగ‌ల‌మ‌ర్రి వ‌ద్ద ఆమె ఆహ్వానం ప‌లికారు. కొంద‌రిని పార్టీలో చేర్పించి చంద్ర‌బాబుతో కండువాలు క‌ప్పించారు. ప‌నిలో ప‌నిగా ఆళ్ల‌గ‌డ్డ టీడీపీ అభ్య‌ర్థిగా త‌న పేరు చంద్ర‌బాబు నోట చెప్పించాల‌న్న ఆమె ప్ర‌య‌త్నాలు బెడిసి కొట్టాయి.

ఆళ్ల‌గ‌డ్డలో అఖిల‌ప్రియ ప్రాభ‌వం పూర్తిగా పోయింద‌ని, టీడీపీ అధిష్టానం భూమా కుటుంబం నుంచే కొత్త అభ్య‌ర్థిని ఎంపిక చేసే ప‌నిలో ఉంద‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. మ‌రోవైపు గ‌తంలో మాదిరిగా గుడ్డిగా టికెట్లు ఇవ్వ‌న‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. స‌ర్వే నివేదిక‌ల ఆధారంగా అభ్య‌ర్థుల ఎంపిక వుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఆళ్ల‌గ‌డ్డ‌లో త‌నకు టికెట్ అనుమాన‌మే అని ప్ర‌చారం సాగుతున్న క్ర‌మంలో అఖిల‌ప్రియ ఇటీవ‌ల కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప‌ది మందికి టికెట్లు ఇచ్చే కెపాసిటీ త‌న‌ద‌ని, అలాంటి త‌న‌కు టికెట్ రాక‌పోవ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించింది. త‌ద్వారా త‌న అనుచరుల్లో భ‌రోసా నింపేందుకు అఖిల‌ప్రియ ప్ర‌య‌త్నించింది.

అయితే ఆళ్ల‌గ‌డ్డ రాజ‌కీయాల్లో రోజురోజుకూ స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయి. కొత్త నాయ‌క‌త్వం బ‌ల‌ప‌డుతున్న వైనాన్ని టీడీపీ అధిష్టానం ప‌సిగ‌ట్టింది. దీంతో టీడీపీ అధిష్టానం పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అఖిల‌ప్రియ‌నే న‌మ్ముకున్న‌ట్టే న‌ట్టేట మునుగుతామ‌ని టీడీపీ అధిష్టానం అప్ర‌మ‌త్త‌మైంది. లోలోప‌ల త‌న ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ఈ క్ర‌మంలో త‌న‌కు పార్టీలో ప్రాధాన్యం త‌గ్గుతోంద‌ని అఖిల‌ప్రియ‌కు అనుమానం వ‌చ్చింది. టీడీపీ నుంచి ప్ర‌త్యామ్నాయ నాయ‌క‌త్వం వైపు వెళుతుండ‌డంతో అఖిల‌ప్రియ‌లో ఆందోళ‌న మొదలైంది.

దీంతో త‌న‌కే టికెట్ ఇస్తార‌ని అధికారికంగా ప్ర‌క‌టించుకోవ‌డం ద్వారా టీడీపీ ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను నిలుపుకోవ‌చ్చ‌ని ఆమె భావించారు. నంద్యాల‌, క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న చంద్ర‌బాబును ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ఆమె వ్యూహం ర‌చించారు. ఇందులో భాగంగా కొంద‌ర్ని పార్టీలో చేర్పించి బాబును ఇంప్రెష్ చేయొచ్చ‌ని ఎత్తుగ‌డ వేశారు. అయితే  క‌ర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఏం జ‌రుగుతున్న‌దో ముందే నివేదిక తెప్పించుకున్న చంద్ర‌బాబు ముందు అఖిల‌ప్రియ ఎత్తులు చిత్త‌య్యాయి.

చాగలమర్రి గ్రామంలో కేవ‌లం పార్టీలో కొంద‌రికి కండువాలు క‌ప్పే వ‌ర‌కే చంద్ర‌బాబు ప‌రిమిత‌మ‌య్యారు. ఆళ్ల‌గ‌డ్డ అభ్య‌ర్థిగా త‌న పేరు చంద్ర‌బాబుతో చెప్పించాల‌ని మాజీ మంత్రి ఎన్ఎండీ ఫ‌రూక్‌, అలాగే బాబు వ్య‌క్తిగ‌త కార్య‌క్ర‌మాల‌ను చూసే వ్య‌క్తి ద్వారా అఖిల‌ప్రియ ప్ర‌య‌త్నించార‌ని స‌మాచారం. కానీ చంద్ర‌బాబు స‌సేమిరా అన్న‌ట్టు తెలిసింది. త‌న అభ్య‌ర్థిత్వం ప్ర‌క‌టించ‌డంపై చంద్ర‌బాబు ఊహూ అన‌డంతో అఖిల‌ప్రియ అలిగిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అందుకే చాగ‌ల‌మ‌ర్రి త‌ర్వాత, చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో అఖిల‌ప్రియ, ఆమె భ‌ర్త భార్గ‌వ్‌రామ్‌, త‌మ్ముడు జ‌గ‌త్‌విఖ్యాత్‌రెడ్డి ఎక్క‌డా క‌నిపించ‌లేద‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

చివ‌రికి క‌ర్నూలు, నంద్యాల జిల్లాల కార్య‌క‌ర్త‌ల స‌మావేశానికి పార్ల‌మెంట్‌, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌లు అంద‌రూ హాజరైనా, అఖిల‌ప్రియ మాత్రం కోపంతో ఆళ్ల‌గ‌డ్డ‌లో ఇంటి వ‌ద్దే ఉండిపోయార‌ని చెబుతున్నారు. త‌న‌కు టికెట్ ఇవ్వ‌ర‌నే అనుమానం బాబు తాజా వైఖ‌రితో బ‌ల‌ప‌డింద‌ని స‌మాచారం. త‌న‌కు ఎలాగైనా టికెట్ ఇవ్వ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో స‌ర్వే సాకుతో దూరం పెడుతున్నార‌ని అనుచ‌రుల వ‌ద్ద అఖిల‌ప్రియ వాపోతున్నార‌ని తెలిసింది. 

అఖిల‌ప్రియ గైర్హాజ‌రైన విష‌యాన్ని పార్టీ నాయ‌కులు చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు తెలిసింది. త‌మ కోసం పార్టీని వాడుకోవాల‌నే నాయ‌కుల కంటే, టీడీపీకి ప‌నికొచ్చే నాయ‌కుల‌ను త‌యారు చేయాల‌ని బాబు ఆదేశించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆళ్ల‌గ‌డ్డ టీడీపీలో రానున్న రోజుల్లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకునే అవ‌కాశం ఉంది. మొత్తానికి చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌కు అఖిల‌ప్రియ డుమ్మా కొట్ట‌డంపై టీడీపీలో అంతర్గ‌తంగా తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది.